ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో తొక్కిసలాట.. 127 మంది మృతి

ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో తొక్కిసలాట.. 127 మంది మృతి

ఇండోనేషియాలోని కంజురుహాన్ స్టేడియంలో ఒక్క సారిగా యుద్ధవాతావరణం నెలకొంది. గ్రౌండ్ లో జరిగిన తొక్కిసలాటలో 127మంది మరణించారు. 180కి పైగా మంది గాయపడినట్లు ఇండోనేషియా పోలీసులు తెలిపారు. తూర్పు జావాలోని మలాంగ్ రీజెన్సీలో శనివారం రాత్రి అరెమా - పెర్సెబయా మధ్య ఫుట్ బాల్ మ్యాచ్ అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది. 

ఈ మ్యాచ్ ను చూసేందుకు ఇరు జట్ల అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియానికి తరలివచ్చారు. అయితే ఈ మ్యాచ్ లో అరెమా జట్టు ఓడిపోవడంతో వేలాది మంది ఆ జట్టు సపోర్టర్స్(ఫ్యాన్స్) గ్రౌండ్ లోకి దూసుకొచ్చారు. దీంతో అక్కడ తీవ్ర ఘర్షణ నెలకొంది. అక్కడే ఉన్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. దీంతో టియర్ గ్యాస్ ప్రయోగించారు. గ్రౌండ్ లోకి భారీ సంఖ్యలో అరెమా జట్టు మద్దతు దారులు రావడంతో తొక్కిసలాట జరిగింది. మరో వైపు పోలీసులు ప్రయోగించి టియర్ గ్యాస్ కారణంగా ఊపిరాడక మొత్తం 127 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 180 మంది తీవ్ర అస్వస్థత, గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

ఈ విషాద ఘటనలో మరణించిన వారిలో ఇద్దరు పోలీస్ అధికారులు కూడా ఉన్నారు. 34మంది స్టేడియంలో మరణించగా, మిగిలినవారు ఆసుపత్రికి తీసుకెళ్తున్న క్రమంలో, మరికొందరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారని స్థానిక అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన ఓ వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఫ్యాన్స్ దూసుకెళ్తున్నట్లు కనిపించింది. ఈ ఘటనపై ఇండోనేషియా ఫుట్‌బాల్ అసోసియేషన్ (PSSI) విచారం వ్యక్తం చేసింది. అనంతరం విచారణకు ఆదేశించింది.