కారు ఓవర్​ లోడు నియోజకవర్గాల్లో పెరుగుతున్న ఆశావాహులు 

కారు ఓవర్​ లోడు నియోజకవర్గాల్లో పెరుగుతున్న ఆశావాహులు 
  •     వారి వైపే చూస్తున్న సీనియర్లు, కార్యకర్తలు అయోమయంలో మిగిలిన క్యాడర్​ 
  •     కాపాడుకునేందుకు ఎమ్మెల్యేల ప్రయత్నం

‘తమ్మీ ఏడున్నవ్! ఈసారి టికెట్​ మనకే. మనం ప్రోగ్రామ్​లు బాగా చేయాలె.  మనకు ఎంపీ సంతోష్​ అన్న అండ ఉంది. మీరు గ్రౌండ్​ లెవల్ల ఇది ప్రచారం చేయుండ్రి, జనాన్ని అట్రాక్ట్​ చేయాలె’ అంటూ ఒక లీడర్​ నిరంతరం  దగ్గరి కార్యకర్తలకు ఫోన్లు చేసుకుంటూ అందుబాటులోకి వస్తున్నాడు. ‘కాదు, కేటీఆర్​ నాకు బాగా దగ్గర.. ఈసారి టికెట్టు నాకే ఖాయం’ అని మరొకరు అంటున్నారు.  రోజులు గడుస్తున్న కొద్ది జిల్లాలోని రెండు నియోజక వర్గాల్లో ‘కారు టికెట్టు’ను ఆశిస్తున్న కొత్తవారు తెరమీదకు వస్తున్నారు. కార్యకర్తలతో   సోషల్​ మీడియాలో , బయటా  టికెట్టు తమకే అంటూ ప్రచారం చేయిస్తున్నారు. దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లోని  కారులో ఆశావాహుల లోడు పెరుగుతోంది. వారికి తగ్గట్టు బీఆర్​ఆస్​ కార్యకర్తలు సిట్టింగ్​ ఎమ్మెల్యేలను కాదని కొత్త లీడర్లకు జై అంటున్నారు. మరికొందరు ఎటుపోవాల్ననే అయోమయంలో పడ్డారు.

నిర్మల్, వెలుగు: నిర్మల్​ జిల్లాలోని ఖానాపూర్​, ముధోల్​ నియోజక వర్గాల్లోని బీఆర్​ఎస్​లో ఆశావాహుల ప్రయత్నాలు ఎక్కువ ఉన్నాయి. రోజురోజుకూ టికెట్ ఆశిస్తున్న వారి సంఖ్య భారీగా పెరుగతోంది. ఈ వ్యవహారం ఇటు సిట్టింగ్​ ఎమ్మెల్యేలకు, కార్యకర్తలకు టెన్షన్​గా మారింది. నిన్నా మొన్నటి వరకు ఎమ్మె ల్యేల కనుసనల్లోనేనడిచినకార్యకర్తలంతా ఇప్పుడు కొత్తబాట పడుతున్నారు.ఎమ్మెల్యే నుంచి వచ్చే ఒక్క మెసేజ్​కే ఇంటి ముందు వాలిపోయే చాలామంది కార్యకర్తలు ఇప్పుడు అటువైపు కూడా పోవట్లేదని తెలుస్తోంది. 

ఖానాపూర్​లో.. 

ఖానాపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే రేఖా నాయక్ కు పోటీగా నలుగురు కొత్త నాయకులు రెడీ అయ్యారు. ఈసారి టికెట్ తమకే రాబోతుందంటూ ప్రచారం చేసుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున సామాజికకార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.గ్రామాల్లో సైతంబీఆర్​ఎస్​పేరుతోబ్యానర్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటిల్లో ఎమ్మెల్యే రేఖా ఫొటో కనిపించకపోవడంతో ఎమ్మెల్యే అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. కొత్త లీడర్లకు మద్దతుగా సోషల్​ మీడియాలో వారి అనుచరులు ప్రచారం చేస్తున్నారు. కొత్త నాయకులకు మద్దతుగారాజకీయ చర్చలకు తెరలేపుతున్నారు. 

