వెంకటాపూర్​లో బీఆర్ఎస్ ప్రచార రథాన్ని అడ్డుకున్న రైతులు

వెంకటాపూర్​లో బీఆర్ఎస్ ప్రచార రథాన్ని అడ్డుకున్న రైతులు

సిద్దిపేట(నంగునూరు), వెలుగు: గత ఎన్నికల్లో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పిఇప్పటికి అమలు చేయక పోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మండలంలోని వెంకటాపూర్​లో బీఆర్ఎస్ ప్రచార రథాన్ని అడ్డుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వెంకటాపూర్​లోకళాకారులు పాటలు పాడుతూ ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. 

ఈ సమంయలో  పలువురు రైతులు అక్కడికి చేరుకుని  లక్ష రూపాయల రుణమాఫీ పూర్తిగా జరగలేదని,  గ్రామంలో ఎంతో మంది అర్హులున్నా  బీసీ బంధు  ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి ఇచ్చారని బీఆర్ఎస్​ నాయకులను నిలదీశారు. ఈ సందర్బంగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు అక్కడికి చేరుకుని  ఇరు వర్గాలను సముదాయించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రచారాన్ని అడ్డుకోవద్దని సూచించడంతో రైతులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. 

 

 మహిళల ఆందోళన

సిద్దిపేట రూరల్: సిద్దిపేట అర్బన్ మండలం నాంచార్ పల్లి గ్రామంలో ప్రచారానికి వచ్చిన బీఆర్ఎస్​ నాయకులతో మహిళలు గొడవకు దిగారు. తమ గ్రామం పై నాయకులు చిన్న చూపు చూస్తున్నారని, కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే వచ్చి హామీలు ఇచ్చి వెళ్తున్నారు కానీ పనులు చేయడం లేదని మండిపడ్డారు. రోడ్ల నిర్మాణంలో భాగంగా ఇళ్ల ముందున్న మోరీలను కూల్చి వేయడంతో నీరు నిలిచి దుర్వాసన వస్తోందన్నారు. 

ALSO READ : కంటికి రెప్పలా కాపాడుకుంటా : చింత ప్రభాకర్

కాలువ నిర్మాణ కోసం భూములు కోల్పోయిన బాధితులకు బీఆర్ఎస్ నాయకులు న్యాయం చేయలేదని వాపోయారు. రైతు రుణమాఫీ అందరికీ చేయలేదన్నారు. ఈ సందర్భంగా సుడా చైర్మన్ మా రెడ్డి రవీందర్ రెడ్డి మహిళలతో మాట్లాడుతూ ఎన్నికల అనంతరం అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని, రైతు రుణమాఫీ అందరికీ అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గొడవ సద్దుమణిగింది.