నియామీ: నైజర్ దేశంలోని సహారా ఎడారిలో దారుణమైన విషాదం చోటుచేసుకుంది. ఎడారి మధ్యలో ట్రక్కు చెడిపోవడంతో అందులోని 49 మంది ప్రయాణికులు నీటికి అలమటిస్తూ మృత్యువాత పడ్డారు. బక్రీద్ పండుగను తమ బంధువులతో జరుపుకోవడానికి పొరుగున ఉన్న మాలి దేశానికి వెళ్లి వస్తుండగా ఈ ఘోరం జరిగింది.
అధికారులు, బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. బక్రీద్ పండుగను బంధుమిత్రులతో జరుపుకోవాలనే ఉద్దేశంతో నైజర్కు చెందిన పలు కుటుంబాలు కలిసి ఓ ట్రక్కులో పక్కనే ఉన్న మాలి దేశం( 300 కిలోమీటర్లు)లోని తల్హందెక్ సిటీకి వెళ్లారు. సహారా ఎడారి మధ్యలో నుంచి మాలిలోకి ఎంటరయ్యారు.
బక్రీద్ పండుగ తర్వాత వారంతా తిరిగి ప్రయాణమయ్యారు. ఈ క్రమంలో ఎడారి మధ్యలో వారు ప్రయాణిస్తున్న ట్రక్కు మొరాయించింది. దీంతో వారంతా తలదాచుకోవడానికి కనీసం నీడ కూడా లేని చోట చిక్కుకుపోయారు. ఎండ వేడిమికి, వడగాడ్పుల కారణంగా నీరు తాగడంతో వెంట తెచ్చుకున్న నీటిపాత్రలు ఖాళీ అయ్యాయి.
వారు చిక్కుకుపోయిన ప్రదేశం నుంచి జనావాసాలు ఉన్న అస్సమాకా ఏరియా దాదాపు 80 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీంతో నడిచి వెళ్లే అవకాశం లేదని గుర్తించిన ప్రయాణికులు.. ఎలాగైనా ట్రక్కును బాగుచేసుకుని ఎడారిలో నుంచి బయటపడాలని ప్రయత్నించారు. అయితే, ఎన్ని ప్రయత్నాలు చేసినా, గంటలు, రోజుల తరబడి ప్రయత్నించినా ట్రక్కు బాగుకాలేదు.
ఓవైపు తెచ్చుకున్న నీళ్లు అయిపోవడం, మరోవైపు ఎండ వేడి పెరగడంతో దాహానికి తట్టుకోలేకపోయారు. ఇద్దరు ప్రయాణికులు మాత్రం ధైర్యం చేసి కాలినడకన బయలుదేరారు. దాదాపు 50 కిలోమీటర్లు నడిచాక నీళ్లు కనిపించడంతో దాహం తీర్చుకున్నారు.
ఆపై మిగతా 30 కిలోమీటర్లు నడిచి అస్సమాక సిటీ చేరుకుని అధికారులకు విషయం తెలియజేశారు. దీంతో అధికారులు వెంటనే బయలుదేరి, రెస్క్యూ సామగ్రితో ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే, అప్పటికే ఆలస్యమైంది. డీహైడ్రేషన్ బారినపడి ట్రక్కులోని 49 మంది ప్రయాణికులు మృత్యువాత పడ్డారు.
ట్రక్కు చుట్టూ డెడ్ బాడీలే..
ఘటనా స్థలంలో అధికారులకు హృదయ విదారక దృశ్యాలు కనిపించాయి. ట్రక్కు కింద, దాని చుట్టుపక్కల 49 మంది డెడ్ బాడీలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. తీవ్రమైన ఎండ, ఉక్కపోత, ఆకలి, దాహాల కారణంగా వారంతా మరణించినట్లు అధికారులు ధ్రువీకరించారు.
పాడైపోయే స్థితికి చేరుకోవడంతో 49 డెడ్ బాడీలకు రెస్క్యూ సిబ్బంది అక్కడికక్కడే సామూహిక అంత్యక్రియలు చేపట్టారు. సాధారణంగా ఆఫ్రికా దేశాల నుంచి ఐరోపా (యూరప్)కు అక్రమంగా వలస వెళ్లేవారు మాత్రమే ఇటువంటి ప్రమాదకరమైన ఎడారి మార్గాలను ఎంచుకుంటారని, స్థానిక పౌరులు ఈ మార్గంలో ప్రయాణించడం చాలా అరుదని అధికారులు తెలిపారు.
