
న్యూఢిల్లీ: ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లా శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)కు వెళ్లిన తొలి భారతీయ వ్యోమగామిగా శుక్లా రికార్డ్సృష్టించిన విషయం తెలిసిందే. శుక్లా.. మరో ముగ్గురు వ్యోమగాములతో కలిసి ఆక్సియం మిషన్ 4లో భాగంగా 20 రోజుల అంతరిక్ష పర్యటన చేసి గత నెలలో భూమికి తిరిగి వచ్చారు.
]ఈ మేరకు శుక్రవారం గ్రూప్ కెప్టెన్లు ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్, పుణ్యశ్లోక్ బిస్వాల్ తో పాటు ఇస్రో చైర్మన్, డిపార్ట్‌మెంట్‌ఆఫ్ స్పేస్ సెక్రటరీ వీ నారాయణన్, హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్ డైరెక్టర్ దినేశ్ కుమార్ సింగ్‌తో కలిసి రాష్ట్రపతి ముర్మును కలిశారు. ఈ సందర్భంగా అంతరిక్షంలో తన అనుభవాలను రాష్ట్రపతితో శుక్లా పంచుకున్నారని రాష్ట్రపతి కార్యాలయం ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అలాగే, భవిష్యత్ ప్రయత్నాల కోసం, ముఖ్యంగా గగన్‌యాన్ మిషన్ కోసం మొత్తం బృందానికి రాష్ట్రపతి తన శుభాకాంక్షలు తెలిపారని ప్రెసిడెంట్ ఆఫీస్ పోస్ట్‌లో పేర్కొంది.