- భిక్కనూరులో బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై స్థానికుల ఆందోళన
- ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ మండలంలో బంద్
- భారీగా పోలీసుబందోబస్తు
కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండల కేంద్రం సమీపంలో ఏర్పాటు చేయనున్న బల్క్ డ్రగ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై స్థానికుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఫ్యాక్టరీ ఏర్పాటు వద్దంటూ మండలంలోని ఆయా గ్రామాల ప్రజలు బంద్ పాటించారు. మొదట 2 ఎకరాల 20 గుంటల్లో ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రతిపాధించినా.. దీన్ని ఇప్పుడు 9 ఎకరాల 26 గుంటల్లో విస్తరించారు. బుధవారం ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్న స్థలంలో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారు.
అడిషనల్ కలెక్టర్ వి.విక్టర్, కాలుష్య నియంత్రణ మండలి అధికారి లక్ష్మీప్రసాద్, ఆర్డీవో వీణ ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిపారు. ఉత్పత్తి సామర్థ్యం ప్రతి రోజు 2,420 కిలోలకు పెంచనున్నామని, రూ 120 కోట్లతో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయనున్నట్లు ఫ్యాక్టరీ ప్రతినిధులు తెలిపారు. 200 మందికి ఉపాధి అవకాశాలు కలుగుతాయన్నారు. ప్రజాభిప్రాయ సేకరణకు మండలంలోని పలు గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. పోలీసు శాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది.
కాలుష్యం వెదజల్లి ప్రాణాలు తీసే పరిశ్రమలు వద్దంటూ మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు, సర్పంచులు, అడ్వకేట్లు, వివిధ వర్గాల ప్రతినిధులు, ఆయా పార్టీల నాయకులు తమ అభిప్రాయాలు చెప్పారు. ఇప్పటికే మండల కేంద్రం చుట్టూ ఉన్న కెమికల్ , ఫార్మా ఫ్యాక్టరీలతో అనేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయని, వాసన భరించలేకపోతున్నామన్నారు. ఇప్పటికే భిక్కనూరు ఏరియా కాలుష్య కాసారంగా మారిందన్నారు.
పిల్లలు, యువకులు, వృద్ధులు అనేక వ్యాధుల భారిన పడుతున్నారన్నారు. తమ ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుందన్నారు. పచ్చని పంటలు పండే భూముల్లో కెమికల్ ఫ్యాక్టరీల ఏర్పాటు వద్దన్నారు. ఉపాధి పేరిట ఆశలు చూపి తమ ప్రాణాలకు ముప్పు తెచ్చే పరిశ్రమలు వద్దన్నారు. పరిశ్రమ హాటావో.. భిక్కనూరు బచావో అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టకముందే ఫ్యాక్టరీ నిర్మాణ పనులు ఎలా కొనసాగుతున్నాయంటూ అధికారులను స్థానికులు ప్రశ్నించారు. వెంటనే పనులు అపాలని డిమాండ్ చేశారు.
ప్రజలు వద్దని
చెప్పిన కూడాఫ్యాక్టరీ పనులు కొనసాగితే అడ్డుకొని తీరుతామన్నారు. ఇప్పటికే భిక్కనూరు సమీపంలో పెద్దమల్లారెడ్డి రోడ్డులో ఉన్న ప్యాక్టరీతో అవస్థలు పడుతున్నామన్నారు. చెరువులు, బోర్లలో నీళ్లు కలుషితమవుతాయన్నారు. భిక్కనూరు, పెద్దమల్లారెడ్డి, కాచాపూర్, బస్వాపూర్, అయ్యవార్పల్లి, లక్ష్మీదేవునిపల్లి తదితర గ్రామాలకు కాలుష్య ముప్పు ఏర్పడుతుందన్నారు. ఈ ఏరియాకు సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి ఫ్యాక్టరీకి అనుకూలంగా సంతకాలు చేయించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇప్పటికే ఉన్న పరిశ్రమలతో తమకు కలుగుతున్న ఇబ్బందులు, వాతావరణ కలుషితంపై అధికారులకు ఫిర్యాదులు చేసిన చర్యలు తీసుకొలేదన్నారు. కొందరు వ్యక్తులను స్థానికులు బయటకు పంపారు. అధికారులు, పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. కొందరు వేదిక వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆయా గ్రామాల పాలక వర్గాలు చేసిన తీర్మానాలను సర్పంచ్లు అడిషనల్ కలెక్టర్కు అందించారు. వివిధ వర్గాల ప్రతినిధులు కూడా వినతి పత్రాలు
ఇచ్చారు.
భిక్కనూరు మండలంలో బంద్ సక్సెస్
ఫ్యాక్టరీ ఏర్పాటును వ్యతిరేకిస్తూ బుదవారం భిక్కనూరు మండలంలో చేపట్టిన బంద్ సక్సెస్ అయ్యింది. స్థానికుల పిలుపు మేరకు భిక్కనూరు మండల కేంద్రంతో పాటు పెద్దమల్లారెడ్డి, కాచాపూర్ తదితర గ్రామాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు బంద్ నిర్వహించారు. వ్యాఫార సంస్థలు, హోటళ్లు, స్కూల్స్ మూసి ఉంచారు. బంద్ కు ఆయా పార్టీలు సంపూర్ణ మద్దతు ఇచ్చాయి.
ప్రభుత్వానికి నివేదిస్తాం
ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైన ఆంశాలను ప్రభుత్వానికి నివేదిస్తామని అడిషనల్ కలెక్టర్ విక్టర్ పేర్కొన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో 39 మంది వ్యక్తులు మాట్లాడారన్నారు. అందరు కూడా ఫ్యాక్టరీ ఏర్పాటు వద్దన్నారని తెలిపారు. ఇంకా కొంత మంది వినతి పత్రాలు అందజేశారన్నారు.
ముందుగా ప్రచారం చేయలేదు
ప్రజాభిప్రాయ సేకరణ ఉందని ముందుగానే స్థానికులకు సమాచారం ఇచ్చి, ప్రచారం చేయాల్సి ఉన్నప్పటికి అలా చేయలేదు. కెమికల్ ఫ్యాక్టరీల ఏర్పాటుతో అనేక దుష్పరిణామాలు ఉంటాయి. పచ్చని పొలాలు దెబ్బతింటాయి. కన్నేగంటి రవి, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధి
