యమా ​స్పీడ్​గా ఎన్నికల కసరత్తు..ఈసీ ఆదేశాలతో రంగంలోకి అధికారులు

యమా ​స్పీడ్​గా ఎన్నికల కసరత్తు..ఈసీ ఆదేశాలతో రంగంలోకి అధికారులు
  • ఓవైపు ఈవీఎంలు, పోలింగ్​ స్టేషన్ల చెకింగ్​
  • ముగిసిన ఇంటింటి సర్వే
  • జోరుగా కొత్త ఓటర్ల ఎన్​రోల్​మెంట్​
  • ఆగస్టు 2న డ్రాఫ్ట్​ ఓటరు లిస్ట్ విడుదలకు సన్నాహాలు
  • బీఎల్​వోలుగా అంగన్​వాడీలు, ఆశాల నియామకం
  • 10 నుంచి అవగాహన కార్యక్రమాలు
  • రాష్ట్రంలోనూ హోం ఓటింగ్​కు చర్యలు

మహబూబ్​నగర్​, వెలుగు: రాష్ర్టంలో ఎన్నికల వాతావరణం మొదలైంది. సెప్టెంబర్​ లేదా అక్టోబర్​ మధ్యలో ఎలక్షన్​ నోటిఫికేషన్​ జారీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ లెక్కన వచ్చే డిసెంబర్​లో ఎలక్షన్లు ఉంటాయని ప్రధాన రాజకీయ పార్టీలు ప్రకటనలు చేస్తున్నాయి. మరోవైపు ఎలక్షన్​ కమిషన్​ ఏర్పాట్లను స్పీడప్​ చేసింది. ఈసీ ఆదేశాలతో రంగంలోకి దిగిన ఆఫీసర్లు.. రాష్ట్రవ్యాప్తంగా కొత్త ఓటర్ల నమోదు, ఓటరు లిస్టులో మార్పులు,చేర్పులు, ఈవీఎంలు, పోలింగ్​ స్టేషన్ల తనిఖీలను ముమ్మరం​ చేశారు. బీఎల్​వోల నియామకంతో పాటు శాఖలవారీగా ఆఫీసర్లు, ఉద్యోగులకు ఎన్నికల శిక్షణ దాదాపు పూర్తికావచ్చింది. అటు బూత్​లవారీగా సౌలతుల ఏర్పాటు ప్రక్రియ కూడా మొదలైంది. మరోవైపు  కొత్త ఓటర్ల ఎన్​రోల్​మెంట్​జోరుగా సాగుతోంది. ఈక్రమంలోనే  ఆగస్టు 2న డ్రాఫ్ట్​ ఓటరు లిస్ట్ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ నెల చివరికల్లా ఏర్పాట్లు పూర్తిచేసి ఎలక్షన్​ ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు యావత్​ యంత్రాంగం సర్వసన్నద్ధమవుతోంది.

 ముగిసిన హౌస్​ టు హౌస్​ సర్వే

ఓటర్​ లిస్టులో మార్పు చేర్పుల కోసం చేపట్టిన హౌస్​ టూ హౌస్​ సర్వే జూన్​ 23కే పూర్తయింది. బూత్​ లెవల్​ ఆఫీసర్లు​గా నియమించిన అంగన్​వాడీలు, ఆశాలు పాత ఓటర్​ లిస్టుల ఆధారంగా ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించారు. ‘ఒక ఇంట్లో ఎంత  మంది ఉన్నారు? ఓటరు లిస్టులో ఉన్న వ్యక్తులు బతికే ఉన్నారా? ఇకడే నివాసం ఉంటున్నారా? చనిపోయారా? వీరి పేర్లను లిస్టులో నుంచి తీసేయాల్సిన అవసరం ఉందా? పేర్లు, అడ్రస్​లో మార్పులు చేయాల్సి ఉందా? ఆ ఇంట్లో 18 ఏండ్లు నిండిన యువత ఉన్నారా? వారికి ఓటు హక్కు కల్పించాలా?’ అనే వివరాలను నోట్​ చేశారు. ఈ వివరాలను ఆన్​లైన్​లో ఎంట్రీ చేస్తున్నారు. చనిపోయిన వారి పేర్లను తొలగించి, పెళ్లిళ్లు చేసుకొని వెళ్లిన యువతుల వివరాలను ఆయా ఊళ్లకు షిఫ్ట్​ చేస్తున్నారు. ఒకే పేరు మీద ఎంట్రీ అయిన డబుల్​ ఓట్లను సరిచేస్తున్నారు. ఇప్పటికే ఈ ప్రక్రియ 70 శాతం పూర్తి కాగా, ఈ నెలాఖరు నాటికి వంద శాతం కంప్లీట్​ చేయనున్నారు. ప్రాథమిక సమాచారం మేరకు ఈ సర్వే ద్వారా 10.5 లక్షల డూప్లికేట్​ ఓట్లను తొలగించినట్లు తెలిసింది.

