అప్పట్లో సినిమాలు మానేయాలని..

అప్పట్లో సినిమాలు మానేయాలని..

డాన్సర్‌‌‌‌గా, టీవీ సీరియల్ ఆర్టిస్ట్​గా కెరీర్ మొదలుపెట్టింది సుర్వీన్ చావ్లా. టీవీ నటిగా చేస్తుండగానే సినిమాల్లోకి రావాలనే ఆశతో మొదట దక్షిణాది వైపు వచ్చింది. కన్నడ, తెలుగు, తమిళ, పంజాబీ, హిందీ భాషల్లో నటించింది. ప్రస్తుతం హిందీ ప్రాజెక్ట్స్​తో బిజీగా ఉంది. లేటెస్ట్​గా ‘రానా నాయుడు’ సిరీస్​లో రానా భార్య పాత్రలో కనిపించిన సుర్వీన్​ గురించి తన మాటల్లోనే..

‘‘నేను పుట్టి పెరిగింది చండీగఢ్​లో. అక్కడే విమెన్స్ కాలేజీలో చదువుకున్నా. ఇంగ్లిష్​లో గ్రాడ్యుయేషన్​ పూర్తి చేశా. చదువుకునే రోజుల్లోనే డాన్సర్, మోడల్ లేదా యాక్ట్రెస్​ అవ్వాలని కలలు కనేదాన్ని. అందుకోసం డాన్స్ నేర్చుకున్నా. 2003లో టీవీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టా. నా మొదటి సీరియల్​ ‘కహీ తో హోగా’లో నెగెటివ్​ రోల్​ చేశా. ఆ తర్వాత ‘కసౌటి జిందగీ కే’, ‘కాజల్’​ వంటి సీరియల్స్​లో నటించా. ‘ఫియర్ ఫ్యాక్టర్ ఇండియా 2’ అనే రియాలిటీ షోలో కంటెస్టెంట్​గా పార్టిసిపేట్​ చేశా. అలా 2008 వరకు రియాలిటీ షోల్లో చేశా. అంతేకాదు... హోస్ట్​గా ‘కామెడీ సర్కస్ కె సూపర్ స్టార్’, ‘రంగోలి’ వంటి ప్రోగ్రామ్స్ చేశా. 
ఒకవైపు ఇవి చేస్తూనే సినిమా అవకాశాలు వెతుక్కున్నా. మొదట సౌత్​ ఫిల్మ్​ ఇండస్ట్రీలో నటించాలనే కోరికతో 2008లో ‘పరమేశ పాన్​వాలా’ అనే కన్నడ సినిమా చేశా. ఆ తర్వాతి ఏడాది శర్వానంద్​ హీరోగా చేసిన ‘రాజు మహారాజు’ అనే తెలుగు సినిమాలో నటించా. అక్కడ చేశాక మళ్లీ నార్త్​ ఇండస్ట్రీ వైపు వెళ్లా. పంజాబీలో ‘తౌర్ మిత్రన్ ది’, హిందీలో ‘హమ్ తుమ్ షబానా’ ఈ రెండు సినిమాలు 2011లో రిలీజ్ అయ్యాయి. అలాగే తమిళంలో ‘పుతియా తిరుప్పంగల్’లో నటించా. ఇన్ని భాషల్లో కేవలం మొదటిసినిమాతో సరిపెట్టుకోలేదు. అవకాశం ఏ వైపు నుంచి వచ్చినా నచ్చితే నటించా. సినిమా కెరీర్​ మొదట్లో తమిళ, హిందీ, పంజాబీ భాషల్లో ఎక్కువ సినిమాలు చేశా. ఆ తర్వాత ఎక్కువగా హిందీలోనే అవకాశాలు వస్తుండడంతో అవే చేశా. 


మళ్లీ టీవీ సీరియల్స్​లో నటించను


మొదట నాకు టీవీ వల్లే పేరొచ్చింది. ఒకసారి సౌత్​ ఇండస్ట్రీలో సినిమా ఆడిషన్​కి వెళ్తే టీవీ సీరియల్స్​లో నటించానని తెలిసి అవకాశం ఇవ్వలేదు. అలా ఎందుకంటే ‘ఇప్పటికే ప్రేక్షకులకు ఎలాంటి క్యారెక్టర్స్ చేశావో తెలుసు. ఇప్పుడు సినిమాల్లోకి తీసుకుంటే ఆడియెన్స్​కి కొత్తదనం కనిపించదు. ఈ సినిమాకు కొత్త వాళ్లను తీసుకోవాలనుకున్నాం. భాష వేరైనా అక్కడ బాగానే పాపులారిటీ ఉంది నీకు​. కాబట్టి ఈ అవకాశం ఇవ్వలేం’ అని చెప్పారు. అది విని నేను షాక్​ అయ్యా. ఆ తర్వాత మరోసారి వేరే సినిమా ఆడిషన్​కి వెళ్లా. అప్పుడు నా టీవీ ఎక్స్​పీరియెన్స్ తక్కువ చేసి చెప్పా. కానీ, సినిమాల్లో నటించడం కోసం నేనెందుకు అబద్ధం చెప్పాలి? అనుకున్నా. ఆ తర్వాత నుంచి ఎప్పుడు ఆడిషన్స్​కి వెళ్లినా నేను టీవీ సిరీయల్స్​లో నటించా. ప్రోగ్రామ్స్ కూడా చేశా. నాకు ఇన్ని సంవత్సరాలు నటనలో ఎక్స్​పీరియెన్స్ ఉంది అని ముందే చెప్పేదాన్ని.


పెండ్లి విషయం దాచడానికి..


నా భర్త పేరు అక్షయ్ థక్కర్​. బిజినెస్​మ్యాన్. మా పెండ్లి 2015లో ఇటలీలో జరిగింది. ఇప్పుడు ఒక పాప. తన పేరు ఇవా థక్కర్. నాకు అక్షయ్​తో పరిచయం అయిన కొన్ని నెలల్లోనే పెండ్లి చేసుకోవాలి అనుకున్నాం. అలా అనుకున్న వెంటనే ఇద్దరం మా ఇళ్లలో చెప్పాం. మా పెండ్లికి చాలా తక్కువమంది గెస్ట్​లను పిలిచాం. అందుకే నాకు పెండ్లయిన విషయం చాలా రోజులు ఇండస్ట్రీకి తెలియదు. నేను ఆ విషయాన్ని 2017లో ట్విట్టర్​లో పోస్ట్ చేశా. అప్పటివరకు నా కెరీర్​, పెండ్లి మీద ఎన్ని వార్తలు వచ్చినా ఈ విషయం మాత్రం సీక్రెట్​గానే ఉంచా. అలా ఉండడానికి కారణం... ఒక నటి పెండ్లి చేసుకుంటే రకరకాల మాటలు వస్తాయి. ‘ఇక ఆమె కెరీర్ అయిపోయింది. నటనకు చెక్ పెట్టేస్తుంది. హీరోయిన్​గా పనికిరాదు. లావైపోయింది. అందంగా లేదు. మళ్లీ రావాలంటే కొంతకాలం బ్రేక్ తీసుకోవాల్సిందే..’ వంటి మాటలు వినాల్సి వస్తుంది. అది నాకు నచ్చదు. ఈ సమస్య నటీమణులకే కాదు... వర్క్​ చేస్తున్న ఏ మహిళనైనా పెండ్లి కాకముందు ఒకలా, అయ్యాక మరోలా చూస్తుంది సొసైటీ. పెండ్లి అయిన మహిళని నిరుత్సాహపరచడం, కొన్ని పనులకు దూరం పెట్టడం వంటివి చేస్తుంటారు. అలా చేయడం నాకు నచ్చదు. అంత తేడా చూపించాల్సిన అవసరం లేదు అంటా నేను. అందుకనే బాగా ఆలోచించాక నా పెండ్లి విషయం బయటకు చెప్పా. 


