ట్రైన్‍ ఎక్కకున్నా..డైలీ టిక్కెట్లు కొంటున్రు

ట్రైన్‍ ఎక్కకున్నా..డైలీ టిక్కెట్లు కొంటున్రు
  •     వరంగల్‍ నెక్కొండ స్టేషన్​లో హాల్టింగ్‍ కోసం రోజూ ఇదే పని 
  •     30 టిక్కెట్లు తీసుకుంటున్న 'నెక్కొండ పట్టణ రైల్వే టికెట్స్​ఫోరం’ వాట్సాప్‍ గ్రూప్​

వరంగల్‍/నెక్కొండ, వెలుగు :  వరంగల్‍ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్​లో ప్రయాణికులు ట్రైన్‍ ఎక్క కున్నా.. రోజూ టిక్కెట్లు కొనుక్కుంటున్నారు. మరో రెండున్నర నెలలు ఇలానే కొనేందుకు సిద్ధమయ్యారు. దీని కోసం నెక్కొండ పట్టణ రైల్వే టికెట్స్​ఫోరం పేరిట ఓ వాట్సాప్‍ గ్రూప్‍ క్రియేట్‍ చేసుకున్నారు. రూ.30 వేల చందాలు వసూలు చేసి రోజూ టికెట్లు కొంటున్నారు. నర్సంపేట నియోజకవర్గ పరిధిలో హైదరాబాద్‍–విజయవాడ రూట్​లో నెక్కొండ రైల్వే స్టేషన్‍ ఉంటుంది. కానీ, ఇక్కడ శాతవాహన, నవజీవన్‍, పద్మావతి, గౌతమి, ఇంటర్‍ సిటీ, మణుగురు ప్యాసింజర్ల వంటి ప్రధాన రైళ్లకు హాల్టింగ్‍ లేదు.

నెక్కొండతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు, స్టూడెంట్లు, వ్యాపారులు, కూలీలు హైదరాబాద్‍, విజయవాడ, సూరత్‍ ప్రాంతాలకు, రైతులు గుంటూరు వెళ్తుంటారు. అందుబాటులో నెక్కొండ స్టేషన్‍ ఉన్నా.. ప్రధాన రైళ్లకు హాల్టింగ్​లేకపోవడంతో 50 కిలోమీటర్ల దూరంలోని వరంగల్‍ వెళ్లాల్సి వస్తోంది. దీనికితోడు పర్వతగిరి మండలంలోని అన్నారం దర్గా షరీఫ్​కు వివిధ రాష్ట్రాల నుంచి వేలాది మంది వచ్చి పోతుంటారు. వీరికి నెక్కొండలో స్టాప్‍ లేక ఇబ్బందులు పడుతున్నారు. సమస్య గురించి   ప్రజాప్రతినిధులకు చెప్పినా పని కాలేదు. అప్పటి బీజేపీ లీడర్ల సాయంతో రైల్వే శాఖ మంత్రిని కలిసి సమస్య వివరించగా జనవరి 30న ఇంటర్‍సిటీ సూపర్‍ ఫాస్ట్​ఎక్స్​ప్రెస్ ఆపేందుకు గ్రీన్‍సిగ్నల్‍ ఇచ్చారు. అదేటైంలో 3 నెలలపాటు ట్రైన్‍ పాస్‍లతో సంబంధంలేకుండా ప్రతిరోజూ 30 టిక్కెట్లు కొనాలని, లేదంటే హాల్టింగ్‍ క్యాన్సల్‍ అవుతుందని కండీషన్ పెట్టారు. దీంతో ‘నెక్కొండ పట్టణ రైల్వే టికెట్స్ ఫోరం’పేరుతో 400 మంది కలిసి వాట్సాప్‍ గ్రూప్‍ ఏర్పాటు చేశారు. చందాల రూపంలో రూ.30 వేలు వసూలు చేసి రోజూ 30 టిక్కెట్లు కొంటున్నారు. మరో రెండున్నర నెలలు ఇలానే చేస్తే రైల్వే శాఖ అధికారులు ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.