- చైనా, రష్యా, ఇరాన్, క్యూబా
- దేశాలను దూరం పెట్టాలని సూచన
- ఆ నాలుగు దేశాలతో ఆర్థిక సంబంధాలు తెంచుకోవాలని డిమాండ్
- వెనెజువెలా ఆయిల్ ట్యాంకర్లు,
- షిప్పులను బ్లాక్ చేసిన యూఎస్
- దీంతో 50 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్‌ను
- ఇస్తామని వెనెజువెలా ఒప్పందం
వాషింగ్టన్: వెనెజువెలా వెలికి తీసే చమురును తమకే అమ్మాలని ఆ దేశ తాత్కాలిక ప్రెసిడెంట్ డెల్సీ రోడ్రిగజ్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తేల్చిచెప్పారు. చైనా, రష్యా, ఇరాన్, క్యూబా దేశాలను తరిమేయాలని ట్రంప్ టీమ్ హెచ్చరించింది. ఆ దేశాలతో ఆర్థిక సంబంధాలను తెంచుకోవాలని చెప్పింది. అలా చేస్తేనే వెనెజువెలా మరింత చమురు ఉత్పత్తి చేసేందుకు అనుమతిస్తామని స్పష్టం చేసింది. ఆయిల్ ట్యాంకర్లు, షిప్పులను అమెరికా బ్లాక్ చేయడం వల్ల చమురును నిల్వ చేసుకునే అవకాశం లేకపోవడంతో వెనెజువెలా గత నెల నుంచి వరుసగా చమురు బావులను మూసివేస్తోంది.
ఇదిలాగే కొనసాగితే ఆ దేశం ఆర్థికంగా దివాళా తీసే పరిస్థితి రానుంది. ఈ నేపథ్యంలో చైనా, ఇతర దేశాలతో సంబంధాలు తెంచుకుని, తమతో కలిసి చమురు విక్రయాలు చేపట్టాలని అమెరికా డిమాండ్ చేస్తోందని ‘ఏబీసీ’ న్యూస్ వెల్లడించింది. మరోవైపు ట్రంప్ ఈ అంశంపై స్పందించారు. ‘‘అధిక నాణ్యత గల 50 మిలియన్ బ్యారెళ్ల చమురును అమెరికాకు అప్పగించనున్నట్టు వెనెజువెలా తాత్కాలిక సర్కారు ప్రకటన చేయడం చాలా సంతోషంగా ఉంది. మార్కెట్ ధరకే ఈ చమురును విక్రయిస్తాం. ఆ డబ్బు నా నియంత్రణలోనే ఉంటుంది. దానిని వెనెజువెలా, అమెరికా ప్రజల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తా” అని ట్రంప్ పేర్కొన్నారు.
