- ఎంఎంపీ అగ్రిమెంట్లో మాకిచ్చిన హామీలు అమలు చేయాలె
- యూకేకు ఇండియన్ హైకమిషన్ కౌంటర్
- ‘వీసా’ కామెంట్లను తిప్పికొట్టిన ఇండియా
లండన్: మైగ్రేషన్ అండ్ మొబిలిటీ పార్టనర్షిప్ (ఎంఎంపీ) అగ్రిమెంట్ సరిగ్గా అమలు కావడం లేదని, వీసా గడువు ముగిసినా యూకేలో ఉంటున్నోళ్లలో ఎక్కువమంది ఇండియన్లేనంటూ ఆ దేశ హోంశాఖ కార్యదర్శి సువెల్లా బ్రేవర్మన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్‌పై స్పందిస్తూ.. యూకేలోని భారత హైకమిషన్ గట్టి కౌంటర్ ఇచ్చింది. నిరుడు లండన్ గవర్నమెంట్‌తో చేసుకున్న ఎంఎంపీ ఒప్పందంలో భాగంగా, అన్ని అంశాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టంచేసింది. లండన్ ప్రభుత్వం నుంచే స్పందనలేదని తేల్చి చెప్పింది. వీసా గడువు ముగిసి యూకేలో ఉంటున్న ఇండియన్ సిటిజన్స్‌ను తిరిగి స్వదేశానికి పంపించే విషయమై, కలిసి పనిచేసేందుకు రెడీగా ఉన్నామని తెలిపింది.
హోంశాఖ ఇచ్చిన నివేదిక ప్రకారం అన్ని అంశాలపై చర్యలు ప్రారంభించినట్టు చెప్పింది. మైగ్రేషన్ అండ్ మొబిలిటీ ప్రొటోకాల్ అగ్రిమెంట్లో భాగంగా ఇండియాకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు యూకే గవర్నమెంట్ చర్యలు తీసుకుంటున్నదని, అయితే అందులో పురోగతి కోసం ఎదురుచూస్తున్నామని తెలిపింది. ఇండియాతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్(ఎఫ్‌టీఏ) కూడా ఆందోళనకరంగా ఉందంటూ సువెల్లా కామెంట్ చేశారు. దీనిపై కూడా భారత్ హైకమిషన్ స్పందించింది. ఎంఎంపీ అగ్రిమెంట్‌పై చర్చలు కొనసాగుతున్నాయని, అలాంటప్పుడు ఎఫ్‌టీఏ గురించి మాట్లాడటం సరికాదని జవాబిచ్చింది. ఎఫ్‌టీఏ అగ్రిమెంట్ రెండు దేశాలకు ప్రయోజనకరంగానే ఉంటుందని ఇండియన్ హైకమిషన్ భరోసా ఇచ్చింది.
