
- ధ్వంసమై రోడ్లు, కల్వర్టులు
- గోస పడుతున్న జనం
- అంబులెన్స్ కూడా వెళ్లలేని పరిస్థితి
- వైద్య సేవలకు దూరంగా అనేక గ్రామాలు
- ఆసిఫాబాద్ జిల్లాలో దయనీయ పరిస్థితులు
ఆసిఫాబాద్, వెలుగు: ఇటీవల కురిసిన భారీ వర్షాలు, పోటెత్తిన వరదలతో ఆసిఫాబాద్ జిల్లాలో జనజీవనం స్తంభించిపోయింది. గ్రామాలు జలదిగ్బంధమయ్యాయి. నదులు, వాగులు, వంకలు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. చాలా చోట్ల రహదారులు ఛిద్రమయ్యారు.రోడ్డు, కల్వర్టులు ధ్వంసమయ్యాయి. అంబులెన్సులు కూడా వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. అత్యవసర సమయాల్లో వైద్యం అందక ప్రజలు గోస పడుతున్నారు. అడవులతో నిండిన గిరిజన జిల్లాలో రహదారుల సమస్య వెంటాడుతోంది.
జిల్లాలో ఏకంగా 360 గ్రామాల్లో రోడ్డు సౌకర్యం లేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు నిత్యం నరకం అనుభవిస్తున్నారు. గ్రామాల్లో వ్యాధులు ప్రబలినా, నారోగ్యానికి గురైనా కనీసం హెల్త్ క్యాంపులు నిర్వహించేందుకు 108 వెహికిల్స్ సైతం వెళ్లలేని పరిస్థితి. వెంటనే నిధులు మంజూరు చేసి రిపేర్లు చేపట్టి ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
ఆ ఊళ్లకు అంబులెన్స్ వెళ్లదు
జైనూర్ మండలం చితకర్ర పంచాయతీ పరిధిలోని కిసాన్ నాయక్ తండా, చితకర్ర, తాడిగూడ గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఉన్న మట్టి రోడ్లు వర్షాకాలంలో బురద మయంగా మారడం వల్ల వాహనాలు వెళ్లడం లేదు. దీంతో గ్రామస్తులకు వైద్య సేవలు అందడంలేదు. రోగులు, గర్భిణులు, జ్వర బాధితులు నరకయాతన అనుభవిస్తున్నారు. నిత్యావసరాలు, ఎరువుల కోసం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
తిర్యాణి మండలంలోని గుండాల, మంగి, గీసిగూడ, తాటి గూడా, గోవేనా, గొపేరా, కుర్సీ గూడ, నాగు గూడా, గొపేర కోలాం గూడ, కౌటాగాం, ముల్కల మంద, భీం రేలా, అర్జున్ లొద్ది, మార్క గూడా, కుంట గూడ, గుట్ట గూడ, జీవిని, లోహ, పునాగూడ తదితర గ్రామాల్లో రోడ్డు సౌకర్యం లేదు. ప్రతి ఏటా వానాకాలంలో దవాఖానకు, అత్యవసర పనుల కోసం వెళ్లాలంటే ఇబ్బందులు తప్పడం లేదు.
ఇటీవల కురిసిన వర్షాలకు కెరమెరి మండలంలోని వివాదాస్పద గ్రామాలైన పరందోళి, ముక్కద్దాం గూడకు వెళ్లే రోడ్డు కోతకు గురైంది. ఉమ్రి నుంచి ఘాట్ సెక్షన్ వరకు రోడ్డు గుంతలు పడటంతో సరిహద్దు గ్రామాల ప్రజలకు తిప్పలు పడుతున్నారు.
ఆసిఫాబాద్ మండలం రాజురా లోలెవల్ వంతెన కోతకు గురైంది. దీంతో జిల్లా కేంద్రానికి వెళ్లే విద్యార్థులు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాన వస్తే రాకపోకలు నిలిచిపోతున్నాయి. రాత్రి వేళల్లో అత్యవసర పరిస్థితుల్లో అరిగోస తప్పడంలేదు.
ఈ ఫొటోలో కనిపిస్తున్నది పెంచికల్ పేట్ మండలం మేరుగూడకు వెళ్లే రోడ్డు. మండల కేంద్రానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి రోడ్డు సౌకర్యం లేదు. మార్గ మధ్యలో ఉన్న బొక్కువాగు ప్రాజెక్ట్ కట్ట మీద ఉన్న బురద దారిలో వెళ్లాల్సిందే. వానాకాలం మాత్రం ఊరికి అంబులెన్స్ వెళ్లే అవకాశం లేదు.