- కరీంనగర్ లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ పై సస్పెన్షన్ వేటు
కరీంనగర్, వెలుగు: తన కింది స్థాయి ఉద్యోగి విద్యార్హత వివరాలను సర్వీస్ బుక్ లో ఎంట్రీ చేసేందుకు రూ.లక్ష డిమాండ్ చేసిన కరీంనగర్ లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కంట్రోలర్ విజయసారథిపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. బాధితుడి నుంచి లంచం డబ్బులు తీసుకోబోయి ఏసీబీ ట్రాప్ మిస్ అయిన సదరు ఆఫీసర్ వ్యవహారంపై బాధితుడు సివిల్ సప్లై డిపార్ట్ మెంట్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు ఫిర్యాదు చేశారు.
శాఖాపరమైన ఎంక్వైరీలో నిజమేనని తేలడంతో చర్యలు తీసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా తూనికలు, కొలతల శాఖలో టెక్నికల్ అసిస్టెంట్ గా పని చేస్తున్న లక్కడి నవీన్ కుమార్ ఐటీ పరిధిలోకి రానప్పటికీ, ఐటీ రిటర్న్స్ ఫైల్ చేయలేదని 2020లో కరోనా సమయంలో డ్రాయింగ్ ఆఫీసర్ గా ఉన్న విజయసారథి 8 నెలల సాలరీ నిలిపేశాడు.
నవీన్ 2023లో ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ద్వారా డిగ్రీ పాసై పట్టా సమర్పించగా.. ఆ వివరాలు ఎంట్రీ చేసేందుకు 2025 మార్చిలో వాట్సాప్ కాల్ చేసి రూ.లక్ష డిమాండ్ చేశాడు. అలాగే రెండేళ్లుగా వార్షిక ఇంక్రిమెంట్లు ఆపారు. ఈ వేధింపులు భరించలేక జూన్, జులై నెలల్లో ఏసీబీ ఆఫీసర్లను ఆశ్రయించాడు. డబ్బులు తీసుకునేందుకు కరీంనగర్ బస్టాండ్ కు రమ్మని చెప్పగా, అక్కడికి వచ్చిన తరువాత అప్రమత్తమై చివరి నిమిషంలో డబ్బులు తీసుకోలేదు.
ఈ క్రమంలోనే బాధితుడు తన దగ్గర ఉన్న ఆధారాలతో డిసెంబర్ 19న సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్రకు ఫిర్యాదు చేశాడు. ఎంక్వైరీలో విజయసారథి అవినీతి వ్యవహారం నిగ్గుతేలడంతో సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సదరు ఆఫీసర్ 2009లో రంగారెడ్డి జిల్లా తూనికలు, కొలతల శాఖ ఇన్ స్పెక్టర్ గా పని చేస్తున్న క్రమంలో ఏసీబీ ట్రాప్ అయ్యాడు.
