- పార్టీ ఫిరాయింపు నోటీసుపై మంతనాలు
- అఫిడవిట్ దాఖలుకు మరింత గడువు ఇవ్వాలని వినతి
హైదరాబాద్, వెలుగు: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ను శుక్రవారం ఆయన ఇంట్లో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కలిశారు. పార్టీ ఫిరాయింపుల ఆరోపణలను ఎదుర్కొంటున్న కడియంకు గురువారం రెండోసారి స్పీకర్ నోటీసు ఇచ్చారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన అనర్హత పిటిషన్‌పై ఈ నెల 23 లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని ఆ నోటీసులో కడియంను స్పీకర్ ఆదేశించారు. కాగా, అఫిడవిట్ దాఖలు చేసేందుకు తనకు మరింత సమయం ఇవ్వాలని కడియం చేసిన విజ్ఞప్తిపై స్పీకర్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలపై విచారణను నాలుగు వారాల్లోగా ముగించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన గడువును పరిగణనలోకి తీసుకొని సాధ్యమైనంత త్వరగా అఫిడవిట్ దాఖలు చేయాలని కడియంను స్పీకర్ ఆదేశించారు. మొదటి విడతలో ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు పంపగా.. 8 మంది ఎమ్మెల్యేలు అఫిడవిట్ దాఖలు చేశారు. ఆ తర్వాత వారంతా స్పీకర్ ఎదుట విచారణకు కూడా హాజరయ్యారు.
కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రమే మొదటి విడత నోటీసులకు స్పందించలేదు. దీంతో స్పీకర్ ఈ ఇద్దరికీ రెండోసారి నోటీసులు పంపించారు. దీనికి కడియం స్పందించి మరింత గడువు కోరగా.. దానం మాత్రం ఇప్పటి వరకు ఈ నోటీసులపై స్పందించలేదు. ఆయన అఫిడవిట్ దాఖలు చేయకుండా రాజీనామాకే మొగ్గు చూపిస్తున్నట్టు దానం శిబిరంలో జోరుగా ప్రచారం సాగుతోంది.
