
మద్యం తాగొచ్చి కట్టుకున్న భార్యను, తండ్రిని రోజూ హింస పెడుతున్నాడు. చివరికి ఆ మద్యం మత్తులో జరిగిన గొడవలో కన్న తండ్రి చేతిలోనే హతమయ్యాడు. అస్సాంలోని నాగావ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది.
నాగావ్ జిల్లా బ్రహ్మపూర్ సమీపంలోని నహర్బరి ప్రాంతానికి చెందిన తిసు గర్హ్ అనే వ్యక్తి కుమారుడు అర్జున్ గర్హ్ చాలా కాలం నుంచి మద్యానికి బానిసయ్యాడు. 20 ఏళ్ల అర్జున్ ప్రతి రోజూ మద్యం తాగి ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబసభ్యులతో గొడవకు దిగేవాడు. కట్టుకున్న భార్య మొదలు ఎవరినీ వదిలిపెట్టకుండా కొట్లాడి.. నానా రభస చేసేవాడు. ఇటీవల కరోనా లాక్ డౌన్ కారణంగా లిక్కర్ షాపులు లేకపోవడంతో కొంత మేర ఊపిరి పీల్చుకున్నాడు. కానీ కేంద్రం ఆంక్షలు సడలించడంతో ఈ వారంలో మళ్లీ మద్యం దుకాణాలు ఓపెన్ అయ్యాయి. దీంతో అర్జున్ తీరు మళ్లీ మొదటికొచ్చింది.
శుక్రవారం రాత్రి పీకలదాకా తాగి ఇంటికి వచ్చిన అర్జున్ తండ్రి తిసుపై గొడవకు వెళ్లాడు. ఇద్దరి మధ్య మటామాటా పెరిగి కొట్లాట దాకా వెళ్లింది. ఆవేశంలో మద్యం మత్తులో ఉన్న కొడుకును తీవ్రంగా కొట్టాడు తిసు. దీంతో అర్జున్ అక్కడికక్కడే మరణించాడు. ఈ విషయం తెలియడంతో గ్రామ పెద్ద పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో శనివారం ఉదయం పోలీసులు తిసు గర్హ్ ను అరెస్టు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి పంపామని, ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. కాగా, లాక్ డౌన్ ఆంక్షలను సడలించిన తర్వాత మే 4న లిక్కర్ షాపులు తెరిచిన అస్సాం ప్రభుత్వానికి ఐదు రోజుల్లో రూ. 100 కోట్ల ఆదాయం వచ్చింది.