 హైకమాండ్​ అండ ఉందని.. 

ఎంపీ సంతోష్ కుమార్ అనుచరునిగా చెప్పుకుంటున్న పూర్ణచంద్రనాయక్, మంత్రి కేటీఆర్ అనుచరునిగా చెప్పు కుంటున్న జాన్సన్ నాయక్, అలాగే రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శర్మన్ నాయక్ తో పాటు మరో ఎన్నారై కూడా ఖానాపూర్​ నియోజకవర్గంపై కన్నేసి కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఇప్పటికే చాలామంది సీనియర్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే రేఖా నాయక్ తో విభేదిస్తూ వీరికి మద్దతు ఇస్తున్నారు. కడెం, జన్నారం, దస్తురాబాద్, పెంబి మండలాలలో ఈ ఆశావాహుల కార్యకలాపాలు ముమ్మరంగా సాగుతున్నాయి. కడెం ఎంపీపీ అలెగ్జాండర్ తో పాటు కడెం కు చెందిన మరో ప్రజా ప్రతినిధి, ఖానాపూర్, జన్నారానికిచెందిన మరో ఇద్దరు సీనియర్ నాయకులు ఎమ్మెల్యే రేఖా నాయక్ తో విభేదిస్తున్నారు. వీరంతా ఇప్పటికే వేరే వర్గం గా ఏర్పడి మంత్రి కేటీఆర్ అనుచరునిగా చెప్పుకుంటున్న జాన్సన్ నాయక్ కు మద్దతు పలుకుతుండడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ పరిణామాలను ఎమ్మెల్యే రేఖా నాయక్ గమనిస్తూ కార్యకర్తలు, తన అను చరులు చేజారకుండా ముందు జాగ్రత్త పడుతున్నారు. 

ముధోల్ లో రెండు వర్గాలుగా.. 

 ముధోల్ సెగ్మెంట్ పరిధిలో బీఆర్ఎస్ కార్యకర్తలు రెండు వర్గాలుగా విడిపోతున్నారు. ఎమ్మెల్యే విఠల్​ రెడ్డి కి అనుకూలంగా కొంతమంది ఉండగా.. ఆయనపై అసంతృప్తితో ఉన్న వారు మరో వర్గంగా తయారైనట్టు తెలుస్తోంది. వీరంతా మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుత ఐడీసీ చైర్మన్ డాక్టర్ వేణుగోపాల చారికి మద్దతుగా నిలుస్తున్నారు.  వేణుగోపాల చారి కి ఐడీసీ చైర్మన్ పదవి దక్కగానే ఆయన ముధోల్ నియోజకవర్గం పై దృష్టి పెట్టారు. దీంతో తన పాత అనుచరులను, కార్యకర్తలందరిని సమీకరించడంలో నిమగ్నమయ్యారు. 
దీంతో ఇటీవల ఎమ్మెల్యే వెంట నడిచిన అసంతృప్త కార్యకర్తలు, నాయకులంతా చారీ వెంటనే అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే చాలామంది సీనియర్​ నాయకులు చారీని కలిసి, టికెట్ విషయంలో బలాలను అంచనా వేసుకున్నట్టు తెలిసింది. అవసరమైతే హైకమాండ్​ దగ్గర వేణుగోపాలా చారి కి మద్దతు తెలిపేందుకు నిర్ణయించుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. 

కొత్తవారి వెంటనే సీనియర్లు 

 మొన్న టివరకు ఎమ్మెల్యే తప్పా ఎవరూ ప్రత్యామ్నాయంగా కనిపించకపోవడంతో గత్యంతరం లేకుండా ఎమ్మెల్యే చుట్టూ తిరిగామని కొందరు కార్యకర్తలు అంటున్నారు. బీఆర్​ఎస్​లో ఉంటున్న సీనియర్​ నాయకులు  కొత్త ఆశావాహులకు మద్దతుగా ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో కొంతమంది నాయకులు బహిరంగంగానే కొత్త వారికి మద్దతు తెలపడమే కాకుండా... ఈ ఎమ్మె ల్యేలపై పెదవి విరుస్తున్నారు.