
వికారాబాద్, వెలుగు: గ్రామాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో రూ.5.61 కోట్ల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శుక్రవారం ఆయన శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.
అలాగే సన్న బియ్యం పంపిణీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో స్పీకర్ మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉన్న సమస్యలను దశల వారీగా పరిష్కరించుకుందామన్నారు. గ్రామస్తుల వినతుల మేరకు కల్వర్టుల నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని చెప్పారు.
తన పర్యటనలో భాగంగా రామాపూర్ అంగన్వాడీ కేంద్రాన్ని స్పీకర్ పరిశీలించారు. గర్భిణీ, బాలింతలు, చిన్నారుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట మార్కెట్ కమిటీ చైర్మన్ మహేందర్ రెడ్డి, పీఎసీఎస్ చైర్మన్ ప్రవీణ్ రెడ్డి ఉన్నారు.