- బీజేఎల్పీ నేత ఏలేటి, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం మధ్య మాటల యుద్ధం
- గాంధీ పేరు తీసేసి.. వాటాను తగ్గించినోళ్లు మాట్లాడటం ఏంటన్న శ్రీధర్ బాబు
- బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఉన్న నేతలనూ మాట్లాడనివ్వడం లేదన్న పొన్నం
హైదరాబాద్, వెలుగు: ఉపాధిహామీ పథకంపై అసెంబ్లీలో బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మంత్రుల మధ్య వాగ్యుద్ధం నడిచింది. ఉపాధిహామీ పథకంతో పాటు మంత్రుల హెలికాప్టర్ జర్నీలపైనా ఏలేటి నోరు జారారు. గాలితిరుగుళ్లు అని వ్యాఖ్యానించడంతో దానిపైనా దుమారం రేగింది. సోమవారం అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా బడ్జెట్ కేటాయింపులు, అవుట్కమ్పై ఏలేటి మాట్లాడారు.
వీబీజీ రామ్ జీ (ఉపాధి హామీ) పథకానికి 2024–25లో రూ.4,341 కోట్లు.. 2025–26లో ఇప్పటివరకు రూ.3,240 కోట్లు ఖర్చు చేశారన్నారు. గతంలో 90:10 రేషియో ఉంది కనుక నిధులు తక్కువ ఇచ్చి ఉండొచ్చని, కానీ, ఇప్పుడు రేషియో పెరిగాక కూడా బడ్జెట్ ఎస్టిమేట్స్‌లో కేవలం రూ.1,500 కోట్లే ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. దీంతో మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లు ఆయనకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉపాధి హామీ పథకం గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీ సభ్యులకు లేదని శ్రీధర్ బాబు అన్నారు. కొత్త పథకం వల్ల తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే స్పందించకుండా ఇప్పుడు తమపై విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు.
ఉపాధిహామీకి మహాత్ముడు గాంధీ పేరుంటే దానిని తీసేసి వీబీ జీ రామ్ జీ అని పెట్టారని విమర్శించారు. ఇప్పుడు 60:40గా ఉన్న వాటా.. భవిష్యత్‌లో 30:70కి తగ్గిపోతుందని మండిపడ్డారు. వీబీ జీ రామ్ జీతో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని వాళ్ల కేంద్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అయితే, ఇది కేవలం తెలంగాణ రాష్ట్రం కోసం తేలేదని, బీజేపీ పాలిత రాష్ట్రాలూ అందులో ఉంటాయని చెప్పారు. దీనికి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. దేశమంతటికీ ఉన్నా దానిని తాము వ్యతిరేకిస్తున్నామని తేల్చి చెప్పారు.
గాలితిరుగుళ్లు కామెంట్స్‌పై దుమారం..
రాష్ట్రంలో కల్తీని అరికట్టేందుకు కేవలం రూ.50 లక్షలు కేటాయించారని, ఇది ఎలా సరిపోతుందని ఏలేటి ప్రశ్నించారు. ఇది మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్లో తిరగడానికే ఖర్చు అవుతుందని, గాలితిరుగళ్లకు పెట్టేంత బడ్జెట్ కూడా కల్తీని అరికట్టేందుకు ఇవ్వకుంటే ఎలా అని ప్రశ్నించారు. గాలి తిరుగుళ్లు అని ఏలేటి అనడంపై భట్టి జోక్యం చేసుకున్నారు. పథకాలు క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు మంత్రులు తిరుగుతుంటారని, అలాంటి పనులకు వెళ్తుంటే గాలితిరుగుళ్లు అని మాట్లాడడం సరికాదన్నారు. అయితే, గాలిమోటార్లో తిరగడం గాలితిరుగుళ్లేనని ఏలేటి దానిని సమర్థించుకున్నారు. దీంతో మంత్రి పొన్నం ప్రభాకర్ కల్పించుకుని.. గాలితిరుగుళ్లు అనడం అభ్యంతరకరమన్నారు.
మహేశ్వర్ రెడ్డి తన మాటలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని భట్టి, పొన్నం చెప్పినా వెనక్కు తీసుకోవడం లేదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. దీనిపై స్పందించిన ఏలేటి.. గాలిలో తిరిగినాడు అని సరి చేసుకోండంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దీనిపై స్పీకర్ కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవాలని సూచించారు. గాలితిరుగుడు తప్పైతే వెనక్కు తీసుకుంటున్నానని ఏలేటి అన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుప్పకూలిపోయేలా ఉందని, చిన్న గాలివీచినా పేకమేడలా కూలిపోతుందని ఏలేటి అన్నారు.
