మనీలాండరింగ్ కేసులో తక్షీల్​ సొల్యూషన్స్ ఆస్తుల జప్తు

మనీలాండరింగ్ కేసులో తక్షీల్​ సొల్యూషన్స్ ఆస్తుల జప్తు
  • రూ.12 కోట్ల 11 లక్షల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ అధికారులు

హైదరాబాద్, వెలుగు :  ఐపీవో (ఇన్షియల్‌‌ పబ్లిక్‌‌ ఆఫర్‌‌)ల పేరిట మనీలాండరింగ్‌‌కు పాల్పడిన తక్షీల్‌‌ సొల్యూషన్స్‌‌ లిమిటెడ్‌‌ కంపెనీ కేసులో ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో కీలకంగా ఉన్న నిర్మల కొటేచ, పవన్‌‌ కుచన, కిశోర్‌‌ తపాడియాకు చెందిన రూ.12 కోట్ల 11లక్షల విలువైన  స్థిర, చర ఆస్తులను ఈడీ అధికారులు సోమవారం జప్తు చేశారు. ఈ మేరకు ఈడీ అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు.

తక్షీల్‌‌ సొల్యూషన్స్‌‌ లిమిటెడ్‌‌ కంపెనీ ప్రమోటర్లు, డైరెక్టర్లు, ఇతరులు కలిసి ఐపీవోల పేరుతో మోసాలకు పాల్పడినట్లు సెబీ(సెక్యూరిటీస్‌‌ అండ్‌‌ ఎక్స్ చేంజ్ బోర్డ్‌‌ ఆఫ్‌‌ ఇండియా) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. పవన్‌‌ కుచన, నిర్మల కొటేచ, కిశోర్‌‌ తపాడియా ముందస్తు ప్లాన్ ప్రకారం ఐపీవో జారీ చేయడం కోసం తక్షీల్‌‌ సొల్యూషన్స్‌‌ లిమిటెడ్‌‌ ఆదాయాన్ని పెంచి చూపి, ఆ తర్వాత ఐపీవో ద్వారా వచ్చిన రూ.80 కోట్ల 50 లక్షల  ఆదాయాన్ని పలు విదేశీల కంపెనీల్లోకి అక్రమంగా మళ్లించినట్లు ఈడీ అధికారులు తమ దర్యాప్తులో గుర్తించారు. అమెరికా, సింగపూర్‌‌, హాంకాంగ్‌‌ తదితర దేశాల్లోని తమ సంస్థల్లోకి రూ.కోట్ల సొమ్మును నిందితులు మళ్లించినట్లు ఈడీ అధికారులు గుర్తించారు.

మనీలాండరింగ్‌‌కు సంబంధించి కీలక ఆధారాలు లభించడంతో నిందితులు నిర్మల్ కొటేచ , పవన్ కుమార్ కుచన, కిషోర్ తపాడియాను ఈడీ గతంలోనే అరెస్టు చేసింది. వీరిలో నిర్మల్‌‌ కొటేచ, కిశోర్ తపాడియాకు రాష్ట్ర హైకోర్టు ఈ నెల 6న బెయిల్ మంజూరు చేయగా,  పవన్‌‌ కుచన ఇప్పటికీ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్టు ఈడీ అధికారులు పేర్కొన్నారు. తాజాగా రూ.12 కోట్ల11లక్షల ఆస్తులను అటాచ్‌‌ చేసినట్లు వారు తెలిపారు.