ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించాలి : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు: వడ్ల కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యాన్ని వెంటనే రైస్​మిల్లులకు తరలించాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే ఆదేశించారు. శనివారం రెబ్బెన మండలం ఇందిరానగర్ లో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని అడిషనల్ కలెక్టర్ డేవిడ్ తో కలిసి పరిశీలించారు. రైస్ మిల్లుల యజమానులు ధాన్యాన్ని ఆలస్యంగా చేయకుండా మిల్లుల్లో దించుకోవాలన్నారు. అకాల వర్షాలు కురుస్తున్నందున కొనుగోలు కేంద్రాల్లో టార్పాలిన్లు అందుబాటులో ఉంచి, ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

ఇందిరమ్మ ఇండ్ల పనుల్లో వేగం పెంచాలి

జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. శనివారం కలెక్టరేట్ లో మండలాల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, గృహ నిర్మాణ శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్​ నిర్వహించారు. పైలట్ గ్రామాల్లో ఇండ్ల నిర్మాణం, అర్హుల జాబితా, రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హుల ఎంపిక, తాగునీటి సరఫరా, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్ నిర్మాణం, ఉపాధి హామీ పనుల్లో కూలీల సంఖ్య పెంపు తదితర అంశాలపై అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి సమీక్షించారు. రాజీవ్ యువ వికాసం పథకానికి అర్హులను ఎంపిక చేసి, జాబితాను జిల్లా స్థాయి కమిటీకి పంపించాలన్నారు. జూన్ 2న మంజూరు పత్రాలు అందించనున్నట్లు పేర్కొన్నారు.