బీజేపీ కార్యవర్గ సమావేశంలో తెలంగాణపై ప్రత్యేక ప్రకటన

బీజేపీ కార్యవర్గ సమావేశంలో తెలంగాణపై ప్రత్యేక ప్రకటన

త్వరలోనే తెలంగాణలో కూడా కుటుంబ పాలన అంతమవుతుందని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ తెలిపారు. తెలంగాణపై బీజేపీ కార్యవర్గ సమావేశంలో ప్రత్యేక ప్రకటన ఉంటుందని ప్రకటించారు. HICCలో రెండో రోజు ఆదివారం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాజకీయ, ఆర్థిక, విదేశాంగ విధానాలపై ఇవాళ్టి కార్యవర్గ సమావేశాల్లో చర్చించారు. ఈ సందర్భంగా.. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మీడియాతో మాట్లాడారు. దానికి ముందే రాజకీయ తీర్మానంలోనూ వివిధ అంశాలపై చర్చించడం జరిగిందన్నారు. -వచ్చే 30 నుంచి -40 ఏళ్ల పాటు బీజేపీనే దేశంలో అధికారంలో ఉంటుందని, ప్రతిపక్షాన్ని ఇప్పటికే ప్రజలు మూలన కూర్చోబెట్టారని విమర్శించారు. కుటుంబ పాలన, రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై  చర్చ జరిగినట్లు, దేశవ్యాప్తంగా రాజకీయాల్లో కుటుంబ రాజకీయాలు, జాతి, కులమత ప్రాంత వాదాలను నిరోధించాల్సిన అవసరం ఉందని అమిత్ షా తన తీర్మానంలో ప్రస్తావించారన్నారు. పని తీరు ఆధారిత పాలన, అభివృద్దితో కూడిన పాలనపైనే బీజేపీ రాజకీయ తీర్మానంలో చర్చించామన్నారు.

హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో రాజకీయ కోణం ఏముందని వస్తున్న విమర్శలపై తిప్పికొట్టారు. కాంగ్రెస్ కు ప్రధాన మంత్రి మోదీ ఫొబియా పట్టుకుందని విమర్శించారు. పార్టీలో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలని కాంగ్రెస్ సభ్యులు పోరాడుతున్నారని.. భయంతో పార్టీ అధ్యక్షుడిని ఎన్నుకోవడం లేదన్నారు. జాతీయ కార్యవర్గ సమావేశంలో మొదటి రోజు ఆర్థిక తీర్మానం, రెండో రోజు రాజకీయ తీర్మానంపై చర్చ జరిగిందన్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీర్మానం ప్రవేశపెట్టారన్నారు. ఏకగ్రీవంగా ఆమోదించబడిందన్నారు. రాజకీయ తీర్మానంలో ప్రధాని మోదీ చర్చలో పాల్గొన్నట్లు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో అభివృద్ధి కార్యక్రమాలు మరింత విస్తృతం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. సబ్ కే సాత్ సబ్ కా వికాస్ అన్నదే తమ పార్టీ నినాదం అందుకు అనుగుణంగానే నిర్ణయాలుంటాయన్నారు.గుజరాత్ అల్లర్లపై సుప్రీంకోర్టు తీర్పు చారిత్రాత్మకమని అభివర్ణించారు. వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని సుప్రీం వెల్లడించిందన్నారు.