రిజిస్ట్రేషన్లు నిల్.. ఆదాయం నిల్..

రిజిస్ట్రేషన్లు నిల్.. ఆదాయం నిల్..
  • ఈ నెలకు ఇంతే! మేలో రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.200 కోట్లే
  • లాక్డౌన్ తో రిజిస్ట్రేషన్లన్నీ బంద్
  • ఏప్రిల్ లో రూ. 580 కోట్ల ఇన్ కం

హైదరాబాద్, వెలుగు: కరోనా ఫస్ట్ వేవ్ ముగిశాక ఈ ఏడాది ప్రారంభం నుంచే జోరందుకున్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికి సెకండ్ వేవ్ బ్రేకులు వేసింది. కరోనాతో బయటకు వెళ్లేందుకే భయపడుతున్న జనం.. భూముల అమ్మకాలు, కొనుగోళ్లను వాయిదా వేసుకుంటున్నారు. డబ్బులు తప్పనిసరి అయితే తప్పా, తమ ఆస్తుల అమ్మకానికి ఆసక్తి చూపడం లేదు. దీంతో సాధారణ రోజులతో పోలిస్తే ఏప్రిల్​లో రిజిస్ట్రేషన్లు గణనీయంగా తగ్గాయి. మే మొదటి వారంలో సగం రిజిస్ట్రేషన్లు మాత్రమే అయ్యాయి. ఇక రాష్ట్ర సర్కార్ లాక్ డౌన్ విధించడంతో ఈ నెల 12 నుంచి రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. 

11 రోజుల్లో రూ.120 కోట్లు.. 
ఏప్రిల్​లో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ద్వారా రూ.580 కోట్ల ఆదాయం సమకూరింది. ఆ నెలలో రోజుకు సుమారు 4,500కు పైగా డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా, రూ.20 కోట్ల నుంచి 25 కోట్ల ఆదాయం వచ్చింది. సెకండ్ వేవ్ ఉధృతి పెరిగాక మే మొదటి వారంలో రిజిస్ట్రేషన్లు సగానికి తగ్గాయి. రోజుకు 2,500 నుంచి 3 వేలలోపే డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా.. రోజు ఆదాయం రూ.12 కోట్లకు మించలేదు. ఈ నెల 1 నుంచి లాక్ డౌన్ ప్రకటించిన నాటికి 11 రోజుల్లో రాష్ట్రంలో 26,574 డాక్యుమెంట్లు రిజిస్టర్ కాగా.. రూ.120 కోట్ల ఆదాయం వచ్చింది. 

కొత్త ప్రాజెక్టులు ప్రారంభించట్లే.. 
కరోనా సెకండ్వే వ్, లాక్​డౌన్ ఎఫెక్ట్​తో రియల్ ఎస్టేట్ వ్యాపారం కుదేలైంది. లాక్​డౌన్ భయానికి వలస కూలీలు చాలా మంది మళ్లీ సొంతూళ్లకు పోవడంతో భారీ భవనాల నిర్మాణాలు నిలిచిపోయాయి. గత అనుభవాల నేపథ్యంలో కొందరు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు మాత్రం కూలీలకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పనులు చేయిస్తున్నారు. ఫస్ట్ వేవ్ తగ్గాక గత మూడు, నాలుగు నెలల కాలంలో అనేక కొత్త ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. కానీ సెకండ్ వేవ్ తర్వాత ఇప్పుడు కొత్తగా ప్రారంభించే సాహసం మాత్రం ఎవరూ చేయడం లేదు. ఉన్న వాటినే పూర్తి చేస్తూ అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నారు.

తగ్గిన అగ్రి రిజిస్ట్రేషన్లు 
ధరణి ద్వారా వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు కూడా భారీగా తగ్గాయి. గత నెల ఏప్రిల్ 1 నుంచి 10 వరకు 19,477 రిజిస్ట్రేషన్లు జరగ్గా, సరిగ్గా నెల తర్వాత మే 1 నుంచి 10 వరకు 13,311 రిజిస్ట్రేషన్లు మాత్రమే అయ్యాయి. ఈ నెలలో ధరణి ద్వారా మొత్తం 14,766 అగ్రికల్చర్ రిజిస్ట్రేషన్లు కాగా సుమారు రూ.80 కోట్ల ఆదాయం వచ్చినట్లు తెలిసింది. మొత్తంగా రిజిస్ట్రేషన్ల ద్వారా ఆదాయం ఈ నెలలో రూ.200 కోట్లు దాటలేదు.