
- ఆసిఫాబాద్ కలెక్టరేట్ వద్ద 2 వేల మంది మహిళల నిరసన
- కలెక్టరేట్ గేటుకు తాళం వేసిన పోలీసులు
- ఆన్లైన్లో అప్లై చేసుకోవాలని సూచించిన డీఆర్వో
- కలెక్టర్ చాంబర్ ఎదుట బైఠాయించి నిరసన
అప్లై చేసుకునేందుకు ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌కు సుమారు రెండు వేల మంది మహిళలు తరలివచ్చారు. గృహలక్ష్మి అప్లికేషన్లు గ్రీవెన్స్‌లో తీసుకోరని అధికారులు చెప్పడంతో కలెక్టర్ చాంబర్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు.
ఆసిఫాబాద్, వెలుగు : గృహలక్ష్మి స్కీమ్‌కు అప్లై చేసుకునేందుకు కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్‌కు సుమారు 2వేల మంది దాకా మహిళలు తరలివచ్చారు. పది గంటలకే మహిళలంతా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. తమకు ఇండ్లు లేవని, డబుల్ బెడ్రూం ఇండ్లు వస్తాయని ఆశగా ఎదురుచూశామని, ఇక రావని తెలిసి గృహలక్ష్మి స్కీమ్ కోసం అప్లికేషన్ పెట్టుకునేందుకు వచ్చామని తెలిపారు. తమ దరఖాస్తులు తీసుకొని స్కీమ్ వర్తింపజేయాలంటూ అక్కడి అధికారులను కోరారు. కాగా, గృహలక్ష్మి అప్లికేషన్లు గ్రీవెన్స్‌లో తీసుకోరని, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని డీఆర్వో రాజేశ్వర్ మహిళలకు సూచించారు. పోయిన వారం దాకా నేరుగా దరఖాస్తులు తీసుకున్న ఆఫీసర్లు.. ఇప్పుడు ఎందుకు తీసుకోరంటూ డీఆర్వోతో మహిళలు వాగ్వాదానికి దిగారు. ఆఫీసర్లు సముదాయించేందుకు ప్రయత్నించినప్పటికీ.. మహిళలు వినకుండా గ్రీవెన్స్ చాంబర్ ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు
‘‘మేము మనుషులం కాదా.. మా ఓట్లు పనికిరావా?”అంటూ అధికారులను మహిళలు నిలదీశారు. దీంతో అధికారులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి మహిళలను బయటికి తీసుకెళ్లి మెయిన్ గేట్‌కు తాళం వేశారు. ఈక్రమంలో మహిళలు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. తాము కేవలం అప్లికేషన్లు ఇచ్చేందుకు వచ్చామని, వాటిని కూడా తీసుకోకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. చాంబర్ లోపల ఉన్న మహిళలను బయటికి పంపించేందుకు పోలీసులు ప్రయత్నించినా సాధ్యం కాలేదు. అప్లికేషన్లు తీసుకునే వరకు కదలేది లేదని అక్కడే కూర్చున్నారు. చివరికి కలెక్టర్ హేమంత్ సహదేవ్ రావు స్పందించారు. గృహలక్ష్మి అప్లికేషన్లు తీసుకునేందుకు త్వరలోనే స్పెషల్ కౌంటర్ ఓపెన్ చేస్తామని ప్రకటించారు.