- ఎంబీఏ చదివి సక్సెస్ఫుల్ వ్యాపారిగా ఎదిగిన యువతి
- 25 ఏళ్లకే ఆత్మసంతృప్తి కోసం సాధ్విగా మారేందుకు అడుగులు
- జైన్ భగవతి దీక్షకు సిద్ధం
సైఫాబాద్, వెలుగు : ఉన్నత చదువులు చదివింది..వ్యాపార రంగంలో విజయవంతంగా రాణించింది..రూ. కోట్ల ఆస్తులున్నా ఆత్మసంతృప్తి లేదని ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకుంది ఓ యువతి. మోడ్రన్లైఫ్, విలాసవంతమైన జీవితాన్ని వద్దనుకుని కేవలం 25 ఏండ్ల వయసులోనే సన్యాస జీవితాన్ని స్వీకరించేందుకు సిద్ధమైంది. బుధవారం లక్డీకాపూల్‌లోని ఎఫ్టీసీసీ భవన్లో ఆమెతో పాటు తల్లిదండ్రులు, వర్ధమాన్ స్థానకవాసి జైన్ శ్రావక్ సంఘ్ ప్రతినిధులు వివరాలను వెల్లడించారు.
మహారాష్ట్రకు చెందిన సంజనా జీ లూనావత్ జైన మతంలో పుట్టారు. ఆమె తండ్రి కవర్లాల్ ఆటోమొబైల్ వ్యాపారంలో ఉండగా, ఆమె సోదరుడు శుభం కూడా సొంత వ్యాపారం నిర్వహిస్తున్నారు..ఇక సంజనా ముంబైలో ఎంబీఏ పూర్తి చేశారు. ఆమె కూడా వ్యాపార రంగంలోనూ విజయవంతంగా రాణించారు. ఫ్యాషన్ డిజైనర్‌గా, బోటిక్ యజమానిగా తన కెరీర్ నిర్మించుకుని విజయవంతమైన వ్యాపారిగా మారారు.
అయినా, ఆత్మసంతృప్తి లేదని భావించి జైన్ భగవతి దీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా ఈ నెల14,15 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జైన్ భగవతి దీక్ష స్వీకరించనున్నారు. సంజనా మాట్లాడుతూ ‘నాకు 12 ఏండ్ల నుంచే జైన తత్వశాస్త్రం, బోధనలపై ఆసక్తి ఏర్పడింది.
అది చివరకు సాధ్వి జీవితాన్ని స్వీకరించే వరకు వెళ్లింది. నాకు రూ. కోట్ల ఆస్తులు, విలాసవంతమైన జీవితం వద్దు అనిపించింది’ అని చెప్పారు. సంజనా తల్లి మమత మాట్లాడుతూ ‘నా బిడ్డ నిర్ణయాన్ని అంగీకరించడం ఎంతో కష్టంగా అనిపించింది. కానీ, ఆమె ఈ విషయంలో ఎంతో పట్టుదలగా ఉంది. మేము అంగీకరించే వరకు తిండి మానేసింది.
ఇక మేం ఒప్పుకోక తప్పలేదు’ అని అన్నారు. సంఘం చైర్మన్, చీఫ్ కన్వీనర్ స్వరూప్‌చంద్ కోఠారి, అధ్యక్షుడు అన్నరాజ్ బఫ్నా, దీక్షా మహోత్సవ ప్లానింగ్ కన్వీనర్ మనోజ్ కోఠారి, ప్రధాన కార్యదర్శి పవన్ కటారియా, కన్వీనర్ ధర్మేందర్ నహర్, దీక్ష కన్వీనర్ సజ్జన్ గాంధీ మాట్లాడుతూ దీక్షా మహోత్సవ్కార్యక్రమానికి డీజీపీ ఆనంద్, హైదరాబాద్ సీపీ సజ్జనార్ హాజరుకానున్నట్లు తెలిపారు.
