- కలెక్టర్ కె.హరిత
ఆసిఫాబాద్, వెలుగు : ప్రభుత్వ ఉద్యోగులు సమయపాలన పాటించాలని, విధులకు ఆలస్యంగా వచ్చే ఉద్యోగులపై చర్యలు తప్పవని కలెక్టర్ కె.హరిత హెచ్చరించారు. శుక్రవారం కలెక్టరేట్ లోని హెచ్ విభాగ కార్యాలయాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు అందించే క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. నిబద్ధతతో, క్రమశిక్షణతో పని చేయాలని చెప్పారు.
పేర్లు నమోదు చేసుకోవాలి..
18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటర్ జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె.హరిత సూచించారు. కలెక్టరేట్ లో జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా అడిషనల్ ఎం. డేవిడ్, ఆర్డీవో లోకేశ్వర్ రావు, డీఆర్డీవో దత్తారావుతో కలిసి ఓటరు ప్రతిజ్ఞ చేశారు.
భక్తులకు ఇబ్బందులు లేకుండా చూడాలి..
రెబ్బెన మండలం గంగాపూర్ గ్రామంలో జరగనున్న బాలాజీ వెంకటేశ్వరస్వామి జాతర మహోత్సవంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్ కె.హరిత అధికారులను ఆదేశించారు. గంగాపూర్ గ్రామాన్ని ఆమె సందర్శించి జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.
