ఆ దేశంలో బీభత్సం స్టార్ట్ చేసిన AI.. కొత్త జాబ్స్ కంటే పోతున్న ఉద్యోగాలే ఎక్కువ: మోర్గన్ స్టాన్లీ రిపోర్ట్

ఆ దేశంలో బీభత్సం స్టార్ట్ చేసిన AI.. కొత్త జాబ్స్ కంటే పోతున్న ఉద్యోగాలే ఎక్కువ: మోర్గన్ స్టాన్లీ రిపోర్ట్

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా విప్లవాత్మక మార్పులు తెస్తోంది. అయితే ఈ సాంకేతికత వల్ల బ్రిటన్ ఇతర దేశాల కంటే వేగంగా ఉద్యోగాలను కోల్పోతోందని మోర్గన్ స్టాన్లీ తాజా రిపోర్ట్ హెచ్చరించింది. ఏఐ వల్ల కంపెనీల ప్రొడక్టివిటీ పెరుగుతున్నప్పటికీ.. అది ఉద్యోగుల పాలిట శాపంగా మారుతోందని ఈ అధ్యయనం స్పష్టం చేసింది.

గడచిన 12 నెలల కాలంలో ఏఐ వినియోగం వల్ల యూకే కంపెనీల్లో నికరంగా 8 శాతం ఉద్యోగాల కోత జరిగింది. ఇది అమెరికా, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా వంటి దేశాల కంటే చాలా ఎక్కువ. అంతర్జాతీయ సగటుతో పోలిస్తే ఏఐ వల్ల బ్రిటన్‌లో ఉద్యోగాల కోత రెట్టింపు స్థాయిలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, కన్సల్టెంట్లు వంటి వైట్ కాలర్ జాబ్ రోల్స్ పై ఏఐ ప్రభావం తీవ్రంగా ఉంది.

ప్రొడక్టివిటీ పెరిగినా.. ఉద్యోగాలు లేవు

ఏఐ వాడకం వల్ల బ్రిటన్ కంపెనీల ప్రొడక్టివిటీ సుమారు 11.5 శాతం పెరిగింది. ఇదే స్థాయి ప్రొడక్టివిటీ అమెరికా కంపెనీలు కూడా సాధించినప్పటికీ.. అక్కడ ఏఐ వల్ల కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతోంది. కానీ బ్రిటన్‌లో మాత్రం కొత్త వారిని నియమించుకోవడానికి కంపెనీలు అస్సలు ఆసక్తి చూపడం లేదని స్టాన్లీ రిపోర్ట్ బయటపెట్టింది. ఒకవైపు పెరుగుతున్న కనీస వేతనాలు, మరోవైపు పన్నుల భారం వల్ల కంపెనీలు మనుషులకు బదులుగా ఏఐ సాఫ్ట్‌వేర్‌లనే నమ్ముకుంటున్నాయంట.

ఈ ఏఐ విప్లవం వల్ల అత్యధికంగా నష్టపోతున్నది మాత్రం యువతే. ఎంట్రీ లెవల్ ఉద్యోగాలను ఏఐ సులువుగా భర్తీ చేస్తోంది. దీనివల్ల బ్రిటన్‌లో యువత నిరుద్యోగిత రేటు 13.7 శాతానికి చేరుకుంది. ఇది 2020 తర్వాత నమోదైన అత్యధిక స్థాయి. ఐటీ, అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ వంటి రంగాల్లో ఖాళీలు గత రెండేళ్లలో దాదాపు 37 శాతం తగ్గాయంటే పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.

ALSO READ : ధర పెరిగిందని.. మీ బంగారాన్ని బ్యాంక్ లాకర్లలో దాచారా..? : బ్యాంక్ లో ఏదైనా జరిగితే నష్టపరిహారం, నష్టం ఏంటో తెలుసా..?

ఏఐ అనేది కంప్యూటర్లు, ఇంటర్నెట్ లాంటి ఒక గొప్ప ఆవిష్కరణ అని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ గవర్నర్ ఆండ్రూ బెయిలీ అభిప్రాయపడ్డారు. ఇది ఆర్థిక వ్యవస్థను వృద్ధి పథంలో నడిపించే అవకాశం ఉన్నప్పటికీ.. ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా జూనియర్ రోల్స్ నుంచి సీనియర్ రోల్స్‌కు వెళ్లే మార్గాలను ఏఐ మూసివేసే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. మొత్తానికి ఏఐ వల్ల కంపెనీల లాభాలు పెరుగుతున్నా.. సామాన్య ఉద్యోగుల భవిష్యత్తు మాత్రం ప్రశ్నార్థకంగా మారుతోంది. ఈ మార్పులను తట్టుకోవాలంటే నైపుణ్యాలను పెంచుకోవడం ఒక్కటే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఇది ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో ఉపాధి లేమి ఉత్పత్తి ఉన్నా ఆ వస్తువులు లేదా సేవలు వాడటానికి ప్రజల వద్ద డబ్బు లేని పరిస్థితికి దారితీయెుచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.