- సింగరేణిలో 62 వేల మంది ఉద్యోగులకు వర్తింపు
- కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ కింద అమలు
- ఈ ఏడాది ప్రమాదంలో మరణించిన 30 మందికి రూ.30 కోట్లు అందజేత
- తాజాగా కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థల్లో అమలుకు పీఎంవో ఆదేశాలు
హైదరాబాద్, వెలుగు : జీరో ప్రీమియంతో కోటి రూపాయల ఇన్సూరెన్స్.. తన సంస్థ పరిధిలో పనిచేసే కార్మికులు, ఉద్యోగుల కోసం సింగరేణి కంపెనీ అమలుచేస్తున్న ఈ స్కీమ్దేశవ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఉద్యోగుల నుంచి రూపాయి తీసుకోకుండా, సంస్థ నుంచి పైసా చెల్లించకుండా 62 వేల మందికి ఈ ప్రమాద బీమాను సింగరేణి సంస్థ అమలుచేస్తోంది.
కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ (సీఎస్‌పీ) ద్వారా ఐదు బ్యాంకులను ఇందుకు ఒప్పించింది. ఈ క్రమంలో ఇప్పటికే ప్రమాదవశాత్తు చనిపోయిన30 మంది సింగరేణి కార్మిక కుటుంబాలకు రూ. కోటి చొప్పున 30 కోట్లు అందాయి. సింగరేణిని చూసి ఈ సీఎస్‌పీ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను ఇప్పటికే కోల్ ఇండియాలో ప్రారంభించగా, కేంద్ర ప్రభుత్వ పరిధిలోని అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ అమలుచేయాలని ప్రధానమంత్రి కార్యాలయం నుంచి ఇటీవల ఆదేశాలు వెళ్లడం విశేషం.
ఎన్నో విశేషాలు..
సింగరేణి సంస్థలో 68 వేల మందికిపైగా ఉద్యోగులు, కార్మికులున్నారు. వీరంతా అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లో భూగర్భ గనులు, ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్‌లలో పనిచేస్తున్నారు. ఈ క్రమంలో జరిగే ప్రమాదాల్లో కార్మికులు మరణించిన ఘటనలు అనేకం ఉన్నాయి. గతంలో గని ప్రమాదాల్లో చనిపోయిన కార్మికులకు సంస్థ తరఫున ఎంతో కొంత ఆర్థికసాయం అందేది. ఇది చాలా తక్కువ మొత్తం కావడంతో యజమానిని కోల్పోయిన కుటుంబాలు ఆర్థికంగా ఛిన్నాభిన్నమయ్యేవి. కానీ సీఎండీ బలరాంనాయక్ప్రత్యేక చొరవతో గతేడాది కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ (సీఎస్‌పీ)లో భాగంగా ఇన్సూరెన్స్ అమలుకు ఐదు బ్యాంకులను ఒప్పించారు.
కార్మికుల శాలరీ అకౌంట్ఏ బ్యాంకులో ఉందో అదే బ్యాంకులో సీఎస్‌పీ కింద.. నామినీకి రూ.కోటి ఇన్సూరెన్స్ డబ్బులు, ఫైనాన్షియల్ బెనిఫిట్స్ అందించేలా ఒప్పందం కుదిర్చారు. ఎవరైనా కార్మికుడు ప్రమాదవశాత్తు మరణిస్తే మధ్యవర్తుల ప్రమేయం లేకుండా అతడి నామినీకి నేరుగా పరిహారం అందుతోంది. సింగరేణి ఉద్యోగులకు సంబంధించి శాలరీ అకౌంట్స్నిర్వహించే ఎస్‌బీఐ, యూనియన్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లు ఈ స్కీమ్‌ను అమలుచేస్తున్నాయి.
సింగరేణి ఎంప్లాయీస్ 60 ఏండ్ల తర్వాత రిటైర్ అయినా కూడా 70 ఏండ్ల వరకు ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ అమలు చేస్తున్నారు. సింగరేణి సంస్థలో మొత్తం 40,566 మంది పర్మినెంట్ ఉద్యోగులు, కార్మికులు ఉండగా వీరిలో 39,755 మందికి, 28,282 మంది కాంట్రాక్ట్ వర్కర్స్ ఉండగా వీరిలో 23,192 మందికి ఈ ఇన్సూరెన్స్ అమలవుతున్నట్లు ఇటీవల ఆ సంస్థ ప్రకటించింది.
అదనపు ప్రయోజనాలు ఇవీ..
ఎస్‌పీ ప్యాకేజీ కింద నమోదైన ఉద్యోగులు, కార్మికులు ప్రమాదవశాత్తు మరణిస్తే రూ.కోటి, ఎయిర్ యాక్సిడెంట్ అయితే రూ.2 కోట్లు, పర్మినెంట్ డిసేబిలిటీకి రూ.కోటి, నార్మల్డెత్ అయితే టర్మ్ పాలసీ కింద రూ. 10 లక్షల చొప్పున అందజేస్తారు. వీటితో పాటు హెల్త్ఇన్సూరెన్స్ లోనూ ప్రీమియం తగ్గిస్తారు. డెబిట్, క్రెడిట్ కార్డ్స్ లిమిట్ పెంచడంతో పాటు కన్సేషనల్ లోన్లు అందిస్తున్నారు.
సంస్థలో పనిచేసే కాంట్రాక్ట్వర్కర్స్ప్రమాదవశాత్తు చనిపోతే వారి శాలరీకి అనుగుణంగా రూ.2 లక్షల నుంచి రూ. 62.5 లక్షలు, ఎయిర్ యాక్సిడెంట్ అయితే రూ.40 లక్షల నుంచి రూ.కోటి, పర్మినెంట్ డిసేబిలిటీకి రూ.50 లక్షల వరకు అందజేస్తున్నారు. ఈ ప్రయోజనాలన్నీ జీరో ప్రీమియంతోనే అమలవుతుండడం విశేషం.
అన్ని శాఖల్లో అమలుకు పీఎం ఆఫీస్ నుంచి ఆదేశాలు
సింగరేణిలో అమలవుతున్న కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ ఇన్సూరెన్స్ పాలసీ దేశానికే ఆదర్శంగా నిలుస్తోంది. ఈ క్రమంలో కోల్ ఇండియా సైతం ఈ ఏడాది నుంచి ఈ పాలసీని అమలుచేయడం ప్రారంభించింది. 2.18 లక్షల మంది ఉద్యోగులు, కార్మికుల్లో 98 శాతం అంటే 2.15 లక్షల మందికి పది జాతీయ బ్యాంకుల ద్వారా ఈ ఇన్సూరెన్స్ అందిస్తోంది.
తాజాగా కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే కార్మికులందరికీ సీఎస్‌పీ కింద జీరో ప్రీమియం ఇన్సూరెన్స్ అమలుచేయాలని ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి అన్ని శాఖలకు ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ విధానం సింగరేణిలో సక్సెస్‌ఫుల్‌గా అమలవుతున్న తీరును ఆ ఉత్తర్వుల్లో ప్రత్యేకంగా పేర్కొనడం గమనార్హం.
