
- స్థానిక, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42% కోటాకు మార్గం సుగమం
- బీసీ వర్గాలకు చరిత్రాత్మక విజయం: మంత్రి సీతక్క
- కాంగ్రెస్‌లో సామాజిక న్యాయం: మంత్రి శ్రీధర్‌బాబు
- అపశకునం మాటలు మాట్లాడకండి: మంత్రి పొన్నం
- మాకు డెడికేషన్ ఉంది కాబట్టే.. ముందుకెళ్తున్నం: మంత్రి వాకిటి శ్రీహరి
- కేసీఆర్ సభకు రాకుండా ఫామ్‌హౌస్‌లో ఏం చేస్తున్నరు?: ఆది శ్రీనివాస్
- డిక్లరేషన్ ఒక్కటే కాదు.. డెడికేషన్ కూడా ఉండాలి: కేటీఆర్
హైదరాబాద్, వెలుగు:పంచాయతీరాజ్, మున్సిపల్చట్ట సవరణ బిల్లులను అసెంబ్లీ ఆమోదించింది. బీసీ రిజర్వేషన్ల పెంపుకు అడ్డంకిగా మారిన పంచాయతీ రాజ్ చట్టం–2018లోని సెక్షన్ 285(ఏ), మున్సిపల్చట్టం–2019లోని సెక్షన్29కు సవరణ చేస్తూ ప్రభుత్వం రెండు బిల్లులను ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఈ రెండు బిల్లులకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ బిల్లులు పాస్ కావడంతో స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లకు మార్గం సుగమమైంది. గత ప్రభుత్వ నిర్ణయాలు, హైకోర్టు, సుప్రీంకోర్టు తీర్పుల నేపథ్యంలో రాష్ట్రంలో బీసీలకు స్థానిక సంస్థల్లో 23 శాతం రిజర్వేషన్లు అమలవుతూ వస్తున్నాయి. కానీ కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం జనాభా పరంగా బీసీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని కాంగ్రెస్ సర్కార్ నిర్ణయించింది. ఈ క్రమంలో ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ ద్వారా సమగ్ర కుటుంబ సర్వే చేపట్టింది. మేధావుల సూచన మేరకు శాస్త్రీయంగా కులగణన పూర్తి చేసింది. దీనిపై డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు చేయగా.. బీసీల వెనుకబాటుతనం, ప్రాతినిధ్యం ఆధారంగా వాళ్లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని కమిషన్ సిఫార్సు చేసింది.
ఈ క్రమంలో స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రెండు వేర్వేరు బిల్లులను ఉభయ సభల్లో ఆమోదించి గవర్నర్‌కు పంపించింది. కానీ గవర్నర్ ఈ బిల్లులను రాష్ట్రపతికి పంపించడంతో అక్కడ పెండింగ్ పడిన సంగతి తెలిసిందే. ఈలోగా ‘పంచాయతీరాజ్ చట్టం-2018’లోని సెక్షన్ 285 (ఏ)ను సవరిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్‌ను కూడా రాష్ట్రపతి పెండింగ్‌లో పెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడీ చట్ట సవరణ చేసింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు ఆటంకంగా ఉన్న 285 (ఏ)ను సవరిస్తూ పంచాయతీరాజ్‌శాఖ మంత్రి సీతక్క సవరణ బిల్లును ఆదివారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఇటు మున్సిపాలిటీ చట్టం 2019లోని సెక్షన్ 29 స్థానంలో ‘29ఏ’ చేరుస్తూ తెలంగాణ మున్సిపాలిటీస్ యాక్ట్ –2019 మూడో సవరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి తరఫున మంత్రి శ్రీధర్‌బాబు సభలో ప్రవేశపెట్టారు. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లలో బీసీ రిజర్వేషన్లను పెంచేందుకు ఈ బిల్లు తెచ్చారు. ఈ రెండు బిల్లులకు గవర్నర్ ఆమోదం తెలిపితే అందుకు అనుగుణంగా బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసి ఎన్నికలకు వెళ్లే అవకాశముంది.
