తెలంగాణ సీఎం.. పీఎం కంటే గొప్పనా ?

తెలంగాణ సీఎం.. పీఎం కంటే గొప్పనా ?
  • మునుగోడు.. మామూలు బై పోల్
  • అందులో సవాల్​గా తీసుకునేంత ఏముంది: కేటీఆర్
  • ధరణి, స్టూడెంట్లు, పంట నష్టం మంత్రులు చూసుకుంటరు
  • ప్రైవేట్ విజిట్లకు వచ్చిన పీఎంకుప్రొటోకాల్ అవసరం లేదు
  • డీపీ మారిస్తే ఏమొస్తది.. జీడీపీ పెరిగితేనే దేశం ముందుకు
  • ‘ఆస్క్ కేటీఆర్’​లో ప్రశ్నలకు సమాధానాలు


హైదరాబాద్, వెలుగు: మునుగోడు ఒక మామూలు బై ఎలక్షన్ అని అందులో సవాల్​గా తీసుకునేంత ఏముంటదని.. అంతగా ఏం మారుతదని మంత్రి కేటీఆర్ అన్నారు. ధరణి పోర్టల్ తో ఇబ్బందులు పడుతున్నామని.. బాసర ట్రిపుల్​ ఐటీ స్టూడెంట్ల బాధలు పట్టించుకోవాలని,  గెస్ట్ లెక్చరర్లను రెన్యువల్ చేయాలంటూ, వర్షాలు, వరదలకు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలంటూ పలువురు మంత్రి కేటీఆర్​కు ట్విట్టర్లో మొర పెట్టుకున్నారు. శుక్రవారం సాయంత్రం ట్విట్టర్​లో ఆయన ఆస్క్ కేటీఆర్ కార్యక్రమం నిర్వహించారు. 

ఈ సందర్భంగా రాష్ట్రంలోని అనేక సమస్యలు మంత్రి దృష్టికి ట్వీట్ల రూపంలో తీసుకెళ్లారు. పాస్ పుస్తకంలో ఉన్న తన సర్వే నంబర్ పై.. ధరణి పోర్టల్లో వేరే పేరు చూపిస్తుందని ఒకరు సమస్యను విన్నవించుకుంటే సీఎస్ చూసుకుంటారంటూ సమాధానం ఇచ్చారు. ‘‘తెలంగాణ అంటే హైదరాబాద్‌‌ ఒక్కటే కాదని.. జిల్లాలు కూడా ఉన్నాయి. వాటిని కూడా అభివృద్ధి చేయాలి’’ సర్ అంటూ వచ్చిన ట్వీట్ కు బదులుగా అన్ని జిల్లాల అభివృద్ధిపై దృష్టి సారించాం బ్రదర్ అంటూ రిప్లై చేశారు. వీఆర్ఏలకు పే స్కేల్.. ఇతర సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

వచ్చే ఎన్నికల్లో టీఆర్​ఎస్​ సీఎం అభ్యర్థి మీరేనా

రాజకీయాల పైనా పలువురు ప్రశ్నలు సంధించారు. వచ్చే ఎలక్షన్స్ కు ఎలా సిద్ధమవుతున్నారు? టీఆర్ఎస్ నుంచి సీఎం అభ్యర్థి మీరేనా? అని అడిగిన ప్రశ్నకు.. ‘‘సమర్థుడైన కేసీఆర్ ఉన్నారు.. తెలంగాణ ప్రజల  దీవెనలతో ఆయన హ్యాట్రిక్‌‌ కొడతారు” అని కేటీఆర్​ రిప్లై ఇచ్చారు. టీడీపీ, కాంగ్రెస్​తో పొత్తు ఉంటుందా అంటే.. తెలంగాణ ప్రజలతో పొత్తు ఉంటుందన్నారు. బీజేపీ నాయకులు ప్రచారంలో దూసుకుపోతుంటే టీఆర్ఎస్ పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారని వచ్చిన ట్వీట్ కు ఖాళీ గిన్నెలకు మోత ఎక్కువ అన్నారు. ఆంధ్రాలో పోటీ చేయాలని వచ్చిన సూచనకు .. థ్యాంక్స్ ఫర్ ఇన్విటేషన్ అంటూ ట్వీట్ చేశారు. వచ్చే సంవత్సరం వివిధ నియోజకవర్గాల్లో బై ఎలక్షన్స్ వస్తాయన్న బండి సంజయ్ ప్రకటనపై ‘‘ముంగేరి లాల్ కి హసీన్ స్వప్నే’’ అని రిప్లై ఇచ్చారు.

డ్రైనేజీ వ్యవస్థ ఎప్పుడు బాగు చేస్తరు

ఆసరా పెన్షన్లను నేరుగా బ్యాంకు అకౌంట్లలో జమ చేసే విషయమై ఆలోచన చేయనున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లో ఆడపా దడపా పడే వర్షాలకు కూడా కాలనీలు, ఇండ్లలో గంటల తరబడి నీళ్లు నిలుస్తున్నాయని.. డ్రైనేజీ సిస్టమ్ ఎప్పుడు డెవలప్ చేస్తారని ప్రశ్నించారు. ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. హైదరాబాద్​లో ఉన్నచెరువులను ఎప్పుడు క్లీన్ చేస్తారని అడిగితే పని మొదలుపెట్టినట్లు చెప్పుకొచ్చారు. 

డీపీ మారిస్తే ఏం వస్తది 

కొత్త సెక్రటేరియెట్ ఎప్పుడు అంటూ వచ్చిన ప్రశ్నకు.. దసరాకు సిద్ధమవుతుందని ఆశిస్తున్నట్లు కేటీఆర్ పేర్కొన్నారు. బిగ్ స్ర్కీన్​పై చూడొచ్చా అని అడిగిన దానికి ఇప్పటివరకూ తన రాజకీయ ప్రసంగాలను చూడకపోతే ‘బిగ్‌‌స్క్రీన్‌‌’పై చూడొచ్చు అన్నారు. జాతీయ జెండాను వాట్సప్‌‌ డీపీగా మార్చాలని పీఎం చెప్పడం వల్ల దేశ జీడీపీ పెరుగుతుందా? అనే ప్రశ్నకు సోషల్ మీడియాలో ప్రొఫైల్‌‌ పిక్‌‌ మారిస్తే ఏం జరుగుతుంది? జీడీపీ మారితేనే దేశం ముందుకు వెళ్తుందన్నారు. విద్యుత్ సంస్కరణపై స్పందిస్తూ భారత్‌‌ లాంటి దేశంలో సమతుల్యత అనేది అవసరమన్నారు. పూర్తిగా ప్రైవేటీకరిస్తే రాయితీలు పొందే రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. తన కాలి గాయం నుంచి కోరుకుంటున్నట్లు, త్వరలోనే విధులకు హాజరుకానున్నట్లు కేటీఆర్ తెలిపారు.

తెలంగాణ సీఎం.. పీఎం కంటే గొప్పనా ?

ఆరు  నెలల్లో సీఎం కేసీఆర్ మూడుసార్లు ప్రొటోకాల్ ఉల్లంఘించారని..  ప్రధాని మోడీ రాష్ట్రానికి వస్తే సాదరంగా ఆహ్వానించరా? తెలంగాణ సీఎం.. ప్రధానికన్నా గొప్పవారా? హిందీలో సమాధానం ఇవ్వగలరు అంటూ వచ్చిన ట్వీట్​కు కేటీఆర్ స్పందించారు. ప్రొటోకాల్ స్పష్టంగా పాటించినట్లు చెప్పారు. ప్రైవేటు విజిట్లకు వచ్చిన ప్రధానిని సీఎం సాదరంగా ఆహ్వానించాల్సిన అవసరం లేదన్నారు.