రాహుల్ గాంధీ సద్దాం హుస్సేన్లా కనిపిస్తున్నారు:హిమంత బిశ్వ శర్మ

రాహుల్ గాంధీ  సద్దాం హుస్సేన్లా కనిపిస్తున్నారు:హిమంత బిశ్వ శర్మ

రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ జోడో యాత్రలో పాల్గొంటున్న రాహుల్ గాంధీ రోజు రోజుకు ఇరాన్ మాజీ నియంత సద్దాం హుస్సేన్ లా కనిపిస్తున్నారని వ్యాఖ్యానించారు. సర్దార్‌ పటేల్‌, జవహార్‌లాల్‌ నెహ్రూ లేదా మహాత్మా గాంధీ మాదిరిగా తయారైతే బాగుండేదన్నారు. గుజరాత్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా అహ్మదాబాద్‌ సభలో పాల్గొన్న  హిమంత బిశ్వశర్మ  రాహుల్‌ గాంధీ గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్‌ సంప్రదాయం ఎప్పటికీ భారత ప్రజలకు తగినట్లుగా ఉండదన్నారు. 

ఎన్నికలు లేని రాష్ట్రాలపై ఫోకస్
రాహుల్ గాంధీ ఎన్నికలు లేని రాష్ట్రాలపైనే ఫోకస్ పెట్టారని హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. భారత్‌ జోడో యాత్రలో భాగంగా ఇటీవల ఎన్నికలు జరిగిన హిమాచల్‌ ప్రదేశ్‌తోపాటు ఎన్నికలు జరుగుతున్న గుజరాత్‌లో పర్యటించేందుకు రాహుల్‌ గాంధీ ఆసక్తి చూపలేదన్నారు. రాహుల్ ఎక్కడ పర్యటిస్తే అక్కడ కాంగ్రెస్ ఓటమి పాలవుతుందని..అందుకే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ లో పాదయాత్ర చేయలేదన్నారు. 

హిమంతపై విమర్శలు..
అటు రాహుల్ గాంధీపై హిమంత శర్మ చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్‌ ఖండించింది. బీజేపీ నేతలు అల్పబుద్ధితో వ్యవహరిస్తున్నారని విమర్శించింది. హిమంత తీవ్ర దూషణలపై స్పందించడం తనకు ఇష్టం లేదని కాంగ్రెస్‌ నేత మనీశ్‌ తివారీ అన్నారు.  బహిరంగంగా మాట్లాడేటప్పుడు భాషను సరిగ్గా ఉపయోగించాలని సూచించారు.  అస్సాం సీఎంగా ఉండి..ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని చెప్పారు.