చెరువుల కబ్జాలో సబిత అనుచరులు : జాగృతి అధ్యక్షురాలు కవిత

చెరువుల కబ్జాలో సబిత అనుచరులు : జాగృతి అధ్యక్షురాలు కవిత
  • మహేశ్వరంలో యథేచ్ఛగా ఆక్రమణలు: జాగృతి అధ్యక్షురాలు కవిత
  • హైడ్రా సర్టిఫికేషన్ జారీ చేస్తే ప్రజల్లో అభద్రతా భావం తగ్గుతుందని వ్యాఖ్య
  • రంగారెడ్డి జిల్లాలో జనం బాట

ఎల్బీనగర్/ఇబ్రహీంపట్నం, వెలుగు: రంగారెడ్డి జిల్లాలో 64 చెరువులు ఉంటే.. అందులో సుమారు 10 నుంచి 12 శాతం కబ్జాకు గురయ్యాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో ఈ దందా యథేచ్ఛగా సాగుతోందని.. రావిర్యాల చెరువు, మంత్రాల చెరువును సబితా ఇంద్రారెడ్డి అనుచరులు కబ్జా చేస్తున్నారని ఆమె ఆరోపించారు. జాగృతి జనం బాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఆమె రంగారెడ్డి జిల్లాలో పర్యటించారు.

 ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడులో ఏరోస్పేస్ భూనిర్వాసితులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో జాగృతి కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం ఎల్బీ నగర్ చౌరస్తాలో తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

 ఆ తర్వాత ఓ హోటల్​లో మీడియాతో కవిత మాట్లాడారు. ఎలిమినేడులో ఎరోస్పేస్​ పేరుతో రైతుల నుంచి 540 ఎకరాల భూములు ప్రభుత్వం సేకరించిందని.. కానీ, అక్కడ ఏడెనిమిదేండ్లు గడిచినా ఏ ఒక్క కంపె నీ కూడా రాలేదన్నారు. రైతులకు ఇవ్వాల్సిన నష్టపరిహారం కూడా అందరికీ అందలేదనే ఆరోపణలున్నాయని, వారి తరఫున జాగృతి కొట్లాడుతుందన్నారు. హైడ్రా ముసుగులో పేదవాళ్లని వెల్లగొట్టడమే ప్రభుత్వ పనిగా మారిందని విమర్శించారు. భూముల కొనుగోలు, విక్రయాల కోసం హైడ్రా సర్టిఫికేషన్ జారీ చేస్తే.. భూ వ్యవహారాలపై ప్రజల్లో ఉన్న అనిశ్చితి, అభద్రతా భావం తగ్గుతుందన్నారు.

రంగారెడ్డి పేరుకే పెద్ద జిల్లా అని.. క్షేత్రస్థాయిలో ప్రజలకు సరైన ఫలాలు అందడం లేదని కవిత అన్నారు. ఫ్యాక్టరీల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదని.. దీనిపై జాగృతి కొట్లాడుతుందన్నారు. ఎల్బీనగర్ లో డంపింగ్ యార్డ్ సమస్యను పరిష్కరించాలని, భూదాన్ భూములపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి కాపాడాలన్నారు. ఫార్మాసిటీ నిర్మించకపోతే ఆ భూములను రైతులకు తిరిగి ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. 

ట్రిపుల్​ఆర్ భూ సేకరణలో అక్రమాలు

ట్రిపుల్​ఆర్ భూ సేకరణలో అక్రమాలు జరిగాయని కవిత ఆరోపించారు. రీ సర్వే కోసం బాధిత రైతులతో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలుస్తామన్నారు. అవసరమైతే అలైన్​మెంట్ మార్పుపై కోర్టుకు కూడా వెళ్తామని చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు అభివృద్ధి పేరుతో విధ్వంసానికి పాల్పడ్డాయని ఆమె ఆరోపించారు. తెలంగాణ కొందరిదే అయిందని, తెలంగాణ ప్రజలందరికీ చెందాలన్నారు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌. బీసీలకు చట్టసభల్లో 42 శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

 సీఎం రేవంత్​రెడ్డి సోదరులు, మంత్రి పొంగులేటి, బీఆర్ఎస్ లీడర్లకు సంబంధించిన వేల ఎకరాలు ఆమనగల్​లో ఉండడం వల్లే ట్రిపుల్ ఆర్ అలైన్ మెంట్ మార్చారని ఆరోపించారు. రీజినల్ రింగ్ రోడ్ అన్ని దిక్కులా ఒకే విధమైన పద్ధతి లేదని, చాలా వంకర్లు తిరిగి ఉందన్నారు. ట్రిపుల్ ఆర్ అలైన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కారణంగా తొమ్మిది రేకుల గ్రామంలో సుమారు 200 ఎకరాల భూమి కోల్పోయే పరిస్థితి ఏర్పడుతోందని.. సుమారు 200 మంది చిన్న రైతులు నష్టపోతున్నారని చెప్పారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాల్సిన అవసరం ఉందన్నారు.