గువాహటి: భారీ వర్షాల కారణంగా అస్సాంను వరదలు ముంచెత్తుతున్నాయి. పలు నదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో రాష్ట్రంలోని 12 జిల్లాల్లో 1.7 లక్షల మందికి పైగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అధికారులు వెల్లడించారు. ఆదివారం 7 జిల్లాల్లో 57,100 గా ఉన్న బాధితుల సంఖ్య, సోమవారం నాటికి 1.7 లక్షలకు పైగా పెరిగింది. 580 గ్రామాలు జలమయం కాగా, 10,362.9 హెక్టార్లలో పంటలకు నష్టం జరిగింది.
నదీ ప్రవాహాల ధాటికి పలుచోట్ల రహదారులు, వంతెనలు ధ్వంసమయ్యాయి. ఈ ఏడాది వరదల్లో ఇప్పటివరకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. బ్రహ్మపుత్ర నది నియామతీఘాట్ వద్ద ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. దీని ఉపనదులైన బురిదిహింగ్, దిఖౌ, దిసాంగ్, ధన్సిరిలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
పలు జిల్లాల్లో చిక్కుకున్న ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు భారత సైన్యాన్ని రంగంలోకి దించినట్లు సీఎంవో తెలిపింది.
