నల్గొండ, వెలుగు: ఉమ్మడి నల్గొండ జిల్లాలో కొందరు వ్యక్తులు తాము ఫుడ్ ఇన్‌స్పెక్టర్, ఫుడ్ సేఫ్టీ అథారిటీ అధికారులం అని చెప్పుకుంటూ వ్యాపారులను బెదిరిస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. శ్రీకాంత్ రెడ్డి, విక్రమ్ నాయుడు, శ్రీనివాస్ నాయక్ అనే పేర్లతో నకిలీ వ్యక్తులు 8074735461, 7386160150, 8886397761 నంబర్ల ద్వారా ఫోన్ చేసి లేదా ప్రత్యక్షంగా వెళ్లి మోసాలకు పాల్పడుతున్నట్లు ఫుడ్ సేఫ్టీ విభాగం గుర్తించింది. కిరాణా షాపులు, హోటళ్లు, రెస్టారెంట్లు, బేకరీలు, మీట్ షాపులు వ్యాపార సంస్థలను లక్ష్యంగా చేసుకుని బెదిరింపులు చేస్తున్నారని తెలిపింది. మిర్యాలగూడ, నల్గొండ, హాలియా, సూర్యాపేట, కోదాడ, చౌటుప్పల్ ప్రాంతాల్లో షాప్ సీజ్, లైసెన్స్ రద్దు, కేసులు అంటూ భయపెడుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయి.
ఇవన్నీ పూర్తిగా చట్ట విరుద్ధమని ఫుడ్ సేఫ్టీ అధికారులు స్పష్టం చేశారు. అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ జ్యోతిర్మయి మాట్లాడుతూ.. అధికారిక తనిఖీలు ఎప్పుడూ ప్రభుత్వ గుర్తింపు కార్డుతో, రాతపూర్వక నోటీసులతో మాత్రమే జరుగుతాయని తెలిపారు. అనుమానాస్పద కాల్స్ లేదా వ్యక్తులకు స్పందించవద్దని, వెంటనే ఫుడ్ సేఫ్టీ కార్యాలయానికి పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నకిలీ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజల ఆరోగ్యం వ్యాపారుల హక్కుల రక్షణే తమ లక్ష్యమని ఆమె అన్నారు.
