కాస్ట్‌లీ ఎన్నికలు.. లీడర్లలో మొదలైన టెన్షన్

కాస్ట్‌లీ ఎన్నికలు.. లీడర్లలో  మొదలైన టెన్షన్

ఎన్నికలు కాస్ట్‌‌లీ అయ్యాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎలక్షన్స్ అనే తేడా లేకుండా అన్నీ ఖరీదైపోయాయి. ఎన్నికలంటేనే డబ్బులు పంచుడు, దావతులిచ్చుడు, ఓట్లు కొనుడు.. అన్నట్లు అయిపోయింది. డబ్బులు పంచడం ఏ స్థాయికి చేరిందంటే.. మాకు నోట్లు అందలేదంటూ కొంతమంది బహిరంగంగా రోడ్లపైకి వచ్చి మరీ అందోళనకు దిగే వరకు వెళ్లింది. ‘‘మాకెందుకు ఇవ్వరు?” అని సగటు ఓటరే నిలదీసిన వార్తలు చూస్తూనే ఉన్నాం. సామాన్యులు కనీసం ఎన్నికల్లో పోటీ చేయలేని పరిస్థితులు వచ్చేశాయి. ఈ పరిస్థితికి మొన్నటి హుజూరాబాద్‌‌ బై ఎలక్షన్స్‌‌నే మోడల్‌‌గా చూపించవచ్చు. దేశంలో ఎక్కడా లేని విధంగా హుజురాబాద్ బై ఎలక్షన్‌‌లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లో పులివెందుల బైపోల్ పేరు మీద ఉన్న రికార్డు బద్దలైంది.  దీంతో వచ్చే ఎన్నికల్లో అయ్యే ఖర్చుపై లీడర్లలో ఇప్పటి నుంచే ఆందోళన మొదలైంది. కాస్ట్‌‌లీ ఎన్నికలపై సోషల్ మీడియాలో సైతం పోస్టులు, మీమ్స్‌‌తో సెటైర్స్ వేస్తూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. 

హుజూరాబాద్ బైపోల్‌‌లో పార్టీలు ఎడాపెడా డబ్బులు కుమ్మరించాయి. ఉప ఎన్నిక పేరుతో మొత్తంగా దాదాపు వెయ్యి కోట్లు ఖర్చు అయింది. ముఖ్యంగా ఎన్నికను చావో, రేవో అనే పద్ధతిలో తీసుకున్న ఓ పార్టీ 800 కోట్ల రూపాయలు, మరో పార్టీ 200 కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది.  నియోజకవర్గంలోని 2.37లక్షల ఓటర్లలో సుమారు రెండు లక్షలమందికి ఒక్కో ఓటుకు  ఆరువేల రూపాయల చొప్పున పంచినట్లు ప్రచారం సాగింది. డబ్బును సీల్డ్ కవర్‌‌‌‌లో పెట్టి మరీ పంచారు. ఒక ఇంట్లో ఎన్ని ఓట్లు ఉంటే.. ఆ నెంబర్‌‌ను వేసి, కవర్‌‌లో పెట్టి ఇచ్చారు. ఈ లెక్కన పంచినవే 120 కోట్ల రూపాయలు. పోలింగ్‌‌కు ముందు జస్ట్‌‌ ఒక్క రోజులో ఓ పార్టీ 100 కోట్ల రూపాయలకు పైగా పంచింది. మరో పార్టీ నియోజకవర్గంలోని దాదాపు ఓటర్లందరికీ ఓటుకు1,500 రూపాయల చొప్పున ముట్టజెప్పింది. అంటే 35 కోట్ల రూపాయలు పంచిపెట్టింది. ఇవి కాకుండా, పార్టీలు ప్రతి ఇంటికీ మందు బాటిళ్లను పంచాయి. ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలోకి ఆహ్వానించడానికి, పార్టీలో ఉన్న వాళ్లు వెళ్లకుండా కాపాడుకోవడానికి భారీగా తాయిలాలు సమర్పించుకున్నాయి. సభలు, సమావేశాలు, ప్రచారం, హంగూ ఆర్భాటాలు, గిఫ్టులు ఇలా అనేక రకాలుగా విచ్చలవిడిగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాయి. 

కడపలో 250 కోట్ల రికార్డు బ్రేక్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2011లో జరిగిన కడప పార్లమెంట్, పులివెందుల అసెంబ్లీ ఉప ఎన్నికల్లో రికార్డ్ స్థాయిలో డబ్బులు ఖర్చు చేశారు. అన్ని పార్టీలు కలిపి కడప స్థానానికి 250 కోట్ల రూపాయలు, పులివెందులకు 150 కోట్ల రూపాయలు కుమ్మరించాయి. ఈ రెండు ఎన్నికలకు కలిపి అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా  200 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. ఇవే విషయాలను సెంటర్‌‌ ఫర్‌‌ మీడియా స్టడీస్‌‌ కూడా స్పష్టం చేసింది. ఈ ఎన్నికల్లో వైఎస్సార్ సీపీని ఓడించేందుకు కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు చేసినా ఆఖరికి హస్తం పార్టీ ఓటమిని చవి చూసింది. అయితే కడప, పులివెందుల తర్వాత ఇప్పుడు వెయ్యి కోట్లతో హుజూరాబాద్ బైపోల్ ఆ రికార్డు బద్దలు కొట్టింది.

అమెరికా ఎన్నికల్లో లక్ష కోట్ల ఖర్చు

ప్రపంచంలో అమెరికా ఎన్నికలను చాలా కాస్ట్​లీవిగా భావిస్తారు. 2020లో జరిగిన అమెరికా ప్రెసిడెంట్‌‌ ఎన్నికలు అత్యంత ఖరీదైనవిగా రికార్డులకెక్కాయి. ఆ ఎన్నికల్లో అక్కడి పార్టీలు దాదాపు లక్షా మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. 2012, 2016 రెండు ఎన్నికల ఖర్చును కలిపినా ఈ ఎన్నికల ఖర్చు కంటే తక్కువే. 2016 ఎన్నికలతో పోలిస్తే 2020లో ఖర్చు రెండింతలు అయిందని సెంటర్​ ఫర్ రెస్పాన్సివ్ పాలిటిక్స్ అనే సంస్థ తెలిపింది. ఇందులో రిపబ్లికన్ల కంటే డెమొక్రాట్లకే అత్యధికంగా విరాళాలు అందడంతో ఆ పార్టీనే ఎన్నికల్లో ఎక్కువగా ఖర్చు చేసింది. 

లోక్ సభ ఎన్నికల్లో 60 వేల కోట్లు 

దేశంలో 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికలతో పాటు వేర్వేరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కలిసి 55,000 కోట్ల నుంచి రూ.60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు సెంటర్‌‌ ఫర్‌‌ మీడియా స్టడీస్‌‌ తెలిపింది. ఇది 2014 ఎన్నికల ఖర్చుతో పోల్చితే 40 శాతం ఎక్కువని ఆ సంస్థ రీసెర్చ్‌‌లో తేలింది. ఎన్నికలు సజావుగా జరగడానికి ఎన్నికల కమిషన్‌‌ పెట్టిన ఖర్చుతో పాటు అభ్యర్థులు చేసిన ఖర్చు, తాయిలాలను కూడా ఇందులో లెక్క పెట్టినట్లు చెప్పింది. ఈ లెక్కల ప్రకారం ఒక్కో నియోజకవర్గంలో పార్టీలన్నీ కలిసి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లు తేల్చింది. 1998 -– 2019 మధ్య ఆరు రెట్లు ఖర్చు పెరిగిందని తెలిపింది.

రూల్స్ ప్రకారం ఎమ్మెల్యే ఖర్చు 30.80 లక్షలే

ఎన్నికల్లో ఖర్చుకు సంబంధించి ప్రత్యేకంగా రూల్స్‌‌ ఉన్నాయి. ఎమ్మెల్యే ఎన్నికల్లో ఒక స్థానానికి గరిష్టంగా 30.80లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాలి. ఈ లిమిట్‌‌ గతంలో 28లక్షల రూపాయలు మాత్రమే ఉండేది. కరోనా వల్ల ఈ ఖర్చు పెంచారు. అయితే.. ఇవి అధికారికంగా ఖర్చు చేసే లెక్కలు మాత్రమే. ఎన్నికల ఖర్చుకు సంబంధించి ప్రతి క్యాండిడేట్ కచ్చితంగా పక్కాగా లెక్క చెప్పాలి. నామినేషన్‌‌ దాఖలు చేసిన తేదీ నుంచి ఎలక్షన్ రిజల్ట్స్ ప్రకటించే తేదీ వరకు పద్దును ఎన్నికల సంఘానికి అందించాలి. ప్రతి కేండిడేట్‌‌ ప్రత్యేకంగా ఒక బ్యాంకు ఖాతా తెరవాలి. ప్రతి లావాదేవీ చెక్కుల రూపంలోనే ఉండాలనేది ఎలక్షన్​ కమీషన్​ పెట్టిన కట్టుబాటు. కానీ.. ఇలా చేసే అభ్యర్థులు చాలా తక్కువ. నిజానికి ఒక అభ్యర్థి తరపున పెట్టే ఖర్చు, పంచే సొమ్ము నేరుగా అతడే స్వయంగా ఇవ్వకుండా ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. కాగా ఎంపీగా పోటీ చేసే అభ్యర్థి ఖర్చును రూ. 70లక్షల నుంచి రూ. 77లక్షల వరకు పెంచారు. జనాభాను బట్టి ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకంగా ఈ రూల్స్‌‌  ఉన్నాయి. 