పోలింగ్​ స్టేషన్ల తనిఖీలు..

తహసీల్దార్లు, ఎంపీడీవోలు, ఇతర జిల్లా స్థాయి ఆఫీసర్లు వారంలో రెండు రోజులు తమ పరిధిలోని పోలింగ్​ స్టేషన్లను తనిఖీ చేస్తున్నారు. వీరితో పాటు బీఎల్​వోలతో స్టేషన్ల విజిట్​ చేయిస్తున్నారు. అక్కడ ఎలాంటి వసతులు అవసరం ఉన్నాయి? కరెంటు ఉందా? లైట్లు, ఫ్యాన్లు ఉన్నాయా? మంచినీళ్లు అందుబాటులో ఉన్నాయా? టాయిలెట్స్​ ఉన్నాయా? ఫర్నిచర్​ ఉందా? ర్యాంప్​ ఉందా? అనే వివరాలను ఫీల్డ్​కు వెళ్లి పరిశీలిస్తున్నారు.  ఇంకా ఎలాంటి వసతులు కల్పించాలనేది నోట్​ చేసుకుంటున్నారు. క్రిటికల్​, హైపర్​ క్రిటికల్​, సెన్సిటివ్​ ఏరియాలను మండల స్థాయి ఆఫీసర్లు విజిట్​ చేస్తున్నారు. సెన్సిటివ్​ ఏరియాల్లో పోలింగ్​ స్టేషన్ల లొకేషన్ మార్చాలా? రష్​ ఎక్కువగా ఉంటే స్టేషన్​ ప్రాంతంలో అదనంగా మరో  స్టేషన్​ అవసరం అవుతుందా? అనే వివరాలను ఫీల్డ్​ విజిట్​లో రికార్డ్​ చేస్తున్నారు.

డ్రాఫ్ట్​ ఓటరు లిస్ట్​కు రెడీ..

కొత్త ఓటరుగా ఎన్​రోల్​ చేసుకోవడానికి పబ్లిక్​ స్వచ్ఛందంగా ముందుకొస్తున్నట్లు ఆఫీసర్లు చెబుతున్నారు. గ్రామాల్లో కొందరు వలంటీర్లు, బీఎల్​వోలు సైతం 18 ఏండ్లు నిండిన వారిని గుర్తించి, వారితో కొత్త ఓటరుగా నమోదు చేయిస్తున్నారు. ఈ ప్రక్రియ జోరుగా సాగుతుండగానే మరోవైపు  కొత్త ఓటర్ల నమోదు కోసం వచ్చిన అప్లికేషన్లు, మార్పులు, చేర్పులు, డిలిషన్​ వివరాలతో ఎలక్షన్​ కమిషన్​ ఆఫ్​ ఇండియా ఆగస్టు 2న డ్రాఫ్ట్​ ఓటరు లిస్ట్​ను పబ్లిష్​ చేయనుంది. ఈ లిస్టును అన్ని గ్రామాలవారీగా పంచాయతీ ఆఫీసుల వద్ద అతికించనున్నారు. వీటి ఆధారంగా మళ్లీ అబ్జెక్షన్లు, మిస్సింగ్​ నేమ్స్​ తదితర వివరాలను సేకరించనున్నారు. పొలిటికల్​ పార్టీలకు ఈ లిస్ట్​ను అందజేసి, శని, ఆదివారాల్లో స్పెషల్  క్యాంపులు నిర్వహించనన్నారు. అనంతనం సెప్టెంబరులో తుది ఓటరు జాబితాను విడుదల చేయనున్నారు.

