అసెంబ్లీలోనే ఆయన హీరోయిజం: హిమంత బిశ్వ శర్మ

అసెంబ్లీలోనే ఆయన హీరోయిజం: హిమంత బిశ్వ శర్మ

గువహటి: ఢిల్లీ సీఎం అర్వింద్  కేజ్రీవాల్ పిరికివాడని, అసెంబ్లీలోనే ఆయన తన ప్రతాపం చూపుతారని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ విమర్శించారు. తనపై ఢిల్లీ అసెంబ్లీలో అవినీతి ఆరోపణలు చేసి, అసోంలో ఆ ఆరోపణలు చేయకపోవడంపై కేజ్రీవాల్​పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. సోమవారం ఉడాల్ గురిలో మీడియా సమావేశంలో హిమంత మాట్లాడారు. ‘‘ఢిల్లీ అసెంబ్లీలో కేజ్రీవాల్​ నాపై అవినీతి ఆరోపణలు చేశాడు. అవే ఆరోపణలు అసెంబ్లీ బయట చేయాలని నేను సవాల్  విసిరాను. అలా చేస్తే పరువునష్టం దావా వేస్తానని బెదిరించాను. దీంతో అసెంబ్లీ బయట ఆయన నాపై ఎలాంటి అవినీతి ఆరోపణలు చేయలేదు. 

అలాగే అసోంలో ఆప్  అధికారంలోకి వస్తే ఉచిత విద్యుత్  ఇస్తామని గువహటి ర్యాలీలో కేజ్రీవాల్  హామీ ఇచ్చాడు. కానీ ఇక్కడ ఉచిత విద్యుత్ అవసరం లేదు. వెనుకబడిన వర్గాల వారి బ్యాంకు ఖాతాల్లో ‘అరుణోదయ్’  స్కీం కింద మేము ప్రతి నెలా రూ.1400 జమచేస్తున్నాం” అని హిమంత చెప్పారు. ఢిల్లీలోని ఆయన నివాసాన్ని సందర్శించాలన్న కేజ్రీవాల్ ఆహ్వానంపైనా హిమంత స్పందించారు. ‘‘50 మంది జర్నలిస్టులను పంపుతాను. తాను కోరుకున్న చోటికి కాకుండా మేం కోరుకున్న చోటికి తీసుకెళ్లాలి” అని హిమంత పేర్కొన్నారు. వాస్తవానికి ఢిల్లీలో 60 శాతం మంది నరకంలో బతుకుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు.