
- తస్మాత్ జాగ్రత్త: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
- అశ్వారావుపేటలో ఆరు విద్యుత్ సబ్ స్టేషన్లకు శంకుస్థాపన
- అశ్వారావుపేటను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం: మంత్రి పొంగులేటి
అశ్వారావుపేట, వెలుగు: దోరల పాలన కోసం దోపిడీదారులు ఏకమవుతున్నారు.. తస్మాత్ జాగ్రత్త అని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అశ్వారావుపేట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ ప్రాంతంలో రూ.39 కోట్లతో ఆరు విద్యుత్‌సబ్ స్టేషన్లకు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే జారే ఆదినారాయణతో కలిసి శనివారం ఆయన భూమి పూజ చేశారు.
అనంతరం సభలో మాట్లాడుతూ.. మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధి ధ్యేయంగా దమ్మపేట మండలం పార్కల గండిలో రూ.2.24 కోట్లు, అశ్వారావుపేట మండలం అచ్యుతాపురంలో రూ.3.10 కోట్లు, తిరుమల కుంటలో రూ.3.15 కోట్లు, కావడీ గుండ్లలో రూ.2.24 కోట్లు, అశ్వారావుపేట పట్టణంలో రూ 2.53 కోట్లతో 33/11 కె.వి సబ్ స్టేషన్ లు నిర్మిస్తున్నామన్నారు. గిరిజన ప్రాంతమైన అశ్వారావుపేట నియోజకవర్గంలో కరెంట్‌సమస్య లేకుండా చూస్తున్నామన్నారు. రెవెన్యూ మంత్రి పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. అశ్వారావుపేట కొన్ని దశాబ్దాలుగా వెనుకబడి ఉందని, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నాణ్యమైన కరెంట్‌ను ఇచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తొందన్నారు.
గత ప్రభుత్వం చేసింది గోరంత చెప్పింది కొండంత, మనం కొండంత చేసి గోరంత చెప్పుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు, వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, గృహ నిర్మాణ శాఖ రాష్ట్ర చైర్మన్ మువ్వ విజయబాబు, ట్రాన్స్‌కో సీఎండీ వరుణ్ రెడ్డి, కలెక్టర్ జితేశ్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్, ఐటీడీఏ పీఓ రాహుల్, నాయకులు జూపల్లి రమేశ్, తుమ్మ రాంబాబు, చిన్నంశెట్టి సత్యనారాయణ, హరిబాబు, ఆకుల శ్రీను, తదితరులు పాల్గొన్నారు. అనంతరం నియోజకవర్గ అభివృద్దిపై కలెక్టర్, ఎస్పీ, ఐటీడీఏ పీఓతో పాటు జిల్లా అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. నియోజకవర్గ అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై ఆఫీసర్లతో చర్చించారు.