గ్రామాలకు మొబైల్​ ఈవీఎంలు

ఈవీఎంలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎలక్షన్​ కమిషన్​ డెమాన్​స్ర్టేషన్​, స్టాస్టిక్​ ఈవీఎంలను అందుబాటులోకి తేనుంది. ఇందులో ఒక సెట్​ తహసీల్దార్​ ఆఫీసులో, మరొక సెట్​ మొబైల్​ ఈవీఎం ద్వారా గ్రామాల్లో ప్రదర్శించనున్నారు. మొబైల్​ టీం వెంట సెక్టోరియల్​ ఆఫీసర్​ అందుబాటులో ఉంటారు. ప్రతి ఓటరుకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ నెల 10 నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఆగస్టు 30 కల్లా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేసేలా టార్గెట్​ పెట్టుకున్నారు. ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఆఫీసర్లు రూట్​ మ్యాప్​లకు సంబంధించిన షెడ్యూల్స్​ తయారు చేస్తున్నారు.

ఈవీఎంల భద్రతపై స్పెషల్ ​ఫోకస్​

ఈవీఎంలను భద్రపర్చిన స్ర్టాంగ్​ రూమ్​లను కలెక్టర్​, అడిషనల్​ కలెక్టర్​ స్థాయి ఆఫీసర్లు నిత్యం తనిఖీ చేస్తున్నారు. ఈవీఎంల భద్రత ఎలా ఉంది? అనే దానిపై ఎప్పటికప్పుడు రిపోర్ట్​ తెప్పించుకుంటున్నారు. అలాగే ఎన్నికల రిటర్నింగ్​ ఆఫీసర్లు నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఎన్ని ఈవీఎంలు అవసరం అవుతాయనే వివరాలను నోట్​ చేస్తున్నారు.

బీఎల్​వోల కీ రోల్..

ఎన్నికల ఏర్పాట్లలో బీఎల్​వోలు కీ రోల్ పోషిస్తున్నారు​. విలేజ్​ లెవల్​లో 12 కేటగిరీలలో ఉన్న వర్కర్లను బీఎల్​వోలుగా గుర్తించేందుకు చర్యలు తీసుకోగా, అందులో తెలంగాణలో ఆశా కార్యకర్తలు, అంగన్​వాడీలు, పంచాయతీ సెక్రటరీలు, వీవోఏలను బీఎల్​వోలుగా నియమించారు. రాష్ర్ట వ్యాప్తంగా 34,867 మంది ప్రస్తుతం బీఎల్​వోలుగా పని చేస్తుండగా, వీరిలో అత్యధిక మంది అంగన్​వాడీలు, ఆశా కార్యకర్తలే ఉన్నారు. వీరికి మొబైల్​ టెక్నాలజీపై పట్టు ఉండటం, గ్రామ స్థాయిలో అందరితో పరిచయాలు ఉండటం, గతంలో ప్రభుత్వం నిర్వహించిన సర్వేల్లో భాగస్వామ్యం కావడంతో ఎక్కువ జిల్లాల్లో అంగన్​వాడీలు, ఆశలనే బీఎల్​వోలుగా నియమించారు.

బీఎల్​వో యాప్​

ఎన్నికలకు సంబంధించిన వివరాలు గతంలో గరుడ యాప్​ ద్వారా అప్​డేట్​ చేసేవారు. కానీ, ఇప్పుడు బీఎల్​వో యాప్​ను అందుబాటులోకి తెచ్చారు. ఈ యాప్​ ద్వారానే కొత్త ఓటరు నమోదు, మార్పులు, చేర్పులు, డెలిషన్​కు సంబంధించిన ఫామ్స్​ను బీఎల్​వోలో అప్​లోడ్​ చేస్తున్నారు. తర్వాత ఈ వివరాలు ఎన్నికల సూపర్​వైజర్లకు చేరుతాయి. వారు వెరిఫై చేసి ఏఈఆర్​వో (తహసీల్దార్​) లాగిన్​ను సెండ్​ చేస్తారు. ఏఈఆర్​వో చెక్​​ చేశాక ఈఆర్​వో (ఆర్డీవో) లాగిన్​కు సెండ్​ అవుతాయి. ఈఆర్​వో ఫైనల్​ అప్రూవల్​ తర్వాత కొత్త కార్డు జారీ, ఓటరు లిస్టులో  మార్పులు, చేర్పులు చేస్తున్నారు.

