- చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఏలూసింగ్
- ఆసిఫాబాద్ జిల్లాలో స్వాధీనం చేసుకున్న పోడు భూముల పరిశీలన
కాగజ్ నగర్, వెలుగు: అడవులు, వన్యప్రాణులను రక్షించేందుకు ఫారెస్ట్ ఆఫీసర్లు, సిబ్బంది ఎక్కడా రాజీ పడొద్దని, నిక్కచ్చిగా పనిచేస్తే భవిష్యత్ తరాలకు మేలు చేసినవారవుతారని చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ ఏలూసింగ్ మేరు సూచించారు.
కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ డివిజన్ పరిధి ఖర్జేలి రేంజ్ దిందా ఫారెస్ట్ లో కబ్జాకు గురైన సుమారు 2 వేల ఎకరాల పోడు భూమి తిరిగి స్వాధీనం చేసుకోగా.. ఆ ప్రాంతాన్ని శుక్రవారం కవ్వాల్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, డీఎఫ్ఓ నీరజ్ కుమార్ టిబ్రేవాల్, ఎఫ్డీఓ సుశాంత్ సుఖ్ దేవ్ బోబడేతో కలిసి ఆయన పరిశీలించారు.
దాదాపు 8 వందల ఎకరాల అటవీ భూమి డీ ఫారెస్ట్ గా మారడంపై జిల్లా అధికారులను సమగ్రంగా అడిగి తెలుసుకుని గూగుల్ ఎర్త్ మ్యాపుల ద్వారా పరిశీలించి అధికారులను అభినందించారు. తెలంగాణ – మహారాష్ట్ర మధ్య ప్రాణహిత నది ఏరియా రి ట్రైవ్ ప్రాసెస్, నీటి గుంటల నిర్మాణం, ట్రెంచ్ లు తవ్వినవాటిని డ్రోన్ తో పరిశీలించారు.
ఉత్సాహంగా పని చేసే అధికారులు, సిబ్బందికి ప్రత్యేక గుర్తింపు ఉంటుందన్నారు. పులుల సంచారానికి కేంద్రమైన కాగజ్ నగర్ అడవుల్లో బయో డైవర్సిటీ ప్రాధాన్యత, రానున్న రోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై జిల్లా అధికారులకు దిశానిర్దేశం చేశారు. ర్యాపిడ్ యాక్షన్ బైక్, ఔట్ పోస్ట్ ను ప్రారంభించారు.
ఎస్ఐ నరేశ్ బందోబస్తు నిర్వహించారు . ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ సుభాష్, ఫీల్డ్ బయాలజిస్ట్ ఎల్లం, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు ముసావీర్, సద్దాం హుస్సేన్, బీట్ ఆఫీసర్ నవ్య శ్రీ, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్ రాజేశ్ కన్ని ఉన్నారు.