వచ్చే ఎన్నికల్లో 20వేల కోట్లకు పైనే ఖర్చు!

హుజూరాబాద్లో ఓటుకు ఆరు వేల రూపాయల చొప్పున పంచారనేది లెక్కలోకి తీసుకుంటే, ఒక్కో నియోజకవర్గానికి 120 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలి. అంటే తెలంగాణలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 119 నియోజకవర్గాలకు 15 వేల కోట్ల రూపాయల దాకా ఖర్చవుతుంది. జస్ట్ ఇవి ఓట్ల కోసం ఓటర్లకు పంచడానికి మాత్రమే. మరో ఐదు వేల కోట్లు ఇతర ఖర్చుల కోసం కావాలి. 2018 ఎన్నికల్లో ఒక్కో సీటుకు 25 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని ఫోరం ఫర్‌‌ గుడ్‌‌ గవర్నెన్స్‌‌ ప్రకటించింది. ఈ లెక్కన చూస్తే... 119 నియోజకవర్గాలకుఖర్చు మూడు వేల కోట్లు కూడా దాటలేదు. 

లీడర్లలో ఇప్పటినుంచే టెన్షన్

పదిహేనేండ్ల క్రితం ఎమ్మెల్యే ఎన్నికలకు నియోజకవర్గంలో ఒక్కో పార్టీ ఐదు కోట్ల రూపాయలకు మించి ఖర్చు పెట్టేది కాదు. ఓటుకు 100 నుంచి 200 ఇచ్చి, క్వార్టర్ సీసా ఇచ్చేవాళ్లు. ఇప్పుడు ఒక్క ఓటుకు ఆరు వేల రూపాయలు ఇవ్వడంతో వచ్చే ఎన్నికల్లోనూ ఓటర్లు ఇదే విధంగా డిమాండ్‌‌ చేసే అవకాశం ఉందని పొలిటికల్‌‌ ఎనలిస్ట్‌‌లు చెబుతున్నారు. దీంతో సిట్టింగ్‌‌ ఎమ్మెల్యేలు, టికెట్‌‌ కోసం ప్రయత్నాలు చేయాలనుకునే వాళ్లు వందల కోట్లు ఎక్కడి నుంచి తేవాలని ఇప్పటి నుంచే జంకుతున్నారు. ఇంత ఖర్చు ఎట్లా భరించాలని భయపడుతున్నారు.

వేల కోట్ల సర్కారు పైసలూ...

బరిలో ఉన్న పార్టీలు ఖర్చు పెట్టడంతో పాటు అధికార పార్టీ ప్రభుత్వ నిధుల ద్వారా లాభం పొందే ప్రయత్నం చేస్తున్నాయి. హుజూరాబాద్లో మూడు నెలల్లోనే 4,359 కోట్ల రూపాయల నిధులు కుమ్మరించారు. నిలిచిపోయిన స్కీంలను కూడా తిరిగి ప్రారంభించారు. దళిత బంధు స్కీంను పైలెట్‌‌ ప్రాజెక్ట్‌‌గా హుజూరాబాద్ను ఎంపిక చేసి,  2,200 కోట్ల రూపాయలు దళితుల అకౌంట్లలో జమ చేశారు. వెల్ఫేర్‌‌ స్కీంలకు 960కోట్ల రూపాయలు విడుదల చేసింది. మహిళా సంఘాలకు మూడేండ్లుగా మూడు వేల కోట్ల బాకీ ఉన్న సర్కారు బైపోల్‌‌ను దృష్టిలో ఉంచుకుని 200 కోట్ల రూపాయలు రిలీజ్‌‌ చేసింది. వీటిలో 120 కోట్ల రూపాయలు హుజూరాబాద్​లోని మహిళల అకౌంట్లలోనే జమ చేసింది. సీసీ రోడ్లకు 600 కోట్ల రూపాయలు, కుల సంఘాలకు స్థలాలు, భవనాలు, ఇతర పనుల కోసం నిధులు ఇచ్చింది.  