ఇంద్రేశం, జిన్నారం మున్సిపాల్టీలకు ఆమోదం
సంగారెడ్డి జిల్లాలో ఇంద్రేశం, జిన్నారం మున్సిపాలిటీల ఏర్పాటు, ఇస్నాపూర్ మున్సిపాలిటీ విస్తరణ చేస్తూ మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన బిల్లును సైతం సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
బీసీ కోటాకు అందరూ సహకరించాలి: శ్రీధర్‌బాబు
మున్సిపాలిటీల్లో మేయర్లు, కౌన్సిలర్లు, చైర్మన్లు, జీహెచ్‌ఎంసీలో మేయర్, డిప్యూటీ మేయర్పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా ‘తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019’లో గత ప్రభుత్వం నిబంధన పెట్టిందని శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. కానీ అప్పటికీ ఇప్పటికీ పరిస్థితులు మారాయన్నారు. అందుకు అనుగుణంగా సీపెక్(సోషియో ఎకనామిక్ ఎడ్యుకేషన్ ఎంప్లాయ్మెంట్కాస్ట్) సర్వేని ప్రభుత్వం చేపట్టిందని, దాని ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు చేసిందని తెలిపారు. జనాభా నిష్పత్తికి అనుగుణంగా వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు పెంచేందుకు వీలుగా ఈ చట్టానికి సవరణ చేసి బిల్లును తీసుకొస్తున్నామని చెప్పారు. యావత్‌దేశంలో ఏ ప్రభుత్వమూ తీసుకోని నిర్ణయాన్ని తమ ప్రభుత్వం తీసుకొని సామాజిక న్యాయానికి ప్రయత్నిస్తోందని, ఇందుకు పార్టీలకతీతంగా ప్రతి ఒక్కరూ మద్దతిచ్చి సహకరించాలని కోరారు.
విప్లవాత్మక ముందడుగు: కూనంనేని
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడమనేది విప్లవాత్మకమైన ముందడుగు అని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. బీసీ రిజర్వేషన్లకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు.‘‘సభలో ఎవరు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. బీజేపీ, బీఆర్ఎస్మద్దతు తెలుపుతున్నామని అంటూనే 9వ షెడ్యూల్‌లో చేర్చకపోతే కాదంటున్నారు. 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు అందరూ కలిసి పోరాటం చేద్దామని ఎందుకు అనడం లేదు?’ అని ప్రశ్నించారు. బీసీ బిల్లులకు అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి గవర్నర్‌కు పంపిస్తే, వాటిని పైకి పంపించడం అన్యాయమని అన్నారు.
మాకు డెడ్‌కేషన్ ఉంది: వాకిటి శ్రీహరి
బీసీ రిజర్వేషన్లపై తమకు డెడ్‌కేషన్ ఉంది కాబట్టే.. ముందుకెళ్తున్నామని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ‘‘మా ప్రయత్నానికి నిండు మనసుతో సహకరించాలి. సూచనలు, సలహాలు ఇవ్వాలి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసి ఎన్నికలకు వెళ్లాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నాం’’ అని చెప్పారు. బీసీ రిజర్వేషన్ల అమలుకు బీజేపీ, బీఆర్ఎస్ సహకరించాలని కోరారు.
కోర్టులపై మాకు గౌరవం ఉంది: పొన్నం ప్రభాకర్
తమకు న్యాయస్థానాలపై గౌరవం ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కేటీఆర్ వ్యాఖ్యలు కోర్టుకు వెళ్లేవారిని ప్రోత్సహించేలా ఉన్నాయని అన్నారు. ‘‘తమిళనాడు కేసు విషయంలో గవర్నర్ దగ్గర పెండింగ్ పడిన బిల్లులపై కోర్టు జోక్యం చేసుకున్నది. గడువు పూర్తయితే ఆ బిల్లులు ఆమోదం పొందినట్లే అని తెలిపింది. అసెంబ్లీలో జరుగుతున్న చర్చను ప్రజలు గమనిస్తున్నారు. నాయకులు అపశకునం పలకవద్దు’’ అని సూచించారు.
రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన మీరా మాట్లాడేది: ఆది శ్రీనివాస్
బీఆర్ఎస్ పార్టీ తెలంగాణతో పేగు బంధం తెంచుకున్నదని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తున్నామంటూ బిహార్‌లో ప్రకటనలు ఇచ్చారని, తెలంగాణ డబ్బు అక్కడ ఖర్చు పెడుతున్నారని కేటీఆర్ చేసిన ఆరోపణలకు ఆయన గట్టి కౌంటర్ఇచ్చారు. ‘‘బీఆర్ఎస్హయాంలో మహారాష్ట్రలో వందల కోట్లు పెట్టి సభలు పెట్టారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు. ఆనాడు రాష్ట్ర సంపదను లూటీ చేశారు. ఇవాళ సీఎం, డిప్యూటీ సీఎం బిహార్వెళ్తే తప్పేంటి? ప్రతిపక్ష నేత సభకు రాకుండా ఫామ్‌హౌస్‌లో ఏం చేస్తున్నారు?” అని ప్రశ్నించారు.
సీఎంపై కేటీఆర్ కామెంట్స్రికార్డుల నుంచి తొలగింపు..
పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లుకు సంబంధించి సభలో చర్చ జరుగుతున్న సమయంలో సీఎం రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే కేటీఆర్చేసిన కామెంట్స్‌కు సభ్యులు అభ్యంతరం చెప్పారు. దీంతో స్పీకర్ గడ్డం ప్రసాద్ ఆ కామెంట్స్‌ను రికార్డుల నుంచి తొలగిస్తు న్నట్లు ప్రకటించారు. అలాగే, బీజేపీ, సీపీఐ కోరిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ కొట్టేశారు.
అడ్డంకులు తొలగినయ్: సీతక్క
పంచాయతీరాజ్చట్టంలోని సెక్షన్ 285(ఏ)కు చేసిన సవరణ ద్వారా బీసీ రిజర్వేషన్ల పెంపునకు అడ్డంకులు తొలగాయని, ఇది బీసీ వర్గాలకు చరిత్రాత్మక విజయమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. ఆర్థిక అసమానతలు తొలగాలంటే ఉపాధి అవకాశాలు ఉండాలని, చిత్తశుద్ధి ఉండటం వల్లే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై బిల్లు తెచ్చామన్నారు. ‘‘2018లో పంచాయతీరాజ్చట్టంలో 50 శాతం రిజర్వేషన్లపై సీలింగ్ పెట్టారు. ఏ రాష్ట్రంలో రిజర్వేషన్లపై సీలింగ్ విధిస్తూ చట్టాలు లేవు. తెలంగాణలోని సీలింగ్‌ను సవరించేందుకు తాజాగా సవరణ బిల్లు ప్రవేశపెట్టాం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచేలా చర్యలు చేపడ్తున్నాం. అందుకే బీసీ రిజర్వేషన్ల పెంపుకు అవరోధంగా ఉన్న 285 (ఏ)ను సవరించేందుకు 2018 పంచాయతీరాజ్ సవరణ చట్టాన్ని ప్రతిపాదిస్తున్నాం” అని తెలిపారు.
