
భారత ఆటో మార్కెట్లో ఎస్ యూవీలకు ఉన్న డిమాండ్ గురించి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో బిల్డ్ క్వాలిటీ విషయంలో మంచి పేరున్న టాటా కార్లకు డిమాండ్ ఎక్కువే. ఈ క్రమంలోనే టాటా మోటార్స్ కి చెందిన టాటా పంచ్ సరికొత్త అమ్మకాల మైలురాయికి చేరుకుంది.
కేవలం నాలుగేళ్ల కాలంలోనే టాటా పంచ్ 6 లక్షల యూనిట్ల అమ్మకపు మైలురాయిని అధిగమించినట్లు టాటా మోటార్స్ ప్రకటించింది. కంపెనీ మెుదటగా ఈ మోడల్ ను అక్టోబర్ 2021లో ప్రారంభించిన సంగతి తెలిసిందే. సబ్ కంప్యాక్ట్ ఎస్ యూవీ వేగవంతమైన అమ్మకాలతో దేశంలో వినియోగదారుల మనసులు గెలుచుకున్నట్లు అమ్మకాలు చెబుతున్నాయి.
ALSO READ : ముఖేష్- ఇషా అంబానీల కొత్త ఆట..
మెుత్తం టాటా మోటార్స్ వాహన అమ్మకాల్లో టాటా పంచ్ వాటా ఏకంగా 38 శాతం ఉండటం దీనికి ఉన్న ఆదరణను సూచిస్తోంది. ప్రస్తుతం ఈ కారు పెట్రోల్, సీఎన్జీ, ఎలక్ట్రిక్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అలాగే కారు సేఫ్టీ విషయంలో 5 స్టార్ రేటింగ్ సాధించటం భద్రతకు భరోసా ఇస్తోంది.
మెుదటి సారి కారు కొంటున్న భారతీయుల్లో ఎక్కువ మంది టాటా పంచ్ ఎంపిక చేసుకుంటున్నట్లు కంపెనీ వెల్లడించింది. దీంతో చిన్న పట్టణాలు, టౌన్ల నుంచి కంపెనీకి డిమాండ్ ఎక్కువగా ఉంటున్నట్లు వెల్లడైంది. పైగా ఈ మోడల్ బేస్ వేరియంట్ ధర రూ.6.20 లక్షల నుంచి ప్రారంభం అవగా అత్యధికంగా రూ.13 లక్షల వరకు ఉంది.