‘కాస్ట్​లీ’ పై సెటైర్లు

కాస్ట్‌‌లీ ఎన్నికలపై సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది. ఖరీదైన ఎన్నికలపై జనం సెటైరికల్‌‌గా పోస్టులు, కామెంట్లు పెడుతున్నారు. కొంత మంది మీమ్స్‌‌ క్రియేట్‌‌ చేసి సర్క్యులేట్‌‌ చేశారు. ‘ప్రపంచంలో అత్యంత ఖరీదైన ఎన్నిక ఏది?’ అని.. కౌన్‌‌ బనేగా కరోడ్‌‌పతి ప్రోగ్రాంలో అమితాబ్‌‌ బచ్చన్‌‌ ప్రశ్న వేస్తాడు. అందులో అమెరికా, కెనడా, జర్మనీతోపాటు హుజూరాబాద్​ను ఆప్షన్లుగా పెట్టి పోస్టింగ్స్‌‌ పెట్టడం కనిపించింది. ఒక గర్ల్‌‌ ఫ్రెండ్‌‌ ఎటైనా కాస్ట్​లీ ప్లేస్‌‌కు తీసుకెళ్లాలని తన  బాయ్‌‌ ఫ్రెండ్‌‌ను అడుగుతుంది. దానికి అతడు హుజూరాబాద్​కు తీసుకుపోతాడు. ‘కాస్ట్‌‌లీ ప్లేస్‌‌కు అంటే హుజూరాబాద్​కు తీసుకొచ్చావేంటి?’ అని ఆమె అంటున్న మీమ్‌‌ ఒకటి సోషల్‌‌ మీడియా సర్కిళ్లలో విపరీతంగా సర్క్యులేట్‌‌ అయ్యింది.

ఓటుకు నోటు కోసం రోడ్డెక్కి లొల్లి

జనరల్‌‌గా ఎన్నికల్లో ఓట్ల కోసం నోట్లు పంచితే వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తుంటారు. కానీ హుజూరాబాద్ ఎన్నిక కొత్త ఒరవడికి నాంది పలికింది. పోలింగ్‌‌కు రెండు రోజుల ముందు నుంచి పార్టీలు పైసల్‌‌ పంచినయ్‌‌. అయితే గ్రామాల్లో కొంతమంది ఓటర్లకు మాత్రం డబ్బులు ఇచ్చి, మరికొందరికి ఇవ్వలేదు. దీంతో డబ్బులు అందనివాళ్లు రోడ్డెక్కి గొడవకు దిగారు. అనేక చోట్ల పైసలు పంచలేదని ఆందోళన చేశారు. లీడర్లను ఘెరావ్‌‌ చేశారు. ఇళ్లను చుట్టుముట్టారు. తమకెందుకు ఓటుకు నోటు ఇవ్వరని నిలదీశారు. ఇది దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. 

పార్టీ మారినా పైసలే

ఎన్నికల్లో పైసల రాజకీయం మరో లెవల్‌‌కి చేరింది. ఓ చోటామోటా లీడర్‌‌ ఏదైనా పార్టీలోకి చేరినా, పార్టీ నుంచి వెళ్లిపోయినా పంట పండినట్టే. అవతల పార్టీలో లీడర్లు, కార్యకర్తలు ఉండకూడదనే లక్ష్యంతో భారీగా వలసలను ఎంకరేజ్‌‌ చేశాయి. ఐపీఎల్‌‌ ప్లేయర్ల మాదిరిగా ఈ లీడర్లకు కూడా మంచి ధర పలికింది. కాస్త పేరున్న లీడర్‌‌ పార్టీ మారితే మినిమం 30లక్షల రూపాయలు ముట్టజెప్పాయి. కొందరి ధర 75లక్షల రూపాయల దాకా పలికింది. కొంత మంది లీడర్లకు కాస్ట్​లీ కార్లు కూడా కొనిచ్చారు. ఇక పార్టీ మారే సమయంలో సాధారణ జనం కండువా కప్పుకున్నా 500 రూపాయల నుంచి వెయ్యి రూపాయల వరకు ముట్టజెప్పారు.  

