తెలంగాణలో కొలువుదీరిన కొత్త సభ  .. ప్రమాణం చేసిన 101 మంది ఎమ్మెల్యేలు

తెలంగాణలో కొలువుదీరిన కొత్త సభ  .. ప్రమాణం చేసిన 101 మంది ఎమ్మెల్యేలు
  • వివిధ కారణాలతో 18 మంది దూరం
  • తొలుత సీఎం, డిప్యూటీ సీఎంతో 
  • ప్రమాణం చేయించిన ప్రొటెం స్పీకర్
  • అనంతరం మంత్రులు, మహిళా ఎమ్మెల్యేల ప్రమాణం
  • ప్రతిపక్ష సభ్యులను పలకరించిన సీఎం రేవంత్​
  • ఈ నెల 14కు వాయిదా పడిన అసెంబ్లీ

హైదరాబాద్, వెలుగు: పరిచయాలు, ఆత్మీయ పలకరింపుల నడుమ ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి అసెంబ్లీ సమావేశాలు శనివారం ప్రారంభమయ్యాయి. 101 మంది ఎమ్మెల్యేలు ప్రమాణం చేశారు. వివిధ కారణాలతో మరో 18 మంది ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. ఫస్ట్​ టైమ్​ ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలో అడుగుపెట్టినవారు తమ కుటుంబసభ్యులతో వచ్చారు. గ్యాలరీల నుంచి కుటుంబసభ్యులు వీక్షిస్తుండగా ప్రమాణం చేశారు. జూనియర్లకు సీనియర్లు శుభాకాంక్షలు తెలియజేశారు. సీనియర్ల నుంచి అక్కడి వివరాలను జూనియర్లు అడిగి తెలుసుకున్నారు. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమైంది. జాతీయ గీతం అనంతరం ప్రొటెం స్పీకర్‌‌ అక్బరుద్దీన్ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. 

తొలుత సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, శ్రీధర్‌‌బాబు, దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వర్‌‌రావు, జూపల్లి కృష్ణారావు ప్రమాణం చేశారు. ఆ తర్వాత మహిళా ఎమ్మెల్యేలు పర్నికా రెడ్డి, యశస్వినిరెడ్డి, పద్మావతిరెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి, లాస్య నందిత, కోవా లక్ష్మి, మట్టా రాగమయి ప్రమాణం చేశారు. ఆ తర్వాత ఆల్ఫా బెటికల్ ఆర్డర్‌‌లో మిగతా ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం  చేయించారు. అందరికంటే చివరగా మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ప్రమాణం చేశారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేలు తెలుగులో, కొంత మంది ఇంగ్లిష్‌లో ప్రమాణం చేశారు. ఎంఐఎం ఎమ్మెల్యేలు ఉర్దూలో చేశారు. 

యశస్వినికి కొండా సురేఖ అభినందనలు 

పాలకుర్తిలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావును ఓడించిన మామిడాల యశస్వినిరెడ్డి ప్రమాణ స్వీకార సమయంలో మంత్రి కొండా సురేఖ ఉత్సాహంగా కనిపించారు. ప్రమాణం చేసేందుకు యశస్వినిరెడ్డి పేరును అసెంబ్లీ సెక్రటరీ పిలవగానే సురేఖ కేక వేసి ఆమెకు ఆహ్వానం పలికారు. బల్లలు చరుస్తూ అభినందించారు. ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత యశస్వినిని హగ్ చేసుకుని సంతోషాన్ని పంచుకున్నారు. ఎన్నికల్లో ఎర్రబెల్లి దయాకర్​ను ఓడించి, అసెంబ్లీలో అడుగుపెట్టినందుకు యశస్వినికి శుభాకాంక్షలు తెలియజేశారు.  

ప్రమాణం చేయని 18 మంది

మొత్తం 119 ఎమ్మెల్యేలు ఉండగా..  101 మంది శనివారం ప్రమాణం చేశారు. 18 మంది సభలో ప్రమాణం చేయలేదు. హిప్ రిప్లేస్‌మెంట్ సర్జరీ చేయించుకుని హాస్పిటల్‌లో ఉన్న మాజీ సీఎం, గజ్వేల్​ ఎమ్మెల్యే కేసీఆర్‌‌, ఆయన వెంట ఉన్న మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ అసెంబ్లీకి హాజరు కాలేదు.  తన తండ్రి కేసీఆర్ హాస్పిటల్‌లో ఉన్నందున ప్రమాణ స్వీకారానికి రాలేకపోతున్నానని,  మరో రోజు ప్రమాణం చేయడానికి స్పీకర్‌‌ను సమయం కోరుతానని కేటీఆర్‌‌ ట్వీట్ చేశారు. బీఆర్‌‌ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, కడియం శ్రీహరి కూడా ప్రమాణం చేయలేదు.

ఈ ముగ్గురు తమ ఎమ్మెల్సీ పదవులకు శనివారం రాజీనామా చేశారు. రాజీనామాలను కౌన్సిల్ చైర్మన్ ఆమోదించిన తర్వాతే వీరు ఎమ్మెల్యేలుగా ప్రమాణం చేయాల్సి ఉంది.  ఎంపీలుగా ఉండి ఎమ్మెల్యేలుగా గెలుపొందిన కొత్త ప్రభాకర్‌‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్‌‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి కూడా ప్రమాణ స్వీకారానికి దూరంగా ఉన్నారు. ఈ ముగ్గురి ఎంపీ పదవుల రాజీనామాలను లోక్‌సభ స్పీకర్ ఆమోదించిన తర్వాతే ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో శనివారం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వీరు దూరంగా ఉన్నారు. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకట్​రెడ్డి అసెంబ్లీకి వచ్చినప్పటికీ, సభ లోపలికి రాలేదు. ఇక మాజీ డిప్యూటీ స్పీకర్‌, సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్, మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి వ్యక్తిగత కారణాలతో సభకు హాజరవలేకపోయామని తెలిపారు. 

బీజేపీ ఎమ్మెల్యేలు రాలె

బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఏలేటి మహేశ్వర్‌‌రెడ్డి, పాయల్ శంకర్‌‌, పాల్వాయి హరీశ్‌బాబు, రామారావు పవర్, కాటిపల్లి వెంకట రమణారెడ్డి, ధన్‌పాల్ సూర్యనారాయణ, పైడి రాకేష్‌రెడ్డి అసెంబ్లీకి రాలేదు. ప్రొటెం స్పీకర్‌‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని నియమించడాన్ని బీజేపీ వ్యతిరేకిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ప్రమాణ స్వీకారోత్సవానికి బీజేపీ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నారు. పూర్తి స్థాయి స్పీకర్‌‌ను నియమించాక, ఆయన సమక్షంలో ప్రమాణం చేస్తామని వారు ప్రకటించారు. 

అందరినీ పలకరించిన సీఎం, మంత్రులు

సభ ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు మంత్రులు, తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి వచ్చారు. ప్రతిపక్షం వైపు హరీశ్‌రావు ముందు వరసలో కూర్చోగా, ఆయన పక్కన పోచారం శ్రీనివాస్​రెడ్డి కూర్చున్నారు. సీఎం రేవంత్​రెడ్డి.. హరీశ్‌రావుతో మొదలు పెట్టి ప్రతిపక్ష సభ్యులందరి వద్దకు వెళ్లి పలకరించారు. డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు ప్రతిపక్ష సభ్యులను పలకరించారు. ఫస్ట్​ టైమ్​ ఎమ్మెల్యేలుగా గెలిచిన వారికి రేవంత్ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రమాణ స్వీకారం తర్వాత  కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌రెడ్డితో ఫొటోలు దిగారు. ఒకరినొకరు అప్యాయంగా పలకరించుకున్నారు.

కార్మికుని గెటప్‌లో వచ్చిన మక్కాన్‌సింగ్

రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్  తన వేషధారణతో సభ దృష్టిని ఆకర్షించారు. సింగరేణి కార్మికుల యూనిఫామ్‌ను ఆయన ధరించారు. కార్మికులు ఉపయోగించే చమ్మాస్, తట్ట, లైట్‌ను కూడా ఆయన ధరించినప్పటికీ, నిబంధనల ప్రకారం అసెంబ్లీ సిబ్బంది వాటిని సభలోకి అనుమతించలేదు. కార్మికుడి గెటప్‌లోనే ఆయన ప్రమాణం చేశారు. అసెంబ్లీకి తొలిసారి ఎన్నికైన పలువురు ఎమ్మెల్యేలు కుటుంబ సభ్యులతో సహా అసెంబ్లీకి వచ్చారు. విజిటర్స్‌ గ్యాలరీ నుంచి ప్రమాణ స్వీకారాన్ని తిలకించారు. ఎమ్మెల్యేలు, మంత్రుల కుటుంబ సభ్యులతో శాసన సభ ప్రాంగణం కోలహాలంగా కనిపించింది. సభ ప్రాంగణంలో, లాబీల్లో, ఎల్పీ ఆఫీసుల్లో ఫొటోలు దిగుతూ తమ సంబురాన్ని వారంతా పంచుకున్నారు.