- కరీంనగర్లో ఇద్దరు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అరెస్ట్
- కాలేజీ, హాస్టల్ మేనేజ్‌మెంట్లు, పోలీసుల నిర్లక్ష్యంతో యథేచ్ఛగా దందా
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ సమీపంలోని కొన్ని ఇంజినీరింగ్ కాలేజీల్లో పలువురు బీటెక్ విద్యార్థులు గంజాయి మత్తుకు బానిసలవుతున్నారు. స్నేహితులతో సరదాగా మొదలైన ఈ అలవాటు.. వారిని గంజాయికి బానిసలుగా చేస్తోంది. కొన్నాళ్లకు గంజాయి కొనే స్థోమత లేక ఖర్చుల కోసం వారే సప్లయర్లు మారుతున్నారు. రెండు నెలల్లో ముగ్గురు ఇంజినీరింగ్ విద్యార్థులు గంజాయి సప్లై చేస్తూ పోలీసులకు చిక్కడం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది.
గంజాయికి అడిక్ట్ అయిన వారిని తల్లిదండ్రులు మందలించినా వినకపోవడం, కౌన్సెలింగ్ ఇప్పించినా మారకపోగా చివరికి ఉన్మాదులుగా మారి కన్నవారిపైనే దాడులకు దిగుతున్నారు. ఆయా కాలేజీలు, హాస్టళ్ల యాజమాన్యాలతోపాటు పోలీస్ నిఘా కొరవడడంతోనే గంజాయి సప్లై, వినియోగం రోజురోజుకు పెరుగుతోందనే ఆరోపణలు
వినిపిస్తున్నాయి.
రెండేళ్లలో 189 మంది అరెస్టు..
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండేళ్లలో పోలీసులు తనిఖీలు నిర్వహించే క్రమంలో 189 మంది గంజాయి విక్రేతలను అరెస్టు చేశారు. 2024లో 39 కేసుల్లో 114 మంది గంజాయి స్మగ్లర్లను అరెస్టు చేసి 129.691 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే 2025లో 31 కేసుల్లో 75 మంది గంజాయి స్మగ్లను అరెస్టు చేసి 40 కేజీల గంజాయిని జప్తు చేశారు. కాగా కరీంనగర్ శివారు ప్రాంతాలతో పాటు కరీంనగర్–- హైదరాబాద్ హైవేలోని తిమ్మాపూర్, నుస్తులాపూర్, రామకృష్ణ కాలనీ తదితర ఏరియాల్లోని ఖాళీ ప్లాట్లు, పొలాల్లో విద్యార్థులు గంజాయి దమ్ము కొడుతున్నట్లు తెలుస్తోంది.
గంజాయి అతిగా వినియోగిస్తున్న వారిలో స్టూడెంట్స్ తోపాటు ఉత్తరాదికి చెందిన గ్రానైట్ లేబర్, లారీ డ్రైవర్లు ఎక్కువగా ఉంటున్నారు. జిల్లాలో గంజాయి సాగు లేనప్పటికీ ఒడిశా, ఏపీలోని అరకు, వైజాగ్ తదితర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి 50, 100 గ్రాముల చొప్పున ప్యాకెట్లుగా మార్చి అమ్ముతున్నారు. 50 గ్రాములకు రూ.300 వరకు అమ్ముతున్నట్లు తెలిసింది. ఇంటి నుంచి కాలేజీకి వెళ్లొచ్చేవాళ్లు కాకుండా ఇంటికి దూరంగా హాస్టళ్లు, కిరాయి రూమ్ ల్లో ఉంటూ చదువుకునే స్టూడెంట్స్‌ను టార్గెట్‌గా చేసుకుని గంజాయి మాఫియా గంజాయిని అమ్ముతున్నట్లు సమాచారం.
రెండు నెలల్లో ముగ్గురు స్టూడెంట్స్ అరెస్టు..
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ లోని తిరుమల హోమ్స్ ఏరియాలో 2025 నవంబర్ 30న గంజాయి తీసుకుంటున్నారనే సమాచారంతో పోలీసులు దాడి చేశారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం జయ్యారం గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ కోరండ్ల రఘువర్ధన్ రెడ్డితోపాటు స్థానిక ఇంజినీరింగ్ కాలేజీ స్టూడెంట్ చింతకింది శ్రీకృష్ణను అరెస్టు చేశారు. గంజాయి అమ్మే వ్యక్తి పరారయ్యాడు. వారి నుంచి 110 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. వీరిద్దరు తిమ్మాపూర్‌లోని ప్రైవేట్ హాస్టల్‌లో ఉంటున్న ఓ వ్యక్తి వద్ద గంజాయి కొని తాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు.
అదే ఏడాది జూన్ 15న తిమ్మాపూర్ మండలం కొత్తపల్లి ఎక్స్ రోడ్డు వద్ద నిర్వహించిన తనిఖీలు చేస్తుండగా బైక్ పై కరీంనగర్ వైపు వస్తున్న ముగ్గురు యువకుల వద్ద 5 కేజీల గంజాయి దొరికింది. రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన గొంటి నగేశ్, చెప్యాల సాత్విక్, కుత్తడి భరత్ ఒడిశా నుంచి గంజాయి కొనుగోలు చేసి తీసుకొస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ నెల 6న మంగళవారం మధ్యాహ్నం గోదావరిఖని బైపాస్‌లో ఉన్న భారత్ పెట్రోల్ బంక్ వద్ద బీటెక్ స్టూడెంట్స్ సాయి కార్తీక్, సాయి తేజ గంజాయి అమ్మేందుకు వచ్చి పోలీసులకు చిక్కారు. డిసెంబర్ 31న ఎంజాయ్ చేసేందుకు ఏపీలోని అరకు వెళ్లిన వారిద్దరు గుర్తుతెలియని వ్యక్తి వద్ద తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి కరీంనగర్ లో ఎక్కువ ధరకు అమ్మేందుకు సిద్ధమయ్యారు. లారీ డ్రైవర్లకు గానీ, ఇతర వ్యక్తులకు గాని అమ్ముదామని వచ్చి పోలీసులకు దొరికిపోయారు.
కాలేజీ, హాస్టల్ మేనేజ్ మెంట్లు, పోలీసుల నిర్లక్ష్యం
కరీంనగర్ సిటీతోపాటు శివారులోని ఇంటర్, డిగ్రీ, ఇంజినీరింగ్ కాలేజీల స్టూడెంట్స్‌ను టార్గెట్‌గా చేసుకుని కొన్ని ముఠాలు గంజాయిని అమ్ముతున్నాయి. విద్యార్థుల ప్రవర్తన, వారి ముఖాల్లో మార్పును ఆయా కాలేజీలు, హాస్టళ్ల యాజమాన్యాలు గుర్తించినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. తమ విద్యాసంస్థ రెప్యుటేషన్ దెబ్బతింటుందనే భయంతో పోలీసులకు కూడా సమాచారమివ్వడం లేదని తెలిసింది.
దీంతోవారు బయట తనిఖీల్లో పోలీసులకు చిక్కితేగానీ విషయం వెలుగు చూడడం లేదు. మరోవైపు పోలీసులు కూడా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. గంజాయి తాగుతూ ఆరుబయట ఎవరైనా చిక్కితే బ్లూకోల్ట్స్ సిబ్బంది వారిని బెదిరించి డబ్బులు తీసుకుని వదిలేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదే ఆరోపణలతో బ్లూ కోల్ట్స్ కానిస్టేబుల్ సస్పెన్షన్‌కు గురయ్యారు.
