- కోదాడ, హుజూర్ నగర్ ఆర్టీసీ బస్టాండ్‌ల ఆధునికీకరణకు ఏర్పాట్లు
- తొలగనున్న ప్రయాణికుల ఇక్కట్లు
సూర్యాపేట, వెలుగు: శిథిలావస్థకు చేరిన కోదాడ, హుజూర్‌నగర్ ఆర్టీసీ బస్టాండ్‌ల రూపురేఖలు మారనున్నాయి. మరో వారం రోజుల్లో కోదాడ బస్టాండ్ ఆధునికీకరణకు శంకుస్థాపనకు ఏర్పాట్లు జరుగుతుండగా హుజూర్‌నగర్ బస్టాండ్ పనులు ప్రారంభించేందుకు కూడా కార్యాచరణ మొదలెట్టారు. ప్రస్తుతం ఉన్న కోదాడ బస్టాండ్ భవనం దాదాపు 40 ఏళ్ల కిందట నిర్మించినది. రద్దీ పెరగడంతో ఐదు ఫ్లాట్‌ఫారాలు సరిపోక బస్సులు బయటే నిలపడం, గ్రామాల బస్సులు చెట్ల కింద ఆగాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. గతంలో ప్రతిపాదనలు పంపినా అమలు కాకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
రూ.16.99 కోట్లు మంజూరు
కోదాడ బస్టాండ్ ఆధునీకరణ కోసం ఇటీవల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మావతి, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించి రూ.16.99 కోట్లు మంజూరు చేయించారు. ఈ నూతన బస్టాండ్‌ను 18 ఫ్లాట్‌ఫారాలుతో నిర్మించనున్నారు. కోదాడ డిపో, బస్టాండ్‌లోని పాత నిర్మాణాలన్ని తొలగించి, ప్రయాణికుల కోసం విశ్రాంతి గదులు, దూర ప్రయాణికులకు ఏసీ గదులు వంటి సౌకర్యాలతో ఆధునిక ప్లాన్‌లు సిద్ధం చేసినట్లు అధికారులు తెలిపారు. సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ నూతన నిర్మాణాలు చేపట్టనున్నారు.
భవిష్యత్ అవసరాలు తీర్చేలా..
హుజూర్‌నగర్ బస్టాండ్ ఆధునీకరణకు కూడా ప్రభుత్వం రూ.3.52 కోట్లు కేటాయించింది. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఆధునిక సౌకర్యాలు అందించేందుకు ప్రణాళికలు సిద్ధమయ్యాయి. సౌకర్యవంతమైన ప్లాట్‌ఫారాలు, షాపింగ్ మాల్స్, వెయిటింగ్ హాల్, డిజిటల్ డిస్‌ప్లే బోర్డులు, ప్రత్యేక కంట్రోల్ రూమ్, పార్కింగ్, ఆధునిక మరుగుదొడ్లు, నిరంతర తాగునీటి సదుపాయాలను ఏర్పాటు చేయనున్నారు. ఈ పనులు కూడా త్వరలో ప్రారంభం కానున్నాయి.
