
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కుట్టు అట్ట (బక్‌వీట్ గింజల నుండి తయారయ్యే ఒక రకమైన పిండి) తిని దాదాపు 200 మంది అస్వస్థకు గురయ్యారు. వాంతులు, తీవ్రమైన కడుపు నొప్పితో అల్లాడిపోయిన బాధితులను బాబు జగ్జీవన్ రామ్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. జహంగీర్‌పురి, మహేంద్ర పార్క్, సమయ్‌పూర్, భల్స్వా డైరీ, లాల్ బాగ్, స్వరూప్ నగర్‌లతో సహా వాయువ్య ఢిల్లీలోని వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తులు పుడ్ పాయిజన్‌కు గురయ్యారని వెల్లడించారు పోలీసులు.
పుడ్ పాయిజన్ ఘటనపై ఆహార శాఖను అప్రమత్తం చేశారు పోలీసులు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టారు పోలీసులు. కుట్టు అట్ట ఫుడ్ పాయిజన్ కావడానికి కారణమేంటనే దానిపై ఆరా తీస్తున్నారు. పుడ్ పాయిజన్ జరిగిన ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలో భాగంగా కుట్టు అట్ట అమ్మకాలు నిలిపివేయాలని స్థానిక దుకాణదారులు, విక్రేతలను హెచ్చరించారు పోలీసులు. కుట్టు అట్ట పిండి కలుషితమై పెద్ద సంఖ్యలో ప్రజలు అనారోగ్యానికి గురికావడంతో ఆహార శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు.
కుట్టు అట్టా పిండి:
కుట్టు అట్టా పిండిని బక్‌వీట్ గింజలతో తయారు చేస్తారు. ఈ పిండి గ్లూటెన్ రహితంగా ఉండటమే కాకుండా ప్రొటీన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. కుట్టు అట్టా పిండిని ఎక్కువగా హిందు పండగల్లో నైవేథ్యం తయారు చేయడానికి ఉపయోగిస్తారు. ముఖ్యంగా దేవి నవరాత్రి ఉత్సవాల్లో కుట్టు అట్ట పిండితో వంటకాలు తయారు చేస్తారు.