31లోగా ‘డబుల్’ లబ్ధిదారుల ఎంపిక

31లోగా ‘డబుల్’ లబ్ధిదారుల ఎంపిక
  • 20వ తేదీ నాటికి మున్సిపాలిటీల్లో బెనిఫిషరీస్ ను గుర్తించండి
  • మార్చి 31లోగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు పూర్తి కావాలె
  • రెవెన్యూ, గృహ నిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
  • ఉమ్మడి వరంగల్ జిల్లా అభివృద్ధి పనులపై లీడర్లు, ఆఫీసర్లతో రివ్యూ 

హనుమకొండ/ వరంగల్, వెలుగు: ఈ నెల 20వ తేదీలోగా మున్సిపాలిటీల పరిధిలో ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయాలని రెవెన్యూ, గృహనిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి, ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్​చార్జి మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆఫీసర్లను ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారుల ఎంపికను ఈ నెల 31 వరకు పూర్తి చేయాలని, ఆలోగానే డబుల్ ఇండ్ల సమస్యలను కూడా సాల్వ్ చేయాలన్నారు. మార్చి 31 లోగా వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు పూర్తి చేయాలని, సీఎం రేవంత్ రెడ్డి చేతులమీదుగా ఆస్పత్రిని ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. 

ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలో వివిధ అభివృద్ధి పనులపై బుధవారం మంత్రి సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి హనుమకొండ కలెక్టరేట్ లో బుధవారం మంత్రి పొంగులేటి రివ్యూ చేశారు. మామునూరు ఎయిర్ పోర్టు, కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్, వరంగల్  కలెక్టరేట్, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వరద నీటి కాల్వల వ్యవస్థ, ఇన్నర్ రింగ్ రోడ్డు, భద్రకాళి మాఢవీధులు, చెరువు పూడికతీత, డబుల్ బెడ్ రూం, ఇందిరమ్మ ఇండ్లు, భూభారతి, యూరియా, యాసంగి సీజన్​లో ధాన్యం కొనుగోలు తదితరు అంశాలపై కలెక్టర్లు, ఇతర ఆఫీసర్లతో చర్చించారు. 

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్ల పెండింగ్ సమస్యలను జిల్లా కలెక్టర్లతో మాట్లాడి 15 రోజుల్లోగా సాల్వ్ చేయాలని హౌజింగ్ ఎండీ వీపీ గౌతమ్ ను ఆదేశించారు. పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన గ్రామాల్లో ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని, వాటికి చెల్లింపులు చేయాలన్నారు. గతంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్లను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ఏప్రిల్ లో రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ప్రక్రియ ప్రారంభం అవుతుందని, ఈ మేరకు డబుల్ బెడ్ రూం ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక ఆలస్యం చేయొద్దన్నారు. స్థానిక ఎమ్మెల్యేల సూచనలను పరిగణనలోకి తీసుకొని పొజిషన్ లో ఉన్న లబ్ధిదారులకు కేటాయించాలని సూచించారు.

బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్

రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న బాసర నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్ ఏర్పాటు చేయనున్నట్లు మినిస్టర్ పొంగులేటి వెల్లడించారు. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల నుంచి ఖమ్మం వరకు ఉన్న ఆలయాలను అభివృద్ధిపరుస్తూ ఈ టెంపుల్ సర్క్యూట్ ఉంటుందని స్పష్టం చేశారు. ఈ మేరకు డీపీఆర్ రెడీ చేయడానికి కొద్దిరోజుల్లోనే ఒక సంస్థతో పాటు ప్రత్యేకంగా కమిటీని కూడా నియమిస్తామని ప్రకటించారు. భద్రకాళి మాఢవీధుల అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడారు. పుణ్యక్షేత్రాలతో పాటు టూరిజం ఎక్కువగా ఉన్న అటవీప్రాంతాలు, గిరిజన గ్రామాలను కవర్ చేసేలా టెంపుల్ సర్క్యూట్ ఏర్పాటు చేస్తామన్నారు.

 ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులను ఆకర్షించేలా ఆలయాలను అభివృద్ధి చేయాలనే దృఢ సంకల్పంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారన్నారు. వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పట్టుబట్టి భద్రకాళి గుడి అభివృద్ధికి కృషి చేశారని, ఈ మేరకు గుడిని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి వివరించారు. వరంగల్​ సిటీలో దాదాపు రూ.4 వేల కోట్లతో పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. రూ.550 కోట్లతో తాగునీటి ప్రాజెక్టు పనులకు వారంలో టెండర్లు పిలుస్తామని చెప్పారు. అనంతరం మామూనూర్​ ఎయిర్​పోర్టు పున:ప్రారంభంలో కీలకమైన భూసేకరణను శాంతియుతంగా ఏడాదిలో పూర్తి చేసిన వరంగల్​ కలెక్టర్​ సత్యశారద, రెవెన్యూ సిబ్బందిని మంత్రి పొంగులేటి ప్రత్యేకంగా అభినందించారు. 

ఆయా కార్యక్రమాల్లో ఎంపీ డాక్టర్ కడియం కావ్య, నగర మేయర్  గుండు సుధారాణి, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, రేవూరి ప్రకాశ్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, మురళీ నాయక్, గండ్ర సత్యనారాయణ, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామి రెడ్డి, కలెక్టర్లు స్నేహ శబరీష్, సత్య శారద, రాహుల్, షేక్ రిజ్వాన్ భాషా, అద్వైత్ కుమార్, గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్ పాయ్, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్ కు దీటుగా వరంగల్.. 

హైదరాబాద్ కు దీటుగా వరంగల్ నగర సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో ఉందని మంత్రి పొంగులేటి అన్నారు. కాజీపేట బస్టాండ్ నిర్మాణానికి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఫారెస్ట్, రెవెన్యూ శాఖల మధ్య  ఉన్న భూ సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. భూభారతిలో పెండింగ్ అప్లికేషన్లను త్వరగా పూర్తి చేయాలని, అధికారులు రైతులను ఇబ్బందులకు గురిచేయవద్దన్నారు. సాదాబైనామా దరఖాస్తులను కూడా పరిష్కరించాలని సూచించారు. రైతులకు యూరియా పంపిణీకి సంబంధించి జిల్లాల్లో ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. 

భద్రకాళి మాఢవీధుల పనులు రూ.30 కోట్లతో కొనసాగుతున్నాయని, పూజారుల నివాస గదులు సత్రం పనులు కొనసాగుతున్నాయని కలెక్టర్ స్నేహ శబరీశ్ వివరించారు. అనంతరం వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి అన్ని పనులు మార్చి 31 నాటికి పూర్తి చేసేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని మంత్రి సూచించారు. ఆఫీసర్లు వారానికి ఒక సమీక్ష నిర్వహించుకోవాలని, సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని ప్రారంభిస్తామని మంత్రి స్పష్టం చేశారు.