- వాల్‌పోస్టర్లు ఆవిష్కరించిన కలెక్టర్లు
ఆసిఫాబాద్, వెలుగు: పేద విద్యార్థులకు ప్రభుత్వ గురుకులాలు వరం లాంటివని ఆసిపాబాద్ కలెక్టర్ కె.హరిత అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లో అడిషనల్ కలెక్టర్లు దీపక్ తివారీ, ఎం.డేవిడ్, కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లా, ఆర్డీవో లోకేశ్వర్ రావు, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నదీమ్‌తో కలిసి మైనారిటీ గురుకులాల ప్రవేశాల పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పేద విద్యార్థులకు గురుకులాల ద్వారా ఉచిత విద్యతో పాటు వసతి సౌకర్యం కల్పిస్తున్నాయని తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరంలో 5వ తరగతిలో ప్రవేశాలకు అన్ని వర్గాల నుంచి 6, 7, 8 తరగతుల్లో మైనారిటీ గురుకులాల్లో ఖాళీలు ఉన్నచోట ప్రవేశాలు కల్పిస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తాం
జిల్లాలోని గిరిజనుల అభివృద్ధికి అధికారుల సమన్వయంతో కృషి చేస్తామని కలెక్టర్ కె.హరిత అన్నారు. జిల్లా మొదటి మహిళా కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించిన హరిత మంగళవారం కెరమెరి మండలం జోడేఘట్ గ్రామాన్ని సందర్శించి కుమ్రంభీం సమాధి, విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆదివాసీ నాయకులు, అధికారులతో కలిసి గిరిజన మ్యూజియాన్ని సందర్శించారు.
మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాలు
నస్పూర్, వెలుగు: మంచిర్యాల జిల్లాలోని మైనారిటీ గురుకులాల్లో ప్రవేశాల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నామని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు. గురుకుల విద్యాసంస్థల్లో ప్రవేశాలకు సంబంధించిన వాల్ పోస్టర్లను మంగళవారం కలెక్టరేట్లో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి నీరటి రాజేశ్వరి, అధికారులతో కలిసి ఆవిష్కరించారు.
కలెక్టర్ మాట్లాడుతూ.. మైనారిటీ గురుకులాల్లో 5వ తరగతి నుంచి ఇంటర్ ఫస్టియర్ వరకు ప్రవేశాల కోసం మైనారిటీ విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని చెప్పారు. tgmreistelangana.cgg.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, వివరాలకు 7331170790 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. కార్యక్రమంలో విజిలెన్స్ అధికారులు ఎండీ తాహెరుద్దీన్, అకాడమీ సమన్వయకర్త రిజ్వాన్, పలు స్కూళ్లు, కాలేజీల ప్రిన్సిపాల్స్తదితరులు పాల్గొన్నారు.
