గోవాలో పెను విషాదం.. శిర్గావ్లోని లైరాయ్ దేవి ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి

గోవాలో పెను విషాదం.. శిర్గావ్లోని లైరాయ్ దేవి ఆలయంలో తొక్కిసలాట.. ఏడుగురు మృతి

శిర్గావ్: గోవాలోని ఒక ఆలయంలో తొక్కిసలాట జరిగింది. శుక్రవారం అర్థరాత్రి సమయంలో శిర్గావ్లోని లైరాయ్ దేవి ఆలయం జాతరలో తొక్కిసలాట  జరిగి ఏడుగురు చనిపోయారు. 30 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను గోవా మెడికల్ హాస్పిటల్కు తరలించారు. మరికొందరికి మపుసలోని నార్త్ గోవా డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు. గాయపడి చికిత్స పొందుతున్న వారిని నార్త్ గోవా డిస్ట్రిక్ట్ హాస్పిటల్కు వెళ్లి గోవా సీఎం ప్రమోద్ సావంత్ పరామర్శించారు.

షిర్గావ్ అనేది లైరాయ్ దేవి (श्री लेराई) కొలువుదీరిన పుణ్య స్థలం. ఈ ఆలయం చాలా పురాతనమైనది. గోవాలోని గిరిజన తెగల ఆచారాల ప్రకారం లైరాయ్ దేవి జాతర జరుగుతుంది. గోవాలోని మాపుసాకు చెందిన లైరాయ్-దేవి, మిలాగ్రెస్ సైబిన్(వర్జిన్ మేరీ)లు అక్కాచెల్లెళ్లు అని గోవా హిందువులు, కేథలిక్లు నమ్ముతారు. గోవాలో మత సామరస్యానికి ఈ నమ్మకాలే నిదర్శనం.

లైరాయ్ దేవి ఆలయ నిర్మాణం విలక్షణంగా ఉంది. గోపురం, ఆలయ పై భాగంలో పొడవైన పిరమిడ్ లాంటి టవర్ అలంకరించబడి ఉంటుంది. లైరాయ్ దేవిని పూజించడానికి ఆలయంలో ‘‘ఇగితునా చల్నే’’ అనే జాతర జరుగుతుంది. గోవాలో ఈ జాతర చాలా ఫేమస్. ఈ జాతరకు ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు వస్తుంటారు.

షిర్గావ్ జాతర మే నెల ప్రారంభంలో జరుగుతుంది. ఈ పండుగ తెల్లవారుజామున ప్రారంభమై మరుసటి రోజు తెల్లవారుజాము వరకు కొనసాగుతుంది. భక్తులు స్నానం చేసి, దేవతను పూజించడానికి ఆలయం వరకు నడిచి వెళతారు. అర్థరాత్రి సమీపిస్తున్న కొద్దీ, భక్తులు ఆలయం లోపల పూనకాలతో ఊగిపోతూ నృత్యం చేస్తారు. నృత్య కార్యక్రమాలు అర్ధరాత్రి సమయంలో ముగుస్తాయి. తరువాత ఆలయం సమీపంలోని పెద్ద ఖాళీ స్థలంలో ఉంచిన భారీ కట్టెల కుప్పను ఉపయోగించి నిప్పు పెడతారు.

జాతరలో చివరి ఘట్టం ఇదే. తెల్లవారుజామున మంటలు ఆరిపోయిన తర్వాత, బొగ్గులను కాల్చడం ప్రారంభమవుతుంది. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో, భక్తులు ‘‘దేవి లైరాయ్’’ అని స్తుతిస్తూ తమ కర్రలను పట్టుకుని వేడి బొగ్గుల మీదుగా నడవడంతో జాతర ముగుస్తుంది.