
బీజింగ్: చైనాకు చెందిన ఒక మహిళ కొడుకు లా స్కూల్ ఎగ్జామ్ లో పాస్ కావడం తన వల్ల కాదని చేతులేత్తేశాడు. తల్లి మాత్రం కొడుకు స్టడీ మెటీరియల్ తో అదే ప్రవేశ పరీక్షకు సిద్ధమైంది. 50 ఏండ్ల వయసులో పాసై అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచింది. చైనాలోని షాన్‌డాంగ్ ప్రావిన్స్ జినింగ్ కు చెందిన యాంగ్ అనే మహిళ1990లో షాంఘైలోని టోంగ్జీ వర్సిటీ నుంచి కెమిస్ట్రీలో బ్యాచిలర్ డిగ్రీని పొందింది. 2013లో జరిగిన ఒక ప్రమాదంలో ఆమెకు తీవ్రమైన గాయాలయ్యాయి.
దీంతో ఆమె ఎడమ చేయి పూర్తిగా పని చేయకుండా పోయింది. కుడిచేయి కూడా సగం చచ్చుబడిపోయింది. ముఖం, చేతులకు తీవ్రమైన గాయాలు కావడంతో బయటకొచ్చినప్పుడల్లా ఆమె మాస్క్ ధరించేది. ఈ క్రమంలోనే డిప్రెషన్, పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ కు గురైంది. చివరకు ఆమె తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి చాలా సంవత్సరాల క్రితం నుంచే పెన్షన్ పొందడం ప్రారంభించింది. రెండేండ్ల క్రితం యాంగ్ కొడుకు లా స్కూల్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ లో ఫెయిలయ్యాడు.
ఆ స్టడీ మెటీరియల్ అవసరం తీరిపోయిందని తల్లి, కొడుకు భావించారు. చివరకు ఇంట్లో సర్దడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే కొన్ని పేజీలను ఆమె చదివి అవి కష్టంగా లేవని గ్రహించింది. అదే స్టడీ మెటీరియల్ తో ఎగ్జామ్ కు ప్రిపేర్ కావడం మొదలుపెట్టింది. ఆమెకు ప్రారంభంలో కొన్ని ఎదురుదెబ్బలు తగిలాయి.
అయినప్పటికీ, గట్టిగా ప్రయత్నించి ఎగ్జామ్ లో పాసైంది. చివరకు యునాన్ ప్రావిన్స్ కున్మింగ్ లోని సౌత్ వెస్ట్ ఫారెస్ట్రీ విశ్వవిద్యాలయంలోని పోస్ట్ గ్రాడ్యుయేట్ లా స్కూల్‌లో చేరింది. ప్రారంభంలో తనకు అనేక సవాళ్లు ఎదురయ్యాయని యాంగ్ తెలిపింది. భర్త, కొడుకు మద్దుతుతో ఈ ఎగ్జామ్ లో పాస్ అయ్యానని పేర్కొంది.