‘‘గత బీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లను 50 శాతానికి కుదిస్తూ 2018 పంచాయతీరాజ్ చట్టం తెచ్చింది. బీసీ రిజర్వేషన్లను సీఎం రేవంత్ రెడ్డి బంధువు అడ్డుకున్నట్లు కేటీఆర్తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎవరో కోర్టుకెళ్తే సీఎంకు అంటగట్టడం ఏంటి?’’ అని ప్రశ్నించారు. ‘‘బీసీ రిజర్వేషన్లను కుదించింది బీఆర్ఎస్. ముస్లింలకు 12% రిజర్వేషన్ల కోసం అసెంబ్లీలో బీఆర్ఎస్ తీర్మానం చేసింది. మరి సాధించారా? బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. తమిళనాడులో ఎన్నో పోరాటాలు చేస్తే బీసీ రిజర్వేషన్ల పెంపునకు పదేండ్లు పట్టింది. 24 జనవరి 1980లో బీసీ రిజర్వేషన్లను 31శాతం నుంచి 50 శాతానికి పెంచుతూ అప్పటి సీఎం ఎంజీ రామచంద్రన్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అది అమలు కావడానికి పదేండ్లు పట్టింది’’ అని గుర్తుచేశారు. విపక్ష ఎమ్మెల్యేలంతా బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని మంత్రి సీతక్క కోరారు.
బీసీ ధర్నాకు రాహుల్ ఎందుకు రాలేదు: కేటీఆర్
‘‘ఢిల్లీలో చేసిన బీసీ ధర్నాకు మేం రాలేదు ఓకే. మరి రాహుల్, ఖర్గే ఎందుకు రాలేదు. ఇది డ్రామా అని వారు కూడా అనుకున్నారా? డిక్లరేషన్లు ఒక్కటే కాదు.. డెడికేషన్ కూడా కావాలి” అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. ‘‘మీరు కన్ఫ్యూజ్ అయి అందర్నీ కన్ఫ్యూజ్ చేయొద్దు. ప్రజలను గందరగోళానికి గురిచేయొద్దు. ప్రధాని అపాయింట్‌మెంట్ ఎమ్మెల్యే ఇప్పిస్తాడా? సీఎం కార్యాలయం అపాయింట్‌మెంట్ అడగాలి. ఈ సమస్య తేలాలి అంటే రెండు మార్గాలు ఉన్నాయి. ప్రధాని వద్దకు అఖిల పక్షాన్ని తీసుకెళ్లండి. మేం కూడా వస్తాం. రెండోది డెడికేషన్ ఉండాలి. సీఎంకు చిత్తశుద్ధి ఉంటే బీసీ బిల్లు సాధించే వరకు ఢిల్లీ నుంచి తిరిగి రాను అని చెప్పి జంతర్ మంతర్‌లో ఆమరణ దీక్ష చేయమనండి.. మేం వద్దంటున్నామా’’ అని అన్నారు. మార్చిలో బిల్లు పాస్ చేసిన దానికి, ఇప్పుడు తెస్తున్న బిల్లుకు తేడా ఏంటని, ఆర్డినెన్స్ మీద సంతకం చేయని గవర్నర్.. ఈ బిల్లుపై ఎలా సంతకం చేస్తారో ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. ‘‘చట్టాల్లో లొసుగులు ఉంటేనే కోర్టుకెళ్తారు. కోర్టుకెళ్లొద్దు అనడం సరికాదు. ప్రభుత్వాలు చట్టాలకు తూట్లు పొడిస్తే, లోబడి పని చేయకపోతే జ్యుడీషియల్ రివ్యూ ఉంటుంది” అని కేటీఆర్ సూచించారు. కాగా, కేటీఆర్ కామెంట్స్‌పై మంత్రి శ్రీధర్‌బాబు స్పందిస్తూ.. ‘‘చట్టసవరణ బిల్లులను ఆటంకాలు లేకుండా పాస్ చేసేందుకు సభ్యులందరూ సహకరించాలి. సెషన్స్ లేనప్పుడు ఆర్డినెన్స్ తీసుకొస్తారు. అసెంబ్లీ నడుస్తున్నప్పడు బిల్లు పెడుతారు. గవర్నర్ మనసు మారుతుందని బిల్లు మళ్లీ పంపిస్తున్నాం. గవర్నర్, రాష్ట్రపతి వద్ద బిల్లుల పెండింగ్‌కు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్నది. బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉండాలి. రిజర్వేషన్లతోనే సరిపెట్టం. బీసీ సబ్‌ప్లాన్ కూడా పెడతాం’’ అని చెప్పారు.