అశ్విన్ అద్భుత సెంచరీ.. పట్టుబిగించిన టీమిండియా

అశ్విన్ అద్భుత సెంచరీ.. పట్టుబిగించిన టీమిండియా

చెన్నై: ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా పట్టుబిగించింది. సోమవారం 54/1తో రెండో ఇన్నింగ్స్‌‌ను ప్రారంభించిన భారత జట్టు 286 రన్స్‌కు ఆలౌట్ అయ్యింది. స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ (106) సెంచరీతో చెలరేగగా.. కెప్టెన్ కోహ్లి (62) బాధ్యతాయుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. సోమవారం తొలి సెషన్‌‌లో స్పిన్నర్లు మొయిన్ అలీ, జాక్ లీచ్ దెబ్బకు భారత్ టాపార్టర్ వికెట్లను త్వరగా కోల్పోయింది. దీంతో జట్టు కష్టాల్లో పడింది. అయితే కోహ్లి ఓ ఎండ్‌‌లో రన్స్ చేస్తూ నిలకడ ప్రదర్శించాడు. కానీ బాల్ బాగా స్పిన్ అవుతుండటంతో మిగిలిన ఎండ్‌‌లో బ్యాట్స్‌‌మెన్ ఒక్కొక్కరుగా పెవిలియన్ చేరారు. అయితే అశ్విన్ వచ్చీరాగానే బౌండరీలతో అలరించాడు.

కోహ్లితో జతకలసి అశ్విన్ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. సొంత గ్రౌండ్‌‌‌లో స్పిన్ పిచ్ పై స్వీప్ షాట్లతో ఇంగ్లండ్ బౌలర్లను భయపెట్టాడు. అయితే స్వల్ప వ్యవధిలో కోహ్లి, కుల్దీప్, ఇషాంత్ వెనుదిరగడంతో అశ్విన్ సెంచరీ పూర్తవుతుందా లేదోననే సందేహం ఏర్పడింది. కానీ హైదరాబాదీ స్పీడ్‌‌స్టర్ సిరాజ్ అండగా నిలవడంతో వరుస బంతుల్లో సిక్స్, ఫోర్ కొట్టిన అశ్విన్.. శతకం పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే పేసర్ స్టోన్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కలుపుకొని భారత్ లీడ్ 482కు చేరింది. సుడులు తిరుగుతున్న ట్రాక్‌‌పై అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్  లాంటి బౌలర్‌ను ఎదుర్కొని ఇంగ్లండ్ జట్టు రెండ్రోజులపాటు బ్యాటింగ్ చేయడం కష్టమే. నాలుగోరోజే భారత్ గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంగ్లండ్ బ్యాట్స్‌‌మెన్ చూపించే తెగువ మీదే మ్యాచ్  ఐదో రోజుకు వెళ్తుందా లేదా ఆధారపడి ఉంది.