ఏటీఎఫ్​ ధర 4 శాతం తగ్గింపు.. వాణిజ్య ఎల్పీజీ రేటు రూ. 1.5 తగ్గింపు

ఏటీఎఫ్​ ధర 4 శాతం తగ్గింపు.. వాణిజ్య ఎల్పీజీ రేటు రూ. 1.5 తగ్గింపు

న్యూఢిల్లీ : విమానాల్లో వాడే జెట్ ఇంధనం/ఏటీఎఫ్​ ధర 4 శాతం తగ్గింది. వరుసగా మూడవ నెలలోనూ దీని ధర తగ్గింది. వాణిజ్య వంట గ్యాస్ (ఎల్పీజీ) రేటు స్వల్పంగా తగ్గింది. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా 19 కిలోల సిలిండర్‌‌‌‌ ధరను రూ. 1.50 తగ్గించారు. అయితే, దేశీయ ఎల్పీజీ ధర మారలేదు. 14.2 కిలోల సిలిండర్‌‌‌‌ ధర రూ. 903 ఉంది.  ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్​ (ఏటీఎఫ్​) ధర రూ. 4,162.5 లేదా 3.9 శాతం తగ్గింపుతో, దేశ రాజధానిలో కిలోలీటరుకు రూ. 101,993.17కి తగ్గింది. జెట్ ఇంధన ధరల్లో నెలవారీ తగ్గింపు ఇది వరుసగా మూడోది. ఏటీఎఫ్​ ధర నవంబర్‌‌‌‌లో దాదాపు 6 శాతం (కిలోలీటరుకు రూ. 6,854.25)  డిసెంబర్‌‌‌‌లో రూ. 5,189.25 లేదా 4.6 శాతం తగ్గింది.

మూడు రౌండ్‌‌‌‌ల తగ్గింపు వల్ల ప్రతి కిలోలీటరుకు రూ. 29,391.08 చొప్పున.. అంటే దాదాపు 45 శాతం తగ్గింది. విమానయాన సంస్థ నిర్వహణ వ్యయంలో 40 శాతంగా ఉండే జెట్ ఇంధనం ధర తగ్గింపు, ఇప్పటికే ఆర్థికంగా కష్టాల్లో కూరుకుపోయిన విమానయాన సంస్థలపై భారాన్ని తగ్గించనుంది. 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ రేటు ఇప్పుడు దేశ రాజధానిలో రూ. 1,755.50,  ముంబైలో రూ. 1,708.50 ఉంది.  ప్రభుత్వ యాజమాన్యంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తెలిపింది.