పట్టుకున్న పైసలే 3 కోట్ల 60 లక్షలు

ఎన్నికల్లో భాగంగా విచ్చలవిడిగా డబ్బు పంచారు. మందు బాటిళ్లు అయితే లక్షలకు లక్షలు ఇళ్లలోకి చేరాయి. ఇదంతా పోలీసులు, ఎన్నికల అధికారుల కళ్లుగప్పి గుట్టుచప్పుడు కాకుండా జరిగింది. ఇందులో అధికారులు సీజ్‌‌ చేసిన డబ్బే 3.60 కోట్ల రూపాయలు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌‌ అధికారికంగా ప్రకటించింది. రూ. 11లక్షల విలువైన లిక్కర్ పట్టుకున్నారు. 10.6 లక్షల రూపాయలు విలువైన బంగారం, 2.2లక్షల విలువైన ల్యాప్‌‌టాప్‌‌లు, కుక్కర్లు, చీరలు సీజ్‌‌ చేశారు.

ప్రజాస్వామ్యం ఎక్కడుంది? 

డెమొక్రటిక్ ఇండియాలో ఓటు హక్కు ఒక వజ్రాయుధం లాంటిది. అయితే ఇది ఇప్పుడు కొటేషన్లుగా చెప్పుకోవడానికే మిగిలినట్టు అనిపిస్తోంది. సోషల్ మీడియాల్లో నీతులు చెప్పే లక్షలాది మంది ఓటర్లు ఓటు దగ్గరకు వచ్చే సరికి ‘‘డబ్బులు ఇస్తారా? లేదా?’’ అని ఎదురు చూస్తున్నారు. ఏ పార్టీ ఎంత ఆఫర్‌‌‌‌ చేస్తున్నదో తెలుసుకుంటున్నారు. చివరికి కోటీశ్వరులు కూడా డబ్బులు డిమాండ్‌‌ చేస్తున్నారు. ఓట్లను అడ్డగోలుగా వేలకు వేలు పోసి కొని కాలర్‌‌‌‌ ఎగరేస్తున్నారు లీడర్లు. కోట్లకు కోట్లు ఖర్చు పెడుతుండటంతో డబ్బున్న వాళ్లకే రాజకీయ పట్టం. పైసలు లేని వాళ్లకు రాజకీయాల్లో స్థానం లేదని జనాలు అంటున్నారు. ‘‘ఇది ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదం’’ అని ఎక్స్‌‌పర్ట్స్‌‌ చెబుతున్నారు. ‘‘ముందు ముందు డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టగలిగినవాళ్లే నాయకులు అనే పరిస్థితి వస్తే! ఏమైపోతుంది?’’అనేది ఆలోచించాల్సిన టైమ్‌‌ ఇదే!

మార్పులు తెచ్చిన శేషన్‌‌ 

డబ్బు పంచినా, గిఫ్ట్‌‌లు ఇచ్చినా పొలిటీషియన్స్ భయపడుతూనే చేస్తారు. ఆ భయానికి కారణం టి. ఎన్. శేషన్‌‌. ఆయన 1990 నుంచి 96 వరకు చీఫ్‌‌ ఎలక్షన్‌‌ కమిషనర్‌‌‌‌గా పనిచేశారు. అప్పట్లో ఆయన తీసుకొచ్చిన సంస్కరణలే ఇప్పటికీ రాజకీయ నాయకుల ఖర్చును కంట్రోల్‌‌ చేస్తున్నాయి. ఎన్నికల సంఘానికి సొంత ప్రతిపత్తి కల్పించడం దగ్గర్నుంచి.. ఓటర్లకు స్వేచ్ఛ ఇవ్వడం వరకు అనేక సంస్కరణలు తీసుకొచ్చారాయన. ఎన్నికల చట్టాలను మార్చి ఎన్నికల విధానాలను పూర్తిగా మార్చేశారు. అందుకే ప్రభుత్వ అధికారులతో కూడా ఆయనకు గొడవలయ్యాయి. గవర్నమెంట్‌‌తోనే తగువుకు దిగారు. ఎన్నికల కమిషన్ అధికారాన్ని ప్రభుత్వం గుర్తించే వరకు దేశంలో ఎన్నికలు జరిగేది లేదని తేల్చి చెప్పారు.  ఓటర్లందరికీ ఫొటో ఐడెంటిఫికేషన్ కార్డులను జారీ చేయాలని సూచించింది కూడా ఆయనే. కానీ.. అది అనవసరమైన ఖర్చు అని అప్పట్లో రాజకీయ నాయకులు కొట్టిపారేశారు. దాంతో ఆయన ఓటర్లకు గుర్తింపు కార్డులు ఇవ్వకపోతే.. ఎన్నికలు జరగవని పట్టుబట్టారు. దాంతో గవర్నమెంట్‌‌ దిగి రాక తప్పలేదు. శేషన్ అధికారాలను తగ్గించడానికి రాజ్యాంగాన్ని సవరించి మరీ.. మరో ఇద్దరు అదనపు కమిషనర్లను నియమించారు. అయినా శేషన్‌‌ వెనక్కి తగ్గలేదు. ఎన్నికల కమిషన్‌‌పై చీఫ్ కమిషనర్‌‌కు పూర్తి కంట్రోల్‌ ఉంటుందని కోర్ట్‌‌ ఆర్డర్స్ తీసుకొచ్చి మరీ ఆయన అనుకున్న  లక్ష్యాలను సాధించారు. 1997లో భారత రాష్ట్రపతి పదవికి పోటీ చేసి కేఆర్ నారాయణన్ చేతిలో ఓడిపోయారు. 10 నవంబర్ 2019న 86 ఏండ్ల వయసులో చనిపోయారు. 

