కాంగ్రెస్ లో రాజుకుంటున్న అసమ్మతి..

కాంగ్రెస్ లో రాజుకుంటున్న  అసమ్మతి..
  • కొత్తవారికి టికెట్ ఇస్తే తమ పరిస్థితి ఏమిటని సీనియర్ల ప్రశ్న
  • రోడ్లపైకి చేరి కార్యకర్తల నిరసనలు
  • సోషల్​ మీడియాలో పోస్టుల వార్

ఆసిఫాబాద్ ,వెలుగు:  అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆసిఫాబాద్ కాంగ్రెస్​లో గ్రూపు రాజకీయాలు ఎక్కువైతున్నయ్. ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ భర్త శ్యామ్ నాయక్ కాంగ్రెస్​లో చేరిన తర్వాత ఆ పార్టీలో అసంతృప్తి తారస్థాయికి చేరుకుంది. మొదటి నుంచి టికెట్ ఆశిస్తూ ఊరూరా పర్యటనలు చేసిన డాక్టర్ గణేశ్ రాథోడ్, దివంగత మాజీ మంత్రి కోట్నాక్ భీంరావు కూతురు, ఆసిఫాబాద్ మాజీ సర్పంచ్ మర్సుకోల సరస్వతి, అనార్ పల్లి సర్పంచ్ రాథోడ్ శేషారావు లు శ్యామ్ నాయక్ చేరికపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పార్టీలో కొత్తగా చేరిన శ్యామ్ నాయక్ కు టికెట్ ఇస్తే తాము పనిచేయబోమంటూ జైనూర్​లో ఏకంగా నిరసన ర్యాలీ చేపట్టారు. బహిరంగంగానే కాకుండా సోషల్ మీడియా వేదికల ద్వారా కూడా ఈ వర్గాలు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం పార్టీ శ్రేణుల్లో కలవరం రేపుతోంది.

సీనియర్​ నేతల మధ్య విభేదాలు

కొన్నేళ్లుగా పార్టీ అభివృద్ధి కోసం పనిచేస్తున్న మమ్మల్ని కాకుండా కేవలం టికెట్​పై ఆశలతో వచ్చిన వారికి ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటని సీనియర్లు ప్రశ్నిస్తున్నారు. పార్టీ సీనియర్ ​నేతలైన మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, డీసీసీ అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్ మధ్య ఇప్పటికే పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. వీరిద్దరి మధ్య నెలకొన్న విభేదాలు పార్టీ గెలుపునకు అవరోధాకంగా మారాయి. గణేశ్ రాథోడ్​కు టికెట్ ఇప్పిస్తానంటూ ప్రేమ్ సాగర్ రావు ఛాలెంజ్ చేయగా.. విశ్వప్రసాద్ వర్గీయులు శ్యామ్ నాయక్​ను రంగంలోకి దింపి ప్రతి సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో అధిష్ఠానం టికెట్​ఎవరికి ఇస్తుందోననే చర్చ మొదలైంది. మరో వైపు కాంగ్రెస్ అధిష్టానం టికెట్ విషయంలో తనవైపే నిలుస్తుందని మాజీ సర్పంచ్ మర్సుకోల సరస్వతి ధీమాతో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నేతల వారీగా కార్యకర్తలు కూడా చీలిపోయి సోషల్ మీడియాలో ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితులు ఇతర పార్టీలకు సానుకూలంగా మారనుండటంతో కాంగ్రెస్​శ్రేణులు ఒకింత భయాందోళనకు గురవుతున్నాయి. ప్రత్యర్థుల్ని ఎదుర్కొనేందుకు అసంతృప్తి వర్గాలన్నీ కలిసి వస్తాయా? లేదా అనే ఆందోళన కార్యకర్తల్లో మొదలైంది. 

పెరిగిన ఆశావహులు

ఆసిఫాబాద్ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచేందుకు కాంగ్రెస్ నుంచి ఆశావహులు క్యూ కట్టారు. ఊహించినట్లుగానే డాక్టర్ గణేశ్ రాథోడ్, మర్సుకోల సరస్వతి,రాథోడ్ శేషారావు టికెట్​కోసం అప్లై చేసుకున్నారు. పీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన శ్యామ్ నాయక్ వెంటనే టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీరితోపాటు తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు, గవర్నమెంట్ టీచర్ చౌహాన్ శ్రీనివాస్, దివ్య శ్రీ ఫౌండేషన్ ఛైర్మన్ ప్రవీణ్ నాయక్ టికెట్ రేసులో ఉన్నారు. దీంతో అధిష్టానం ఎవరి వైపు మొగ్గుతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది.