స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన తొలగించండి..! ప్రభుత్వానికి ఆశావహుల విజ్ఞప్తి

స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన తొలగించండి..! ప్రభుత్వానికి ఆశావహుల విజ్ఞప్తి

హైదరాబాద్, వెలుగు: ఇద్దరు పిల్లలకంటే ఎక్కువ మంది సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయరాదనే నిబంధనను ఎత్తివేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ రూల్​వల్ల చాలా మంది లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కోల్పోతున్నారు. దీంతో ఇటీవల కాలంలో ఆశావహులు ఇద్దరి పిల్లల నిబంధనను తొలగించేలా పంచాయతీరాజ్ చట్టంలో సవరణ చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లారు. వారు ఇదే విషయం సీఎం రేవంత్‌‌రెడ్డికి విన్నవించారు. 

మున్సిపాలిటీలకు లేని నిబంధన పంచాయతీలకు ఎందుకని సర్కారుపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల ముందు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అధిక సంతానం ఉన్న వారిని నిషేధించే నిబంధన తొలగించాలని యోచనలో సర్కారు ఉన్నట్టు తెలిసింది. ఇందుకోసం పంచాయతీ రాజ్ చట్టం 2018 సెక్షన్ 21(3)ని తొలగించే ప్రతిపాదనను కేబినెట్​ ముందు ఉంచనున్నది. 

 గతంలోనే పంచాయతీ రాజ్ శాఖ ఈ నిబంధన ఎత్తివేయాలని సర్కారుకు ప్రతిపాదనలు పంపింది. కానీ ప్రభుత్వం ఈ అంశంపై స్పందించలేదు. ఇటీవల ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి పెరగడంతో  పునరాలోచనలో పడింది. అలాగే, బీసీ లకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలంటే ఈ మార్పు అవసరమని భావిస్తున్నది.  

1995లో పంచాయతీ రాజ్ చట్టం 

జనాభా నియంత్రణలో భాగంగా ఉమ్మడి ఏపీ సర్కారు 1995 మే 30న పంచాయతీరాజ్ చట్టంలోని 21వ పేజీలో 3వ అంశంగా ఈ నిబంధనను చేర్చింది. ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలున్నవారికి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని రద్దు చేశారు. ఫలితంగా ఎంతో మంది ఆశావహులకు నిరాశే మిగిలింది. స్థానిక సంస్థల్లో పోటీ చేయాలనే ఆసక్తి ఉన్నా.. ఇద్దరి పిల్లల నిబంధనతో డ్రాప్ అవుతున్నారు. 

ఎవరైనా పోటీ చేసి విజేతలుగా నిలిచినా.. ఓటమిపాలైన వారు కోర్టును ఆశ్రయించిన సంఘటనలు అనేకం ఉన్నాయి. కోర్టులు కొన్నిసార్లు తీర్పును త్వరగా వెలువరిస్తే మళ్లీ వారు పై కోర్టులకు వెళ్తున్న సందర్భాలు ఉన్నాయి. వీటన్నింటికీ చెక్ పెట్టాలంటే పంచాయతీరాజ్ చట్ట సవరణనే మార్గం అని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. అదే చట్టం చేసి 30 ఏండ్లు గడుస్తున్నప్పటికీ ఇప్పటివరకు సవరణ చేయలేదు.

పంచాయతీకే ఈ నిబంధన ఎందుకు..? 

ఎంత మంది సంతానం ఉన్నా.. మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇచ్చినప్పుడు.. పంచాయతీ ఎన్నికల్లో  ఇద్దరి పిల్లల కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే పోటీ చేయవద్దు అనే నిబంధన ఎందుకనే ప్రశ్న ఉత్పన్నం అవుతున్నది. అయితే,  2019లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మున్సిపాలిటీ చట్ట సవరణ చేసి ఇద్దరు పిల్లలు అనే నిబంధనలు సడలించినట్లే.. పంచాయతీ రాజ్ చట్టం సవరించాలని, దీని ద్వారా పోటీచేసేవారికి ఊరట లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.