గిఫ్ట్‌‌లు ఇవ్వడం

డబ్బు పంచడంతో పాటు ఓటర్లకు గిఫ్ట్‌‌లు ఇవ్వడం కూడా ఇప్పుడు కామన్‌‌ అయిపోయింది. ప్రస్తుతం పొలిటీషియన్స్‌‌ షాపింగ్‌‌ టోకెన్లు, ప్రిపెయిడ్ ఫోన్ రీఛార్జ్ కూపన్లు, న్యూస్‌‌పేపర్‌‌‌‌ చందాలు, పాల ప్యాకెట్ల  టోకెన్లు, మొబైల్ వాలెట్‌‌లో డబ్బులు వేయడం లాంటివి చేసి ఓటర్లను మభ్యపెడుతున్నారు. 

లొంగని ఓటర్లు కోట్లు కుమ్మరించనీయండి. వద్దు వద్దన్నా సరే, వేలకు వేల రూపాయలు ఇండ్లల్లో పారేసి వెళ్లనీయండి. ‘‘మమ్మల్ని, మా ఓట్లను కొనలేరు’’ అని నిజాయితీగా నిలబడే జనమూ ఉన్నారు. హుజూరాబాద్​ ఓటర్లే దానికి రుజువు.

తమిళనాడు ఎలక్షన్స్‌‌ బ్రేక్‌‌ 

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత చనిపోయిన తర్వాత ఖాళీ ఏర్పడిన ఆర్‌‌కె నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి 2017లో ఉప ఎన్నిక జరిగింది. అయితే.. ఈ ఎన్నికలో ఓటర్లకు డబ్బు పంచారని తెలుసుకున్న ఎన్నికల కమిషన్‌‌ ఎలక్షన్స్‌‌ని వాయిదా వేస్తున్నట్లు అర్ధరాత్రి ప్రకటించింది. ఎన్నికల చట్టాలను పాటించలేదనే కారణంతో వాయిదా వేస్తున్నట్లు చెప్పింది. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు, గిఫ్ట్‌‌లు పంచారని ఎలక్షన్‌‌ కమిషన్‌‌ వాదించింది. అప్పటి తమిళనాడు ఆరోగ్యశాఖ మంత్రి     సి. విజయభాస్కర్‌‌ ఆఫీసుల్లో ఇన్‌‌కం టాక్స్‌‌ ఆఫీసర్లు సోదాలు చేశారు. అప్పుడు లెక్కల్లో ఆర్‌‌కె నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్లకు 89 కోట్ల రూపాయలు పంచినట్లు తేలింది. ఒక్కో ఓటరుకు నాలుగు వేల రూపాయల చొప్పున ఇచ్చినట్టు ఎలక్షన్​ కమిషన్​ ఆరోపించింది. అందుకే ఆ తర్వాత అక్కడ కట్టుదిట్టమైన ఏర్పాట్లతో ఎన్నికలు నిర్వహించింది. అయితే.. తమిళనాడులోనే అంతకుముందు  ఒకసారి ఇదే కారణంతో ఎన్నికలు వాయిదా వేశారు. ఓటర్లకు డబ్బు పంచారనే కారణంతోనే తంజావూరు, అరవకురిచ్చి ఎన్నికలను వాయిదా వేసింది ఎలక్షన్​ కమిషన్​ . 

::: పున్న శ్రీకాంత్