జోరుగా మార్పులు చేర్పులు

డబుల్​ ఓటర్ల అబ్జెక్షన్​, డిలిషన్​, చనిపోయిన వారి పేర్లను తొలగించేందుకు గతంలో ఐదారు రకాల పత్రాలు సబ్మిట్​  చేయాల్సి వచ్చేది. కానీ,ఈసారి వీటన్నింటినీ పక్కనపెట్టిన ఈసీ, ఫామ్​-6, 7, 8లను అందుబాటులోకి తెచ్చింది. ఇందులో ఫామ్ ​-6 ద్వారా ఫ్రెష్​ ఎన్​రోల్​మెంట్​ చేస్తున్నారు. ఫామ్​- 6బీని ఓటరు జాబితాకు ఆధార్​ కార్డు లింక్​ చేయడానికి వాడుతున్నారు. ఫామ్​-7 ద్వారా చనిపోయిన వారి పేర్లు తొలగించడం, పెళ్లిళ్లు చేసుకొని వేరే ప్రాంతాలకు షిఫ్ట్​ అయిన వారి పేర్లను మార్చడం, డబుల్​ ఓట్ల అబ్జక్షన్​, డిలిషన్​కు సంబంధించిన ప్యూరిఫికేషన్​ చేస్తున్నారు. ఫామ్​-8లో మూడు రకాలున్నాయి. మొదటిది మైగ్రేషన్​ ఓటర్లు (వలస ఓటర్లు). ఒక నియెజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి ఓటరును మార్చుకోవానికి ఈ ఫామ్​ ద్వారా అప్లై చేసుకోవచ్చు. రెండోది ఓటరు కార్డు కరెక్షన్​. కార్డులో పేరు, తండ్రి పేరు, జండర్​, వయసు, ఇంటి అడ్రెస్​ కరెక్షన్లు చేసుకోవచ్చు. మూడోది పర్సన్​ విత్​ డిజేబులిటీ (పీవీడీ). ఈ ఫామ్​ ద్వారా దివ్యాంగులు ఓటు కోసం అప్లై చేసుకోవచ్చు. వచ్చిన అప్లికేషన్​ను బీఎల్​వోలు వెరిఫై చేసి, అప్రూవల్​కు పంపిస్తారు. అప్రూవల్​ తర్వాత ఓటరు జాబితాలో వీరి పేరు వద్ద టిక్​ మార్కింగ్​ వేస్తారు. ఆ మార్క్​ ఆధారంగా అక్కడి పోలింగ్​ స్టేషన్​లో సౌలత్​లు కల్పిస్తారు.

కర్ణాటక తరహాలోనే హోం ఓటింగ్​

ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో ఈసా హోం ఓటింగ్​ను అందుబాటులోకి తెచ్చారు. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో కూడా ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఆఫీసర్లు రెడీ అయ్యారు. ఈ మేరకు ఇటీవల జరిగిన ఆఫీసర్ల మీటింగుల్లో ఈ అంశాన్ని ప్రస్తావించారు. కానీ, క్లారిటీ ఇవ్వలేదు. అయితే హోం ఓటింగ్​ కేవలం 80 ఏండ్లు పైబడిన వృద్ధులకు, 40 శాతం వైకల్యం ఉన్న దివ్యాంగులకు వర్తింపజేస్తారు.  హోం ఓటింగ్​ కోసం ముందుగానే బీఎల్​వోలకు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వారు అప్రూవల్​ చేశాక, బ్యాలెట్​ ఒటింగ్​ ద్వారా ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.