న్యూఢిల్లీ: పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సోదరి అలీమా ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాక్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ఇండియాతో యుద్ధం కోసం ఆరాటపడుతున్నాడని తెలిపారు. తన సోదరుడు ఇమ్రాన్ ఖాన్ మాత్రం పొరుగుదేశంతో సన్నిహిత సంబంధాల కోసం ప్రయత్నాలు చేశాడని చెప్పారు. ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ అలీమా ఖాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ఆసిమ్ మునీర్ ఇస్లామిక్ ఛాందసవాది. ఇమ్రాన్ ఖాన్ స్వేచ్ఛావాది. అతడు ఇస్లామిక్ ఛాందసవాదాన్ని నమ్మని వారిపై యుద్ధానికి దిగుతాడు. అందుకే ఇండియాతో యుద్ధం చేయడానికి ఆరాటపడుతున్నాడు. ఇమ్రాన్ ఖాన్ పొరుగుదేశంతో స్నేహపూర్వక సంబంధాలకు ప్రయత్నాలు చేశాడు.
ఆసిమ్ మునీర్ మాత్రం సందర్భం వచ్చినప్పుడల్లా భారత్ తో ఘర్షణలకు దిగుతాడు. ఇది భారత్‌తో పాటు దాని మిత్ర దేశాలకు కూడా నష్టమే’’ అని పేర్కొన్నారు. ఇమ్రాన్ ఖాన్ ఉదారవాది అని అతడి విడుదల కోసం పశ్చిమ దేశాలు మరిన్ని ప్రయత్నాలు చేయాలని అలీమా ఖాన్ విజ్ఞప్తి చేశారు.