బ్రేక్​ తీసుకోలేదు


నా కెరీర్​ 2003లో మొదలుపెట్టా. ఇప్పటివరకు కంటిన్యూ అవుతూనే ఉన్నా. పెండ్లికి ముందు కెరీర్ ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలానే ఉంది. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు సక్సెస్​ఫుల్​గా సాగుతోంది. ఇంత పెద్ద జర్నీలో ఎలాంటి రిగ్రెట్స్ లేవు. పెండ్లి అయ్యాక నా భర్త సపోర్ట్​తో సంతోషంగా నటిస్తున్నా. సరైన టైంలో, సరైన నిర్ణయం తీసుకోవాలి అంటారు కదా. ఆ విషయం నేను సరిగ్గా ఫాలో అయ్యా అనిపిస్తుంది. అక్షయ్​ లాంటి భర్త దొరకడం నా అదృష్టం. నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటాడు. మా రెండు ఫ్యామిలీలు ఎప్పుడు కలిసినా చాలా సంతోషంగా ఉంటాం.   
నేను ఇంత పేరు సంపాదించుకున్నానంటే దానికి కారణం నా ఫ్యామిలీ. వాళ్ల సపోర్ట్ వల్లే ఈరోజు నేను ఇక్కడ ఉన్నా. నేనేమైనా సాధించానంటే అందులో మా అమ్మానాన్న సపోర్ట్, ఎంకరేజ్​మెంట్ చాలా ఉంది. పెండ్లయ్యాక భర్త సపోర్ట్​ కూడా తోడైంది.


మానేయాలనిపించింది


‘హేట్ స్టోరీ 2’తో నార్త్​లో బాగా పేరొచ్చింది. కానీ, ఆ తర్వాత నుంచి అలాంటి పాత్రలే వచ్చేవి. ఆ సినిమాలో బోల్డ్​గా కనిపించడం వల్ల ప్రతి సినిమాలో అలాంటి రోల్స్ ఆఫర్ చేసేవాళ్లు. బోల్డ్, సెక్సీ రోల్స్​కి మాత్రమే పనికొస్తా అన్నట్లు తయారైంది పరిస్థితి. దాంతో చిరాకొచ్చి, ఏ ప్రాజెక్ట్ ఒప్పుకోలేదు. కొంతకాలం గ్యాప్ వచ్చినా ఫర్వాలేదు. కానీ, అలాంటి రోల్స్ రిపీట్ చేయకూడదనుకున్నా. ఆ టైంలోనే ఒకసారి సినిమాలు మానేస్తే సరిపోతుంది అనిపించేంత చిరాకొచ్చింది.’’ 

  •  ప్రజ్ఞ


రానా నాయుడు గురించి..


‘డి కపుల్డ్’ అనే కామెడీ సిరీస్​ తర్వాత చేసిన వెబ్ సిరీస్ రానా నాయుడు. ‘డి కపుల్డ్​’లో​ ఆర్​. మాధవన్​తో కలిసి నటించడం చాలా ఎంజాయ్ చేశా. ఇప్పుడు యాక్షన్​ క్రైమ్ డ్రామాగా ఉన్న ‘రానా నాయుడు’లో నటించడం డిఫరెంట్ ఎక్స్​పీరియెన్స్ ఇచ్చింది. రానా నాయుడులో నా క్యారెక్టర్​ చాలా నచ్చింది. ఆడియెన్స్​కి కూడా నచ్చిందనే అనుకుంటున్నా. వెంకటేష్​, రానాలతో ఒకేసారి కలిసి పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. వాళ్లిద్దరు పెద్ద స్టార్స్. ఒకరేమో సీనియర్ యాక్టర్. ఇంకొకరేమో పాన్ ఇండియా యాక్టర్. వీళ్లిద్దరి కాంబినేషన్​లో... నేను వాళ్లతో కలిసి వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. షూటింగ్​ టైంలో వెంకటేష్​ ఎలా ఉంటారు? యాక్టింగ్ ఎలా చేస్తున్నారు? అని అబ్జర్వ్ చేసేదాన్ని. ఎందుకంటే సీనియర్ యాక్టర్స్ చాలా ఈజీగా నటించేస్తారు. వాళ్లను చూస్తూ ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు.